ఎనిమిదేళ్లుగా రోడ్లపై ఫోక్‌సలేదు

ABN , First Publish Date - 2021-07-27T07:38:57+05:30 IST

రహదారుల నిర్వహణ, మరమ్మతులపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టిందని రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు

ఎనిమిదేళ్లుగా రోడ్లపై ఫోక్‌సలేదు

బ్యాక్‌లాగ్‌ వర్క్‌ చాలా ఉంది

ఈ ఏడాది 2వేల కోట్లు కేటాయింపు

ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు


అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): రహదారుల నిర్వహణ, మరమ్మతులపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టిందని రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. ఏడెనిమిదేళ్లుగా రహదారులపై సరైన ఫోకస్‌ లేకుండా పోయిందని, ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్ల నిర్వహణపై దృష్టి సారించిందని తెలిపారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు ఒక్క ఏడాదే రూ.2వేల కోట్లు కేటాయించిందన్నారు. రహదారుల దుస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ గత కొద్దిరోజులుగా వరుస కథనాలు ప్రచురిస్తోంది. రహదారులపై ఉన్న గుంతలను పూడ్చేపనులు చేస్తూ ప్రతిపక్ష టీడీపీ వినూత్న నిరసనలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో సర్కారు స్పందించింది. ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్‌ చీఫ్‌(ఈఎన్‌సీ)లు నయీమూల్లా, వేణుగోపాల్‌రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌ రమే్‌షతో కలిసి కృష్ణబాబు ఇక్కడి ఆర్‌అండ్‌బీ భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రహదారుల నిర్వహణకు 2020-21 బడ్జెట్‌లో రూ.220కోట్లు కేటాయించిప్పటికీ, దెబ్బతిన్న రోడ్లను అభివృద్ధి చేయడానికి  ప్రభుత్వం ఆ పద్దును రూ.932కోట్లకు పెంచిందని కృష్ణబాబు తెలిపారు. ఇందులో రూ.417కోట్లు రాష్ట్ర ప్రధాన రహదారులు(ఎ్‌సహెచ్‌), రూ.515 కోట్లు జిల్లా ప్రధాన రహదారుల(ఎండీఆర్‌) మరమ్మతులకు కేటాయించినట్లు వివరించారు. వీటికి అందనంగా రహదారులపై గుంతలు పూడ్చడానికి, అర్జెంట్‌ పనులు చేపట్టడానికి 388కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 


ఈ పనులు త్వరలో పూర్తికానున్నాయని చెప్పారు. తుఫానుల వల్ల దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం మరో 155 కోట్లు కేటాయించామని, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గతేడాది నిర్వహణ బకాయిల చెల్లింపుల కోసం రూ.599కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. 2021-22లో రహదారుల నిర్వహణకు రూ.410 కోట్లు కేటాయించామన్నారు. వార్షిక వర్క్‌ల నిర్వహణకు రూ.160 కోట్లతో టెండర్లు పిలిచామన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై  రూపాయి సెస్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉపయోగించుకొని 2,000 కోట్ల బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తున్నామని, ఆ నిధులను రహదారుల నిర్వహణకు ఉపయోగిస్తామన్నారు. ఇందులో 8,970 కి.మీ. మేర 1,140 వర్క్‌లు చేపట్టాలని నిర్ణయించామని, 403 వర్క్‌లకు టెండర్లు పిలిచామన్నారు. మండల, గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఉద్దేశించిన ఎన్‌డీబీ ప్రాజెక్టు ఈ ప్రభుత్వంలోనే వచ్చిందన్నారు. 2019 సెప్టెంబరులో ఒప్పందం జరిగిందన్నారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు కృష్ణబాబు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర హైవేలపై టోల్‌ప్లాజాలు పెడతామన్నారని ప్రశ్నించగా, ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.  


రెండేళ్లుగా రోడ్ల స్థితి ఎందుకు బాగుపడట్లేదు? 

