బకాయిల భారం!

ABN , First Publish Date - 2021-04-23T05:32:28+05:30 IST

వసతి గృహాల విద్యార్థుల సంక్షేమం కొరవడుతోంది. వీరికి అందాల్సిన సౌకర్యాలకు ప్రభుత్వం గండి కొడుతోంది.

బకాయిల భారం!

  విద్యార్థులకు చెల్లించని కాస్మోటిక్‌ ఛార్జీలు

అందని భోజన బిల్లులు

సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు కోట్లల్లో బకాయిలు 


నరసరావుపేట ఏప్రిల్‌ 22: వసతి గృహాల విద్యార్థుల సంక్షేమం కొరవడుతోంది. వీరికి అందాల్సిన సౌకర్యాలకు ప్రభుత్వం గండి కొడుతోంది. ఎస్సీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెపుతున్న పాలకులు అమలులో విఫలమవుతున్నారు. ఇందుకు నిదర్శనగా వసతి గృహాల నిర్వహణ ఉంది. నెలల తరబడి గృహాల విద్యార్థులకు కాస్మొటిక్‌ చార్జీలు చెల్లించలేదు. కాస్మొటిక్‌ చార్జీల బిల్లుల బకాయిలు పెద్దఎత్తున పేరుకుపొయ్యాయి. విద్యాసంవత్సరం ముగిసింది. విద్యార్థులు ఇళ్ళకు కూడా వెళ్ళారు. ప్రభుత్వం బకాయిల ఊసే ఎత్తడంలేదు. వీటితో పాటు విద్యార్థుల భోజన బిల్లుల బకాయిలకు విడుదల చేయలేదు. కోట్లలో బకాయిలు చెల్లించక పోవడంతో వసతి గృహాల అధికారులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 

 జిల్లాలో 10వ తరగతి లోపు విద్యార్థుల సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు 42 ఉన్నాయి. కళాశాలల విద్యార్థుల వసతి గృహాలు 34 ఉన్నాయి. ఈ హాస్టల్స్‌ల్లో 4 వేలకు పైగా విద్యార్థులు ఉంటున్నారు. కాస్మొటిక్‌ చార్జీలు ఒక్కో విదార్థికి నెలకు రూ.155,  విద్యార్థినికి రూ.175 చెల్లించాలి. కరోనా నేపథ్యంలో ఆలస్యంగా వసతి గృహాలు ప్రారంభమయ్యాయి. డిసెంబరు నుంచి వీటిని నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి నేటివరకు విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా కాస్మొటిక్‌ చార్జీలు చెల్లించలేదు. ఇప్పటికైనా బకాయిలు చెల్లించాలని విద్యార్థులు వారి తల్లితండ్రులు కోరుతున్నారు. భోజనానికి కళాశాలల వసతి గృహాలకు నెలకు రూ.1,400, స్కూల్స్‌ వసతి గృహాలకు ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1,200 ప్రభుత్వం చెల్లించాలి. భోజన బిల్లులు కూడా విడుదల కాలేదు. కోట్లలో బకాయిలు ఉన్నాయి. 9వ తరగతి వరకు వసతి గృహాల విద్యార్థులు ఇళ్ళకు వెళ్ళారు. బకాయిల విడుదలలో అలసత్వం కొనసాగుతోంది. కాస్మోటిక్‌ చార్జీలు, భోజన బిల్లులు చెల్లించాల్సి ఉందని, ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ రావలసి ఉందని జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి ఓబుల్‌ నాయుడు తెలిపారు.   

Updated Date - 2021-04-23T05:32:28+05:30 IST