విలువలేనప్పుడు.. వేదికపైకా?

ABN , First Publish Date - 2022-06-25T05:29:37+05:30 IST

అధికారాలకు విలువ ఇవ్వరు.. పొటోకాల్‌ పాటించరు.. ఇక ఈ పదవి ఎందుకంటూ పిడుగురాళ్ల ఎంపీపీ ముడేల రమణమ్మ నిరసన తెలిపారు.

విలువలేనప్పుడు.. వేదికపైకా?
ఎంపీడీఓ కార్యాలయం వద్ద చెట్టుకింద ఎంపీపీ ముడేల రమణమ్మ,

చెట్టుకింద పిడుగురాళ్ల ఎంపీపీ నిరసన  

మండల సమావేశంలో ఎంపీడీవోపై రమణమ్మ ఆగ్రహం

మమ్మల్ని ఇబ్బంది పెట్టటం సరికాదని ఎంపీడీవో ప్రతి సమాధానం 


పిడుగురాళ్ల, జూన్‌ 24: అధికారాలకు విలువ ఇవ్వరు.. పొటోకాల్‌ పాటించరు.. ఇక ఈ పదవి ఎందుకంటూ పిడుగురాళ్ల ఎంపీపీ ముడేల రమణమ్మ నిరసన తెలిపారు.  అధికార పార్టీ ఎంపీపీ నిరసనతో మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రొటోకాల్‌ రగడ తారాస్థాయికి చేరింది. ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన రమణమ్మకు ప్రత్యేక గది కేటాయింపు, ప్రొటోకాల్‌,  ఎంపీపీగా తానుండగా మరొకరు అధికారాన్ని చెలాయిస్తుండటాన్ని రమణమ్మ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయినా వారి తీరులో మార్పు రాలేదంటూ నిరసన తెలిపారు శుక్రవారం మండల పరిషత్‌ సమావేశం ఏర్పాటు చేయగా ఆమె తొలుత కార్యాలయ ప్రాంగణంలోని చెట్టు కింద భర్త సుబ్బారెడ్డితో కలసి కూర్చొన్నారు. సమావేశం మొదలయ్యాక కూడా హాల్లోకి వెళ్లకుండా గంటసేపు చెట్టుకింద అరుగుపైనే కూర్చొన్నారు. అధికారులు ప్రొటోకాల్‌ పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొందరు ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు రమణమ్మకు నచ్చచెప్పారు. దీంతో ఆమె సమావేశ మందిరంలోకి వెళ్లి వేదికపై కాకుండా ఎంపీటీసీల మధ్య కూర్చున్నారు. మరికొందరు ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు ఎంపీడీవో కాశయ్య ఎంపీపీని వేదికపైకి వెళ్లాలని  కోరారు. అయితే ప్రొటోకాల్‌ విషయం తేలే వరకు వెళ్లేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు నచ్చజెప్పటంతో చివరకు వేదికపైకి వెళ్లి అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. అనంతరం ఎంపీడీవో వైపు చూస్తూ ఏడాది కాలంగా చెప్తున్నా ప్రొటోకాల్‌ విషయం ఎందుకు తేల్చరని, తనకు కేటాయించిన గదిలో మరొకరు కూర్చుంటే మీరేమి చేస్తున్నారని, ఎంపీపీ గది తాళాలు పూర్తిగా నాకే ఇచ్చేయ్యాలని, నా గదికి మరొకరు రాకుండా చూడాలని ఎన్నిసార్లు చెప్తున్నా పట్టించుకోరా అని ఆమె ప్రశ్నించారు. దీంతో  ఎంపీడీవో మాట్లాడుతూ మీకు మీకు మధ్య ఏమైనా ఉంటే బయట తేల్చుకోవాలని, అధికారులను ఇబ్బంది పెట్టటం ఏమిటి, మమ్మల్ని ఉద్యోగం చేయమంటారా లేదా వెళ్లిపోమంటారా అంటూ గట్టిగా ప్రతిసమాధానమిచ్చారు. కొందరు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని సమావేశాన్ని కొనసాగించేలా చేశారు. 

Updated Date - 2022-06-25T05:29:37+05:30 IST