రెండేళ్లుగా కాదు. గత 7-8 ఏళ్లుగా రోడ్లపై ఫోకస్‌ లేదు. ఇప్పుటి సీఎంకు రోడ్లపై పూర్తిఅవగాహన ఉంది. అందుకే ఫోకస్‌ పెట్టారు. ఒక్క ఏడాదిలోనే 2వేల కోట్ల మంజూరు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రోడ్ల మెయింటెనెన్స్‌కు ఇంత ఎక్కువ నిధులు ఇవ్వలేదు. ఉమ్మడి ఏపీలో రహదారుల  ప్రాజెక్టులకు 6,400 కోట్ల రుణంవచ్చిన దాఖలా లేదు. ఇప్పుడు ఎన్‌డీబీ ప్రాజెక్టు వచ్చింది. రాష్ట్రంలో 53వేల కి.మీ. రోడ్లకుగాను 43వేల కి.మీ.మెయింటెనెన్స్‌ చేయాలి. ఏటా 9వేల కి.మీ. రహదారుల నిర్వహణ, మరమ్మతులు చేపట్టాలి. ఇందుకోసం ఏటా కనీసం రూ.2వేల కోట్ల నిధులు అవసరం. అయితే, ఏటా 600 కోట్లు ఖర్చుపెడుతున్నారు. దీంతో బ్యాక్‌లాగ్‌ వర్క్‌లు ఉండిపోతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014-19 వరకు రహదారుల మెయింటెనెన్స్‌కు ఏటా 600కోట్లకు మించి ఖర్చుపెట్టలేదు. సీఎం సమావేశంలో ఇదేఅంశం చర్చకొచ్చినప్పుడు, రహదారులను పూర్తిస్థాయిలో మెరుగుపర్చాలంటే కనీసం ఏటా 2వేల కోట్లు అవసరమని, నిధులిస్తే బ్యాక్‌లాగ్‌ వర్క్‌ పూర్తిచేస్తామని చెప్పాం. వర్క్‌లు వేగంగా పూర్తిచేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. వాటిని సకాలంలో పూర్తిచేయలేకపోయాం. ఆ బ్యాక్‌లాగ్‌ ఇంకా కొనసాగుతోంది. 


రెగ్యులర్‌ మెయింటెనెన్స్‌ వర్క్‌లను ఎందుకు సకాలంలో చేపట్టలేకపోయారు? 

నిబంధనలతో కూడిన కొన్ని అంశాల వల్ల ఆలస్యమైంది. గతేడాది వర్కింగ్‌ సీజన్‌లో వీటిని పూర్తిచేసి ఉంటే రహదారులు బెటర్‌ కండిషన్‌లో ఉండేవి. దురదృష్టవశాత్తు కొన్ని అంశాలు, బ్యాంకు రుణాలు తీసుకోవడంలో జరిగిన జాప్యంతో పనులు ఆలస్యమయ్యా యి. ఇప్పటికే వర్షాకాలం వచ్చేసింది. రుణం మంజూరయ్యాక వెంటనే పనులు చేపడతాం. 


2వేల కోట్ల వర్క్‌లకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడం లేదు? 

కాంట్రాక్టర్లకు కొన్ని సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడానికి 2-3 సార్లు మీటింగ్‌ పెట్టాం. వర్క్‌లు చేసిన వారికి నేరుగా బ్యాంక్‌ ద్వారా చెల్లింపులు జరిగే విధానంపై ఆలోచించాం. బ్యాంకు రుణం ఖరారయ్యాక వారిలో కొంత ఆత్మవిశ్వాసం వస్తుందనుకుంటున్నాం. నేరుగా బ్యాంక్‌ నుంచే బిల్లులు చెల్లిస్తామని చెబుతున్నాం. 


ఆర్‌అండ్‌బీ ఆస్తులను ఏం చేయబోతున్నారు? 

ఆర్‌అండ్‌బీకి 4,300 కోట్ల ఆస్తులున్నాయి. వాటిని ఆంధ్రప్రదేశ్‌ రహదారి అభివృద్ధి సంస్థకు అప్పగించబోతున్నాం. తద్వారా ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక పరపతి మెరుగవుతాయని భావిస్తున్నాం. 

Updated Date - 2021-07-27T07:38:57+05:30 IST