మూడు ముక్కలాట!

ABN , First Publish Date - 2022-01-09T06:08:35+05:30 IST

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి, భారతీయ జనతాపార్టీకి మధ్య యుద్ధం మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నట్టుగా ఇది ఉత్తుత్తి యుద్ధమా? నిజమైన యుద్ధమా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాలి...

మూడు ముక్కలాట!

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి, భారతీయ జనతాపార్టీకి మధ్య యుద్ధం మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నట్టుగా ఇది ఉత్తుత్తి యుద్ధమా? నిజమైన యుద్ధమా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్ల బదిలీల వ్యవహారంలో తన కార్యాలయంలోనే దీక్షకు కూర్చున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బండి కొంత కాలంగా దూకుడు పెంచారు. పరుష పదజాలంతో దూషించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా అదేస్థాయిలో సంజయ్‌ను టార్గెట్‌ చేసుకుని తిట్టడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో బండిని అరెస్టు చేసి జైలుకు పంపారు. తెలుగు రాష్ర్టాలలో ప్రతిపక్షాల ఆందోళనలను అణచివేయడానికి కొవిడ్‌ నిబంధనలు ప్రభుత్వాలకు అనువుగా మారాయి. అధికార పార్టీ ముఖ్యులు, మంత్రులు వేలమందితో ర్యాలీలు నిర్వహించినా అడ్డం రాని కొవిడ్‌ నిబంధనలు ప్రతిపక్షాల విషయంలోనే పోలీసులకు గుర్తుకొస్తున్నాయి. బండి సంజయ్‌ అరెస్టుతో పాటు కేసీఆర్‌ కుటుంబంపై మాటల తూటాలు ప్రయోగిస్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్‌పైనా ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటనలు జరిగినప్పుడే ఆరెస్సెస్‌ సమావేశాల్లో పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా కూడా కేసీఆర్‌ ప్రభుత్వంపై జంగ్‌ ప్రకటించారు. వడ్ల కొనుగోలు వివాదంతో మొదలైన మాటల యుద్ధం టీఆర్‌ఎస్‌ బీజేపీ మధ్య చేతల వరకూ వచ్చింది. అయితే ఇదంతా ఆ రెండు పార్టీలూ ఆడుతున్న డ్రామా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొట్టిపడేస్తున్నారు. పీసీసీ సారథిగా రేవంత్‌ నియమితులయ్యాక కాంగ్రెస్‌ పార్టీ కొంతకాలం దూకుడు ప్రదర్శించింది. దీంతో బీజేపీపై కాంగ్రెస్‌ పైచేయి సాధించినట్టు రాజకీయ పరిశీలకులు భావించారు. ఈ క్రమంలో హుజూరాబాద్‌కు ఉపఎన్నిక జరగడం, అధికార పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్‌ విజయం సాధించడం, కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోవడంతో బీజేపీ దూకుడు పెంచింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ నియమితుడు కావడం ఇష్టం లేనివారు పార్టీ వదిలి వెళ్లిపోవచ్చునని అధిష్ఠానం హెచ్చరించడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు కూడా మౌనాన్ని ఆశ్రయించారు. రేవంత్‌ పొడ గిట్టని ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీజేపీయే తన ప్రధాన ప్రత్యర్థి అన్నట్టుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. కొంతకాలం క్రితం ‘కేంద్రంపై ఇక యుద్ధమే’ అంటూ హడావిడి చేసిన కేసీఆర్‌, ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాను కలిసి వచ్చిన తర్వాత సైలెంట్‌ అయిపోయారు. రేవంత్‌రెడ్డి దూకుడు పెంచడం, కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటోందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యాపించడంతో కేసీఆర్‌ తన వ్యూహం మార్చుకున్నారు. వడ్ల కొనుగోలు వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చి తనతో పాటు మంత్రులు, ఎంపీలను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లి