పనులు చేయని అధికారులు వెళ్లిపోవచ్చు

ABN , First Publish Date - 2020-12-04T04:39:08+05:30 IST

మండలంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి నిర్మాణ పనులను చేయని అధికారులు వెళ్లిపోవచ్చని ఎంపీపీ రజితమ్మ హెచ్చరించారు.

పనులు చేయని అధికారులు వెళ్లిపోవచ్చు

-  మండల సమావేశంలో ఎంపీపీ రజితమ్మ

    వడ్డేపల్లి, డిసెంబరు 3 : మండలంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి నిర్మాణ పనులను చేయని అధికారులు వెళ్లిపోవచ్చని ఎంపీపీ రజితమ్మ హెచ్చరించారు. వడ్డేపల్లి మహిళా సమాఖ్య కార్యాలయంలో ఎంపీడీఓ రవీంద్ర ఆఽధ్వర్యంలో గురువారం  నిర్వహించిన మండల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత  సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన పనులపై పురోగతి లేదని, సభ్యులకు సమాధానాలు చెప్పలేని అధికారులు ఎందుకని నిలదీశారు.  గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, రైతు వేదిక పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రామాపురంలో విద్యుత్‌ సమస్యతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు  చేయాలని సర్పంచు బీసన్న అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జిల్లెడుదిన్నె చెరువు కబ్జాకు గురైందని, దానిపై వివరణ ఇవ్వాలని తహసీల్దార్‌ను కోరగా తమకు సమాచారం లేదన్నారు. గ్రామాల్లోని అభివృద్ది పనులకు ఇసుక అనుమతులు ఇవ్వడం లేదని అధికారులను ప్రశ్నించారు. ఇంటర్నెట్‌ కేబుల్‌పేరుతో రామాపురం, జిల్లెడుదిన్నె గ్రామాల మధ్యన రోడ్డుకు ఇరువైపుల నాటిన చెట్లను తొలగిస్తుంటే పంచాయతీ కార్యదర్శులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొంకలలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిం చి కొట్టం నిర్మించుకోగా గ్రామకార్యదర్శి ఓబులమ్మకు సమాచారం ఇచ్చినా పొంతన లేని సమాధానం చెబుతున్నారని వైస్‌ ఎంపీపీ తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ రాజు, వైస్‌ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి, ఎంపీఓ భాస్కర్‌ వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:39:08+05:30 IST