మద్దిశెట్టి వర్గానికే ఎంపీపీ

Sep 25 2021 @ 01:31AM

ముండ్లమూరు, సెప్టెంబరు 24 : ముండ్లమూరు ఎంపీపీ పదవి ఎట్టకేలకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ వర్గానికే దక్కింది. నాలుగు రోజుల నుంచి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వర్గీయుల మధ్య నువ్వా?, నేనా? అన్నట్లు పోటీ నడిచింది. దీంతో ఎవరిని పదవి వరిస్తుందనే ఆసక్తి నెలకొంది. చివరికి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ సిఫార్సు చేసిన వేముల -1 ఎంపీటీసీ సభ్యురాలు సుంకర సునీతకే పదవి దక్కింది. వైస్‌ ఎంపీపీగా మండలంలోని ఉమామహేశ్వర అగ్రహారం ఎంపీటీసీ సభ్యురాలు వేముల పద్మ కో-ఆప్షన్‌ సభ్యురాలిగా వేములకు చెందిన షేక్‌ బుడ్డి  ఎన్నికయ్యారు. ఉదయం 10:30 గంటలకు ఐదుగురు ఎంపీటీసీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి బూచేపల్లి వర్గం దూరంగా ఉంది. కోరం లేకపోవడంతో సమావేశం నిలిచిపోయింది. ఆ తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు బూచేపల్లి శిబిరంలో ఉన్న ఏడుగురు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు, ముగ్గురు టీడీపీ సభ్యులు, ఒక బీజేపీ సభ్యుడు సమావేశానికి హాజరయ్యారు. దీంతో కోరం కావడంతో ఎంపీపీ ఎన్నిక జరిగింది. అధిష్ఠానం ఒత్తి మేరకు బూచేపల్లి వర్గం కూడా ఎంపీపీగా సుంకర సునీతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి నాయుడుపాలెం ఎంపీటీసీ బంకా రమణమ్మ మాత్రం గైర్హాజరయ్యారు. ఎంపీపీగా ఎన్నికైన సుంకర సునీతకు రిటర్నింగ్‌ అధికారి ధనరాజ్‌ చేతుల మీదుగా ధ్రువీకరణపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ సునీతకు ఎంపీపీ ఎన్నిక పత్రాన్ని అందజేస్తూ అభినందించారు. 

వారం రోజుల నుంచి ఎంపీపీ పదవికి సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి, గుణపాటి వెంకటేశ్వరరెడ్డిల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో నడిచింది. ఎట్టకేలకు ఎమ్మెల్యే తనదైన శైలిలో పావులు కదిపి సునీతకు ఎంపీపీ పదవి దక్కించుకోగలిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్శి సీఐ ఎం భీమానాయక్‌ ఆధ్వర్యంలో ముండ్లమూరు, కురిచేడు ఎస్‌ఐలు వెంకట సైదులు, పులి శివనాగరాజు, మరో ఎనిమిది మండలాలకు చెందిన ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.