భక్తిశ్రద్ధలతో మొహర్రం

ABN , First Publish Date - 2022-08-10T09:46:53+05:30 IST

మొహర్రం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో షియా ముస్లింలు మంగళవారం మాతం నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో మొహర్రం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): మొహర్రం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో షియా ముస్లింలు మంగళవారం మాతం నిర్వహించారు. ధర్మ పరిరక్షణ కోసం మహమ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమాం హుస్సేన్‌ సహా 72 మంది అమరులైన ఘటనను స్మరించుకుంటూ షియాలు పెద్ద సంఖ్యలో మాతంలో పాల్గొన్నారు. కత్తులు, బ్లేడ్లు, కొరడాలతో తమ శరీరాలపై గాయాలు చేసుకున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం దొరకోటలోని పీర్ల వద్ద నవాబు వంశీయుల వారసులు మీర్‌ ఫజుల్‌ అలీఖాన్‌, ఆయన కుటుంబసభ్యులు, షియా ముస్లింలు ప్రార్థనలు చేశారు. అనంతరం పీర్ల ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలోని మొత్తం 40 పీర్ల చావిళ్ల నుంచి పీర్ల ఊరేగింపులు జుర్రేరు వాగుకు చేరుకున్నాయి. అక్కడ పీర్లను శుద్ధి చేసి తిరిగి పీర్ల చావిళ్లకు చేర్చారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు మిద్దెలు, మేడలపై ఎక్కి మాతంను తిలకించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. 


రాత్రి సినిమా హాళ్లు కూడా బంద్‌ చేయించారు. వీధి లైట్లు నిలిపేశారు. డోన్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు రామిరెడ్డి, శంకర్‌నాయక్‌ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కోనేరుసెంటర్‌, పమిమిడిముక్కల మండలం అలీనఖీపాలెం, తోట్లవల్లూరు మండలం ఐలూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నగరం, మామిడికుదురు గ్రామం, చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం ఆవలకొండలోనూ మాతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవలకొండకు తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి కూడా షియాలు తరలివచ్చారు. ఆవలకొండ నుంచి ఫకీర్‌తోటకు పీర్లను ఊరేగింపుగా తీసుకొచ్చారు.

Updated Date - 2022-08-10T09:46:53+05:30 IST