పాతది పనికిరాదు కొత్తది ప్రారంభం కాదు

ABN , First Publish Date - 2020-12-01T05:03:43+05:30 IST

అశ్వారావుపేట మండల పరిషత్‌ కార్యాలయ భవనం రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంది. నేతల ప్రతిష్ఠలకు పోవడం, స్థానిక రాజకీయాలు వెరసి రూ. కోటితో నిర్మించిన మండల పరిషత్‌ కార్యాలయ భవనం ఏడాదిన్నరగా ప్రారంభానికి నోచుకోవడం లేదు.

పాతది పనికిరాదు కొత్తది ప్రారంభం కాదు
ప్రారంభం కాని కొత్త భవనం

అశ్వారావుపేట మండలపరిషత్‌ కార్యాలయానికి రాజకీయ గ్రహణం

నిర్మాణం పూర్తయి ఏళ్లు గడిచినా ప్రారంభం కాని వైనం

శిథిలావస్థకు ప్రస్తుత కార్యాలయం

బిక్కుబిక్కుమంటూ సిబ్బంది విధులు

అశ్వారావుపేట, నవంబరు 30: అశ్వారావుపేట మండల పరిషత్‌ కార్యాలయ భవనం రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంది. నేతల ప్రతిష్ఠలకు పోవడం, స్థానిక రాజకీయాలు వెరసి రూ. కోటితో నిర్మించిన మండల పరిషత్‌ కార్యాలయ భవనం ఏడాదిన్నరగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. గత ఎన్నికల ముందే ఈ భవనం పూర్తయింది. అప్పట్లో కొంత నిర్లక్ష్యం, ఆ తరువాత ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఈ భవనం ప్రారంభం కాలేదు. ఎన్నికల తరువాత నియోజకవర్గ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలుపొందారు. ఆ తరువాత జరిగిన స్థానిక ఎన్నికలలోను, పార్లమెంట్‌ ఎన్నికలలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందటంతో నియోజకవర్గంలో రాజకీయాలు చిందర వందరగ మారాయి. దీంతో ఈ భవనాన్ని ఎవరితో ప్రారంభింపచేయాలనే మీమాంసలో అధి కారులు ఉన్నారు. భవనం పూర్తయి రెండేళ్లు కావస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. భవనం ప్రారంభం కాకుండానే శిథిలావస్థకు చేరుతోంది.

పూర్తిగా శిథిలమైన భవనం

అశ్వారావుపేట మండల పరిషత్‌ కార్యాలయం నడుస్తున్న ప్రస్తుత భవనం 1960లో నిర్మించారు. ఈ భవనం శిథిలమైపోయింది. సమావేశపు మందిరం, వెనుక వైపు ఉన్న వరండాల్లో రేకులు పగిలిపోయి, వర్షం వస్తే కురుస్తోంది. గోడలు పెద్ద పెద్ద బీటలు వారి కూలిపోతున్నాయి. కొత్త భవనం నిర్మించినా రాజకీయ కారణాలతో ప్రారంభోత్సవం వాయి దా పడుతూ వస్తుంది. గత నెలలో మంత్రి పువ్వాడ అజయ్‌ చేతులమీదుగా భవనం ప్రారంభం అవుతుందని అధికారులు హడావుడి చేశారు. చివరి క్షణంలో అది వాయిదా పడింది. రాజకీయ కారణాలతో భవనంను ప్రారంభించకపోవడం పట్ల ప్రజలలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.


Updated Date - 2020-12-01T05:03:43+05:30 IST