దాత ఔదార్యం.. నేడు శిథిలం

ABN , First Publish Date - 2022-06-25T06:07:05+05:30 IST

ఇది పశువుల ఆసుపత్రా ? మైసూర్‌ మహారాజా ప్యాలెస్సా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి.

దాత ఔదార్యం.. నేడు శిథిలం
పదేళ్లుగా వినియోగంలో లేని ముదినేపల్లి పశు వైద్యశాల భవనం

పదేళ్లుగా వినియోగంలో లేని ముదినేపల్లి పశు వైద్యశాల భవనం

1961లో సీఎం సంజీవరెడ్డి ప్రారంభం

రెండెకరాలు దానమిచ్చిన యెర్నేని కుటుంబం

కోట్ల ఆస్తికి తూట్లు.. అధికారులకు పట్టదు


ఇది పశువుల ఆసుపత్రా ? మైసూర్‌ మహారాజా ప్యాలెస్సా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. 1961లో ముదినేపల్లిలోని ప్రభుత్వ పశువుల ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా భవన నిర్మాణ డిజైన్‌ చూసి ఆయన అన్న మాటలివి. 

ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలక్ష్యం కారణంగా ఈ ప్రభుత్వ పశువుల ఆసుపత్రి భవనం శిథిలమైంది. ఐదేళ్ల క్రితం పూర్తిగా మూసేయాల్సి వచ్చింది. 1961లో ముదినేపల్లి ప్రముఖుడు యెర్నేని వెంకటేశ్వరరావు ఎకరం భూమిని విరాళంగా ఇవ్వటమే కాక అందులో తన తండ్రి చలమయ్య జ్ఞాపకార్థం రెండు అంతస్థుల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఆసుపత్రితోపాటు ఇద్దరు వైద్యులకు పైఅంతస్తులో నివాసాలకు క్వార్టర్స్‌ నిర్మించారు. 1990 నుంచి ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంటున్నప్పటికీ పశు సంవర్థక శాఖ అధికారులు మరమ్మతులు చేయించటంలో ఆసక్తి చూపించలేదు. దీంతో 2010 నాటికీ ఈ భవనాన్ని వినియోగించే వీలు లేకుండా పోయింది. ప్రత్యామ్నాయం లేక భవనంలో ఇబ్బందులు పడుతూనే వైద్యులు, సిబ్బంది విధులు నిర్వహించారు. ఐదేళ్ల క్రితం సిబ్బంది ఈ భవనాన్ని మూసేసి, నూతనంగా నిర్మించిన భవనంలోకి ఆసుపత్రిని మార్చారు. అప్పట్లో దాత ఉచితంగా నిర్మించి ఇచ్చిన భవనమే కదా, ప్రభుత్వం నిధులతో నిర్మించినది కాదు కదా అన్న ఉద్దేశంతో ఆ శాఖ ఉన్నతాధికారులు కోట్లాది రూపాయల విలువ చేసే ఈ ఆస్తికి తూట్లు పొడిచారు. ఇప్పుడు ఆ భవనం నిర్మించాలంటే రూ.3 కోట్లు కావాలి. ఆంధ్రప్రదేశ్‌లో పశువుల ఆసుపత్రికి ఇంత అందమైన భవనం ముదినేపల్లిలో నిర్మించారని తెలుసుకున్న మరో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఈ భవనాన్ని చూసి వెళ్లారట. ఇద్దరు ముఖ్యమంత్రులు మెచ్చుకున్న ఈ భవనాన్ని అనంతరం వచ్చిన పాలకులు గానీ, పశుసంవర్థక శాఖ అధికారులు గానీ కాపాడలేకపోయారు. 

అభివృద్ధి చేయండి 

ప్రభుత్వ పశువుల ఆసుపత్రికి మా కుటుంబం ఉదారంగా స్థలం ఇచ్చి భవనాన్ని నిర్మించాం. దాత ఔదార్యాన్ని అధికారులు గుర్తించలేదు. ఇప్పటికైనా భవనాన్ని అభివృద్ధి చేసి వినియోగంలోకి తేవాలి.

– యెర్నేని లక్ష్మణ ప్రసాద్‌, మాజీ ఎంపీపీ, దాత కుమారుడు –  ముదినేపల్లి

Updated Date - 2022-06-25T06:07:05+05:30 IST