ధోనీ నల్ల కోళ్ల బిజినెస్...తెలుగు రాష్ట్రాల్లో భలే ఫేమస్

ABN , First Publish Date - 2021-03-04T13:49:19+05:30 IST

టీమిండియా మాజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ ధోనీ కడక్‌నాథ్ కోళ్ల బిజినెస్‌లో ఎంతవరకు సక్సెస్ అయ్యాడో తెలీదు కానీ..

ధోనీ నల్ల కోళ్ల బిజినెస్...తెలుగు రాష్ట్రాల్లో భలే ఫేమస్

ఇంటర్‌నెట్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ ధోనీ కడక్‌నాథ్ కోళ్ల బిజినెస్‌లో ఎంతవరకు సక్సెస్ అయ్యాడో తెలీదు కానీ.. అప్పట్నుంచి ఈ చికెన్ మాత్రం బాగా పాపులర్ అయిపోయింది. ధోనిని ఆకట్టుకున్న ఈ చికెన్ సంగతేంటో చూద్దామని నెటిజెన్లు ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేసేయడంతో మన రెండు రాష్ట్రాల్లో ఈ నల్ల కోళ్లు భలే ఫేమస్ అయిపోయాయి. 


నాటుకోడి మాంసం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో నోరూరని వారుండరు. అందుకే నాటు కోడి చికెన్ ఎప్పుడూ మార్కెట్లో హాట్ హాట్ గా అమ్ముడయిపోతుంటుంది. ఐతే.. ఇప్పుడు ఈ నాటు కోడికి ఢీ కొట్టడానికి మరో స్పెషల్ కోడి రంగంలో దిగింది. సంక్రాంతి బరిలో కోడి పుంజులా మార్కెట్లో నాటుకోడితో పోటీపడుతోంది. ఇంతకీ ఈ కోడి పేరు కడక్‌నాథ్ కోడి. ఇదో ప్రత్యేక జాతి కోడి.. ఇప్పుడు చికెన్ మార్కెట్లో దీనిదే హవా..


కడక్‌నాథ్‌ కోడి ఇదే... అసలు చూడ్డానికే ఈ కోడి గ్లామరస్ గా వుంటుంది. నల్లని రూపం.. హొయలు పోయే నడక.. అన్నీ స్పెషలే! ధోనీ ఈ కోళ్లు చూసి ముచ్చటపడి ఓ ఫామ్ పెడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో అందరి చూపూ ఈ కోళ్లపై పడింది. బ్లాక్ చికెన్ లేదా కడక్‌నాథ్ కోడి మాంసం రేటు కిలో వెయ్యి నుంచి 12వందల వరకు ఉంది. కడక్‌నాథ్ కోళ్ల గుడ్డు రేటు ఒక్కొక్కటీ 50 రూపాయిలు. వామ్మో అంత రేటా..? అనుకోకండి. తింటే దాని టేస్టే వేరు. కడక్‌నాథ్ కోడి మాంసం కూడా కోడిలానే నల్లటి రంగులోనే ఉంటుంది. కడక్‌నాథ్ చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. అతి తక్కువగా క్రొవ్వు పదార్థం ఉండటమే దీని స్పెషల్. మంచి రుచి.. దానికితోడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటంతో కడక్‌నాథ్ చికెన్‌ ధర కొండెక్కింది. వెయ్యి, పన్నెండొందలు.. ఎంతైనా పెట్టేందుకు ఎవరూ వెనకాడటం లేదు. అదీ దాని డిమాండు.. 


కడక్‌నాథ్ కోడి బ్రీడ్ ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో అవైలబుల్. ఇది కేవలం గిరిజన ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. కోడి నలుపు.. మాంసం నలుపు.. అంతేకాదు, దీని గుడ్లు కూడా నలుపే. వాస్తవానికి గుడ్డు మరీ అంత నలుపు కాదు. కాస్త కాఫీరంగుతో ఉంటుంది. అక్కడక్కడ కొన్ని గుడ్లు పింక్ కలర్‌లో వస్తున్నాయి. కడక్‌నాథ్ కోళ్లను ఇప్పుడు ఇళ్ల దగ్గర కూడా పెంచుకుంటున్నారు. వీటి మాంసం కోసమే కాదు, గుడ్లు కోసం కొంతమంది పెంచుకుంటున్నారు. ఇన్ని విశేషాలు వున్న నల్లకోడి మాంసాన్ని టేస్ట్ చేయాలని ఉందా.. ? గుడ్డు కూడా తినాలని ఉందా.. ఐతే లేట్ చేయకండి..


Updated Date - 2021-03-04T13:49:19+05:30 IST