Venkayya Naidu: సెషన్ల పేరుతో అరెస్టుల నుంచి తప్పించుకునే విశేషాధికారం ఎంపీలకు లేదు

ABN , First Publish Date - 2022-08-05T23:03:22+05:30 IST

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయనే కారణంగా క్రిమినల్ కేసుల్లో అరెస్టుల నుంచి ఎంపీలకు ఎలాంటి మినహాయింపు లేదని..

Venkayya Naidu: సెషన్ల పేరుతో అరెస్టుల నుంచి తప్పించుకునే విశేషాధికారం ఎంపీలకు లేదు

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయనే కారణంగా క్రిమినల్ కేసుల్లో అరెస్టుల నుంచి ఎంపీలకు ఎలాంటి మినహాయింపు లేదని, అలాంటి విశేషాధికారాలు ఏవీ ఎంపీలకు లేవని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారంనాడు రాజ్యసభలో స్పష్టత ఇచ్చారు.


దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగపరుస్తోందంటూ కాంగ్రెస్ సభ్యులు శుక్రవారంనాడు రాజ్యసభలో ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం 11.30 వరకూ సభాకార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఉదయం సభా కార్యక్రమాలను వెంకయ్యనాయుడు చేపట్టిన కొద్ది నిమిషాల్లోనే సభ వాయిదా పడింది. పదిమందికి పైగా కాంగ్రెస్ సభ్యులు పోడియం వైపు దూసుకు వెళ్లారు. దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రాజ్యసభలో విపక్ష కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేకు ఈడీ మంగళవారం సమన్లు పంపడం ద్వారా అవమానించిందని వారు నిరసన తెలిపారు. దీంతో 11.30 గంటల వరకూ సభవాయిదా పడింది. తిరిగి సభ సమావేశం కాగానే వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమకు విశేషాధికారాలు ఉన్నాయని ఎంపీలలో ఒక అపోహ ఉందని అన్నారు.


రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 ప్రకారం, ఎంపీలకు కొన్ని విశేషాధికారులు ఉన్నాయని, తద్వారా ఎలాంటి అవరోధాలు లేకుండా వారు తమ విధులను నిర్వర్తించడానికి వీలుంటుందని చెప్పారు. సివిల్ కేసుల విషయంలో ఇలాంటి ఒక విశేషాధికారం ఉందని అన్నారు. సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని 135A సెక్షన్ ప్రకారం సెషన్లు, కమిటీ సమావేశాలు ప్రారంభం కావడానికి 40 రోజుల మందు ఎంపీలను అరెస్టు చేయరాదని అన్నారు. అయితే క్రిమినల్ మేటర్స్‌లో సామాన్య ప్రజానీకానికి, ఎంపీలకు మధ్య తేడా ఉండదని ఆయన చెప్పారు. ఆ ప్రకారం సెషన్ల సమయంలో క్రిమిషనల్ కేసుల విషయంలో అరెస్టు కాకుండా తప్పించుకునే విశేషాధికారాలు ఎంపీలకు లేవనని వెంకయ్యనాయుడు స్పష్టత ఇచ్చారు. ఇందుకు సంబంధించిన సుప్రీంకోర్టు రూలింగ్‌ను కూడా ఆయన ప్రస్తావించారు. తమ మందు హాజరు కావాలని దర్యాప్తు సంస్థలు ఆదేశిస్తే సభాకార్యక్రమాలున్నాయనే సాకు చూపించి హాజరును తప్పించుకునే వీలు ఎంపీలకు ఉండదని అన్నారు. మరో తేదీని ఇవ్వాలని దర్యాప్తు సంస్థలను కోరవచ్చే కానీ సమన్లు, నోటీసుల నుంచి తప్పించుకోరాదని, ఇది సభ్యులందరికీ వర్తిస్తుందని ఆయన తెలిపారు.

Updated Date - 2022-08-05T23:03:22+05:30 IST