హడావిడి చేశారు. వడ్ల కొనుగోలు సమస్య పరిష్కారం కాలేదు గానీ అది పరిష్కారం అయ్యేవరకు ఢిల్లీలోనే మకాం అని ప్రకటించిన మంత్రులు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు హైడ్రామా సృష్టించి బండి సంజయ్‌ను అరెస్టు చేశారు. అదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హైదరాబాద్‌ పర్యటన ఉండటంతో బీజేపీ రాష్ట్ర నాయకులు ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో పోరు మొత్తం టీఆర్‌ఎస్‌ బీజేపీ మధ్య కేంద్రీకృతమైందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత పోరు మొదలైంది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన జగ్గారెడ్డి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై విమర్శలు ప్రారంభించారు. దీనిపై సంజాయిషీ కోరుతూ పార్టీ అధిష్ఠానం శ్రీముఖం పంపినప్పటికీ జగ్గారెడ్డి వెనక్కు తగ్గడంలేదు. కాంగ్రెస్‌ పార్టీ సంతరించుకున్న సవాలక్ష అవలక్షణాలలో ఇది ఒకటి. పార్టీలో అందరితో చర్చించిన మీదటే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని జగ్గారెడ్డి వాదిస్తున్నారు. ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్‌లో అసాధ్యం. పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నప్పటికీ అధిష్ఠానం అండదండలతోనే ముందుకు వెళ్లేవారు. స్వతంత్రంగా వ్యవహరించడం రేవంత్‌రెడ్డికి ఉండే పెద్ద మైనస్‌. ఇప్పుడు అదే అస్త్రంగా జగ్గారెడ్డి ఆయనపై ఎదురుదాడికి దిగారు. ఫలితంగా ప్రభుత్వంపై యుద్ధం చేయడంలో బీజేపీ పైచేయి సాధించగా, కాంగ్రెస్‌ పార్టీ యథావిధిగా అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరుకునేది కూడా ఇదే. తన ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని గ్రహించిన కేసీఆర్‌, సరికొత్త రాజకీయ వ్యూహానికి పదునుపెట్టారు. కొంతకాలం క్రితం బీజేపీని విమర్శించవద్దని పార్టీ నాయకులకు సూచించిన కేసీఆర్‌ ఇప్పుడు రూటు మార్చి తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి అని ప్రజలు అభిప్రాయపడే పరిస్థితులు సృష్టిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. క్షేత్రస్థాయిలో బీజేపీ బలం పరిమితం. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో ఆ పార్టీ బలం అంతంత మాత్రమే. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అవసరమైన బలమైన అభ్యర్థులు కూడా బీజేపీలో లేరు. ఈ కారణంగానే ఇతర పార్టీలకు చెందిన వారిని చేర్చుకోవడానికి బీజేపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉన్నందున ఆయా పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నాయకులు వేచిచూసే ధోరణితో బీజేపీలో చేరడానికి సిద్ధపడటం లేదు. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఇందుకు భిన్నమైనది. పలువురు నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోయినా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌కు కార్యకర్తల కొరత లేదు. అయితే తమను ముందుండి నడిపే సమర్థ నాయకులు లేని ప్రాంతాలలో ఆ పార్టీ స్తబ్దుగా ఉంటోంది. నియోజకవర్గాలవారీగా బలమైన అభ్యర్థులు లభిస్తే కాంగ్రెస్‌ పార్టీ నుంచి అధికార టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఎదురవుతుంది. ఇది గమనించిన కేసీఆర్‌ తనదైన వ్యూహానికి పదునుపెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్‌ బీజేపీలలో ఏ ఒక్క పార్టీ కూడా పూర్తిస్థాయిలో బలపడకూడదని కేసీఆర్‌ భావిస్తున్నారు. కాంగ్రెస్‌ బలపడుతున్నదని భావిస్తే బీజేపీని తెర మీదకు తెస్తారు. బీజేపీతో సమస్య వస్తుందనుకుంటే కాంగ్రెస్‌ పార్టీపై యుద్ధం మొదలుపెడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌ బీజేపీ మధ్య చీలిపోవాలన్నది కేసీఆర్‌ కోరిక. ఓట్లు చీలని పక్షంలో కేసీఆర్‌ అధికారానికి ముప్పే! దుబ్బాక, నాగార్జునసాగర్‌, హుజూరాబాద్‌కు జరిగిన ఉపఎన్నికలు ఈ విషయం రుజువు చేశాయి. ఎక్కడ ఏ పార్టీ బలంగా ఉంటే ఓటర్లు ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్‌ను వ్యతిరేకించే వారంతా సంఘటితమై ఎవరో ఒకరికి మద్దతిస్తున్నారు. ఈ కారణంగా దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ కోల్పోయి బీజేపీ గెలవగలిగింది. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జానారెడ్డి బలమైన అభ్యర్థి అయినందున అక్కడ బీజేపీకి డిపాజిట్‌ దక్కలేదు. జానారెడ్డిని ఓడించడానికి కేసీఆర్‌ అండ్‌ కో ఎంతగా శ్రమించారో అందరికీ తెలిసిందే. అయితే హుజూరాబాద్‌లో కేసీఆర్‌ అండ్‌ కో ఆటలు సాగలేదు. అధికార పార్టీ ఎత్తుగడలను ఈటల రాజేందర్‌ తిప్పికొట్టడంతో ఆయన విజయం సాధించారు. ఓటర్లకు అధికార పార్టీ ఎన్ని కోట్లు పంచి పెట్టినా ప్రజలు సంఘటితంగా ఈటల వైపు నిలిచారు. ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ కోల్పోయింది. ఆ పార్టీకి సంప్రదాయికంగా వస్తున్న ఓట్లు ఉపఎన్నికలో కూడా లభించి ఉంటే ఈటల రాజేందర్‌ ఓడిపోయి ఉండేవారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్‌ ఓటర్లు కూడా అధికార పార్టీని ఓడించగలిగే స్థాయిలో ఉన్న ఈటల వైపు మాత్రమే నిలబడుతున్నారు. ఈ సరళిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే కార్యక్రమానికి పదునుపెట్టారు. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ బీజేపీ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది. అయితే తెలంగాణ ఓటర్ల విజ్ఞత ముందు కేసీఆర్‌ ఎత్తుగడలు పనిచేయకపోవచ్చు. ప్రస్తుతానికి బీజేపీ జోరుమీదున్నదన్న విషయం వాస్తవం. కానీ బీజేపీ కేంద్ర పెద్దలతో కేసీఆర్‌ సయోధ్య కుదుర్చుకున్నారన్న సందేహాలు రాజకీయవర్గాలలో ఇప్పటికీ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల తర్వాతే తెలంగాణలో బీజేపీ ఎటువంటి వ్యూహాన్ని అమలుచేయబోతుందన్నది స్పష్టమవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం ఆ పార్టీ పెద్దలు తెలంగాణనే తమ తదుపరి టార్గెట్‌గా పెట్టుకుంటారు. ప్రభుత్వపరంగానే కాకుండా పార్టీపరంగా కూడా కేసీఆర్‌కు చికాకులు సృష్టించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కేసీఆర్‌ అవినీతి గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు, ఉత్తరప్రదేశ్‌ ఫలితాల తర్వాత కేసీఆర్‌పై చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని చెప్పవచ్చు. దీన్నిబట్టి తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ బీజేపీ మధ్య మూడు ముక్కలాట మరికొంత కాలం కొనసాగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉంది కనుక ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ మెజారిటీ లభిస్తే తెలంగాణలో బీజేపీ మరింత దూకుడు పెంచడం ఖాయం. ఈ నేపథ్యంలో అటు అధికార పార్టీతో, ఇటు ప్రతిపక్ష స్థానానికి పోటీ పడుతున్న బీజేపీతో ఏకకాలంలో పోరాడాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌ పార్టీకి ఏర్పడింది. ఈ సవాలు రేవంత్‌రెడ్డి నాయకత్వ పటిమకు పరీక్షే! కేంద్ర పార్టీ అండదండలు లేకుండానే కాంగ్రెస్‌ను విజయతీరాలవైపు నడిపించగలరా? ఈ విషయమై రేవంత్‌రెడ్డి ఎంతవరకు సఫలీకృతులు అవుతారన్నది ప్రస్తుతానికి ప్రశ్నే. ప్రతిపక్షాల మధ్య పోరు ఓట్ల చీలికకు దారితీస్తే మాత్రం కేసీఆర్‌ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే!


ఈ శాస్తి జరగాల్సిందే!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు వద్దాం. తండ్రి గొప్ప డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారని చెప్పి వైద్యం చేయడమే తెలియని కొడుకుతో ఆపరేషన్‌ చేయించుకుంటే ఏం జరుగుతుందో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే జరుగుతోంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా తండ్రి రాజశేఖరరెడ్డి పేరు చెప్పుకుని జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్‌‌రెడ్డిలో రాజశేఖరరెడ్డిని చూసిన జనం నమ్మి ఓట్లు వేశారు. తండ్రిని మించిన తనయుడిని అనిపించుకుంటానని నమ్మబలికిన జగన్‌రెడ్డి, రెండున్నరేళ్లు గడిచేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంపశయ్య పైకి చేర్చారు. అప్పు కోసం కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ పెద్దలను వేడుకోవాల్సిన పరిస్థితి రాష్ర్టానికి కల్పించారు. సంక్షేమం పేరిట డబ్బులు పంచడానికే ఆయన పరిమితమయ్యారు. పంచడానికి అవసరమైన డబ్బు కోసం ఒకవైపు అప్పులు చేస్తూ మరోవైపు ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారు. ప్రభుత్వం తమకు డబ్బులు పంచాలనుకుంటున్న వారు చెత్త పన్ను కట్టకపోతే ఎలా? అని అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వంటివారు కూడా దబాయించే పరిస్థితి ఏర్పడింది. అదేమంటే ప్రభుత్వ పోకడలను విమర్శించే వారంతా పేదల శత్రువులే అని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సూత్రీకరిస్తున్నారు. పనిలో పనిగా అభివృద్ధి చేద్దామంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని కూడా జగన్‌రెడ్డి విమర్శిస్తున్నారు. ఈ విమర్శలలో వాస్తవం ఉందో లేదో పరిశీలిద్దాం. ప్రభుత్వం చేపట్టబోయే ఏ అభివృద్ధి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎవరు కోర్టుకు వెళ్లారో, ఏ కోర్టు స్టే ఇచ్చిందో ముఖ్యమంత్రి చెప్పగలరా? డబ్బులు పంచితే చాలు అభివృద్ధి దానంతట అదే జరిగిపోతుందని జగన్‌ అండ్‌ కో ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే నిజమని అనుకుందామనుకుంటే విద్యా, వైద్య రంగాలలో రాష్ట్రం వెనుకబడిపోయిందని కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. ఎవరు ఏ విమర్శ చేసినా పేదల జపం చేయడం జగన్‌రెడ్డికి అలవాటుగా మారింది. పేదల పిల్లలకు ఇంగ్లీషు మీడియంలో చదువు చెప్పించాలని గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదని, ఇంతటి గొప్ప ఆలోచన తనకే వచ్చిందని జగన్‌రెడ్డి చెప్పుకోవడంలో ఒక్క శాతం కూడా నిజం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీషు మీడియంలో కూడా బోధించే విధానాన్ని గత ప్రభుత్వంలోనే అమలుచేశారు. అప్పుడు ఇదే జగన్‌రెడ్డికి చెందిన నీలిమీడియాలో మాతృభాషకు మంగళం అని నిందించారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు మీడియంను మొత్తానికి ఎత్తేయాలని అనుకోవడంతోనే వివాదం మొదలైంది. ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలని రాజ్యాంగంలోనే నిర్దేశించినందున కొందరు కోర్టులకు వెళ్లడంతో, సర్వోన్నత న్యాయస్థానం కూడా మాతృభాష ఉండాలని చెప్పింది. జరిగింది ఇది కాగా ముఖ్యమంత్రి తనదైన శైలిలో వక్రభాష్యం ఇచ్చుకున్నారు. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్‌ మీడియంలో కూడా బోధిస్తే వద్దన్నవారు ఎవరో చెప్పగలరా? గతంలో వివిధ ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్లు, ఇంటిస్థలాలను క్రమబద్ధీకరిస్తామంటూ పదివేల నుంచి ఇరవైవేల వరకు వసూలు చేయాలన్న ఉద్దేశంతో ఓటీఎస్‌ పథకాన్ని తీసుకువస్తే తప్పు పట్టడం ఏమిటి? అని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. ఈ ఇళ్లకు సంబంధించిన బకాయిలను గత ప్రభుత్వాలు ఎప్పుడో మాఫీ చేశాయి. బకాయిలు కట్టాలని ఏ ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయలేదు. పాదయాత్ర సందర్భంగా ఈ బకాయిలను మాఫీ చేస్తానని చెప్పింది జగన్‌రెడ్డి కాదా? ఇప్పుడు పేదల నుంచి ముక్కు పిండి మరీ నాలుగువేల కోట్ల రూపాయలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడాన్ని ఏమనాలి? నిత్యం పేదల జపం చేసే జగన్‌రెడ్డి అందరూ మర్చిపోయిన బకాయిలను ఓటీఎస్‌ పేరిట అదే పేదల నుంచి నాలుగువేల కోట్లు వసూలు చేయాలనుకోవడం దారుణం కాదా? ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పి చట్టాలు, రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు, శాసనాలు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉండదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవలే స్పష్టం చేశారు. తనకు ఏ రాజ్యాంగం వర్తించదని భావించే పక్షంలో ఆంధ్రప్రదేశ్‌ను సైతం స్వతంత్రదేశంగా ప్రకటించుకునే ప్రయత్నంతో పాటు తన సొంత రాజ్యాంగం రాసుకునే ఆలోచనను జగన్‌ చేయవచ్చు కదా? ఈ రెండున్నరేళ్లలో ప్రజలపై వేసిన పన్నుల భారం వల్ల ఇబ్బందిపడుతున్న వారిలో ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన పేదలు కూడా ఉన్నారు కదా? అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ ధనాన్ని సంక్షేమం పేరిట విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న జగన్‌రెడ్డి ఏనాడైనా తన సొంత నిధుల నుంచి ఒక్క పేదవాడికైనా చదువు చెప్పించారా? వైద్యం చేయించారా? పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని జగన్‌ అండ్‌ కో జబ్బలు చరుచుకుంటున్నారు కానీ, పేద రాష్ర్టాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 20వ స్థానంలోనే ఎందుకు ఉండిపోయిందో చెప్పగలరా? పేదల కష్టాలు తనకు మాత్రమే తెలుసునని బిల్డప్‌ ఇచ్చుకునే జగన్‌రెడ్డి చెత్తపన్ను వేసి పేదల మీద భారం వేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు. రైతుభరోసాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తే అదేదో తన ఖ్యాతి అన్నట్టుగా సొంత పత్రికలో ప్రకటనలు ఇచ్చుకుని ప్రజాధనం దోచుకోవడం ఏ పేదలను ఉద్ధరించడానికో జగన్‌రెడ్డి చెప్పాలి. ప్రభుత్వ పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అంటే అదీ కనబడటం లేదు. రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నదా? అంటే అదీ లేదు. ఏ పూటకు ఆ పూట కేంద్రపెద్దల కాళ్లావేళ్లా పడి అదనపు అప్పులకు అనుమతులు తెచ్చుకుంటూ ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారు? జగన్‌ ప్రభుత్వం చేస్తున్న అప్పులను ఎలా తీరుస్తుందో చెప్పాలి. ఆస్తులు కుదవపెట్టి అప్పులు చేశారు సరే, ఆ అప్పులను చెల్లించనప్పుడు సదరు ఆస్తులను అమ్మేస్తారా? అమ్మితే కొనేదెవరు? దిశా దశా లేని ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శించకుండా ఎందుకుంటారు? ప్రభుత్వం చేయాల్సిన పనులు వదిలేసి అనవసర విషయాలలో వేలుపెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయడంలో మాత్రం జగన్‌రెడ్డి పీహెచ్‌డీ చేశారు. ఎవరిపైనో ఏదో కక్ష సాధించడం కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకుని దానికి ముసుగుగా పేదలను ముందుకు తేవడం ఆయనకు అలవాటుగా మారింది. సినిమా టికెట్ల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతాలలోని థియేటర్లలో టికెట్‌ ధరను ఐదు రూపాయలుగా నిర్ణయిస్తే ఎవరైనా వాటిని ఎలా నిర్వహించగలరు? ఇవాళ టీ, కాఫీలు కూడా ఐదు రూపాయలకు రావడం లేదు. ప్రభుత్వానికి నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే ముందుగా చెత్తపన్ను ఎత్తివేయాలి. పేదలకు సరఫరా చేస్తున్న దిక్కుమాలిన బ్రాండ్ల మద్యం ధరలను తగ్గించాలి. పొరుగు రాష్ర్టాలతో సమానంగా పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించాలి. అవేవీ చేయకుండా ఎవరూ కోరకపోయినా సినిమా టికెట్ల ధరలను తగ్గించడం కక్షసాధింపు కాదా? ముఖ్యమంత్రి ఈ పని ఎందుకు చేశారో తెలిసినప్పటికీ ఆయన వద్ద తాను పాలేరునని స్వయంగా అంగీకరించిన మంత్రి పేర్ని నాని, సౌకర్యాలను బట్టి టికెట్‌ ధరలు ఉండాలని చట్టంలోనే ఉందని వాదిస్తున్నారు. ఆ చట్టం చేసినప్పుడు సినిమా పరిశ్రమ పరిస్థితి వేరు. ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగింది. బడ్జెట్‌ కూడా అమాంతం పెరిగిపోయింది. ఈ విషయంలో పొరుగు రాష్ర్టాలకు, మరీ ముఖ్యంగా మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు లేని బాధ జగన్‌రెడ్డి ప్రభుత్వానికే ఎందుకు? అంటే తెలియనంత అమాయకులు కారు ప్రజలు. దాదాపు నలభై ఏళ్ల క్రితం ఉమ్మడిరాష్ట్రంలో హోటళ్లలో తినుబండారాల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇడ్లీ, వడలు వంటి తినుబండారాల సైజు తగ్గించేశారు. ఫలితంగా ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దీని నుంచి బయటపడడం  కోసం ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించి కొంతకాలంపాటు నడిపాక చేతులెత్తేసింది. చివరికి టీ, టిఫిన్ల ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ హోటళ్ల వారికే కల్పించారు. దిక్కుమాలిన విషయాలను వివాదాలుగా మార్చి ప్రజలను ఎల్లకాలం అయోమయంలోకి నెట్టలేరు. అలాగే తాను మాత్రమే పేదల ప్రేమికుడిని అని చెప్పుకోవడం జగన్‌రెడ్డికి ఎంతో కాలం సాగదు. గత ఎన్నికలలో ఓట్లు వేసిన పలువురు ఇప్పటికే పశ్చాత్తాపం చెందుతున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు ముందు వరుసలో ఉంటారు. కోరుకుని మరీ జగన్‌రెడ్డిని అధికారంలోకి తెచ్చుకున్నందుకు తమకు ఆ మాత్రం శాస్తి జరగాల్సిందేనని ఉద్యోగులు వాపోతున్నారు. కొంచెం అటూఇటుగా ఇతర వర్గాలదీ అదే పరిస్థితి!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-01-09T06:08:35+05:30 IST