ప్రపంచ‘గాలులకు’ తెరచిన కిటికీ

Sep 18 2021 @ 00:31AM

హృదయాన్ని ఆకట్టుకునేలా రాసిన ఏ కవులైనా తనకు ఇష్టమేనని ముకుంద రామారావు అంటారు. వలస వేదన ఆయనలో ప్రగాఢంగా ఉంది. ‘నా కవితలు నా జీవితం నుండి వచ్చినవే’ అని ఆయన అంటారు. భారతీయ భాషలలోని వైవిధ్య కవిత్వ సంపదను తెలుగువారికి అందించిన ముకుంద రామారావుకు తాపీ ధర్మారావు పురస్కారం ప్రదానం చేయడం సాహిత్యాభిమానులు అందరూ ఆనందించే విషయం.


జాతీయ, అంతర్జాతీయ కవితారీతులను తెలుగు పాఠకులకు అందించిన వారిలో ముఖ్యులు యల్లపు ముకుందరామారావు. స్వాతంత్య్రానికి పూర్వం ఉమ్మడి విశాఖ జిల్లా, అనకాపల్లి సమీపంలోని వెంకుపాలెం గ్రామం నుంచి అనేక కుటుంబాలు దక్షిణాఫ్రికా, మలేసియా, సింగపూర్‌ వంటి దేశాలకు వలస వెళ్ళాయి. గ్రామాన్ని ఆనుకునే శారదానదీ ప్రవాహమున్నా, ఆ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి వ్యవసాయానికి జీవధార నందించే అవకాశాలు లేక, ఎన్నో ఎకరాల భూములున్న రైతులు కూడా వలసపోయిన పరిస్థితులవి. అలా వెళ్ళిన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కవి యల్లపు ముకుందరామారావు. 


భారత్‌కు తిరిగివచ్చిన తండ్రి ఉద్యోగరీత్యా ఖరగ్‌పూర్‌లో స్థిరపడ్డారు. ముకుంద రామారావు అక్కడే  పుట్టి, పెరిగి చదువుకున్నారు. ఐఐటిలో ఉన్నత విద్యనభ్యసించారు. తొలుత రైల్వేలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మల్టీనేషనల్‌ కంపెనీలో చేరారు. వృత్తిరీత్యా, దేశంలోని ఇతర రాష్ట్రాలు, అమెరికా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ దేశాలకు వెళ్లారు. ముకుందరామారావు సృజన శక్తి నుంచి ఎనిమిది కవితాసంపుటాలు, మరో ఎనిమిది అనువాద కవితాసంపుటాలు వెలువడ్డాయి. ‘చర్యాపదాలు’ వంటి పదో శతాబ్దపు మహాయాన బౌద్ధ నిర్వాణ గీతాల పుస్తకం రచించారు. 


కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ముకుందరామారావు కథలు రాసేవారు. అవి ‘చిత్రగుప్త’ వంటి పత్రికలలో అచ్చయ్యాయి. ఖరగ్‌పూర్‌లో ఉండగా ఘండికోట బ్రహ్మాజీరావు, ఎన్‌ఆర్‌ నంది, ముద్దంశెట్టి హనుమంతరావు వంటి రచయితలతో పరిచయం ఏర్పడింది. 1993లో తమ పెద్దమ్మాయి వివాహం తర్వాత చాలా మందిలాగే తనలో కలిగిన అనుభూతిని కవితల రూపంలో రాసి పెట్టుకున్నారు. అవి చూసిన చేరా మాస్టారు వాటిని ఆంధ్రప్రభ వారపత్రికకు పంపారు. ఆ మరుసటి వారమే ఒక కవిత ప్రచురితమయింది. హైదరాబాద్‌లో స్థిరపడిన తరువాత చేరా, ఎన్‌ గోపీతో ముకుందరామారావుకు మంచి అనుబంధం ఏర్పడింది. చేరా సాంగత్యం వల్ల తనకు కవిత్వం పట్ల బాగా అవగాహన పెరిగిందని, కవిత్వం రాయడం నేర్చుకున్నానని ముకుందరామారావు అంటారు. ‘వలసపోయిన మందహాసం’ ఆయన తొలి కవితా సంపుటి. 


హృదయాన్ని ఆకట్టుకునేలా రాసిన ఏ కవులైనా తనకు ఇష్టమేనని ముకుందరామారావు అంటారు. వలస వేదన ఆయనలో ప్రగాఢంగా ఉంది. ఆయన కవితల్లో తాత్వికధోరణి తరచు ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది. ‘నేనెంత ఎదిగానో నాకు తెలీదు కానీ, నేను ఎదిగాను. నా ఎదుగుదల నాకు తెలుసు. నా కవితలు నా జీవితం నుంచి వచ్చినవే’ అని ఆయన అంటారు. రాత్రి పడుకున్నప్పుడు నేను ఒంటరినే కదా? మళ్లీ సూర్యోదయం చూడగలనా? అని దిగులుగా ఉంటుంది. ఆ భావనలే ‘రాత్రి నదిలో ఒంటరిగా’ కవితగా రూపుదిద్దుకుందని ఆయన చెబుతుంటారు.


ముకుందరామారావు న్యూయార్క్‌లో ఏడాదిన్నర పాటు పనిచేశారు. వారాంతపు సెలవుల్లో గ్రంథాలయాలలో ఎక్కువ గడిపేవారట. వివిధ దేశాల సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారు. అనువాదం చేసే ఆలోచనతో కొన్ని కవితలు ఎత్తి రాసుకునేవారు. అక్కడ ఆయనకు తమ్మినేని యదుకుల భూషణ్‌ అనే కవిమిత్రుడు పరిచయమయ్యారు. ఆయనతో ఎక్కువ కాలం గడుపుతూ భావాలు పంచుకునే వాడినంటూ న్యూయార్క్‌లో తన సాహిత్యాధ్యయన అనుభవాలను ముకుందరామారావు చెబుతుంటారు.


ఒంగోలు నుంచి వెలువడే ‘ప్రకృతి సాహితి’ అనే పత్రికకు ఆయన పంపిన అనువాద కవితలన్నీ ఒకేసారి అచ్చువేశారు. దాంతో అనువాద రచనల పట్ల ఆయనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. న్యూయార్కు నుంచి వచ్చిన తర్వాత, ‘పాలపిట్ట’ సంపాదకులు గుడిపాటి సూచనతో 37 మంది నోబెల్‌ కవులను, వారి రచనలను పరిచయం చేశారు. నోబెల్‌ కవులలో విశ్వజనీనతే ఏకసూత్రతగా ఆయన భావిస్తారు. ‘సాహిత్యంలో నోబెల్‌ మహిళలు’ గురించి ‘నవ తెలంగాణా’ దినపత్రికలో రాశారు. ప్రపంచంలోని అనేకదేశాల కవిత్వాల తీరుతెన్నులను విశదీకరిస్తూ ‘అదే గాలి’ అనే పుస్తకాన్ని ఆయన వెలువరించారు. ‘ప్రపంచ కవిత్వం, భారతీయ భాషల్లో కవిత్వం చదివాను. భారతీయ కవిత్వంలో సౌందర్యం నాలో ఒకింత గర్వభావాన్ని కలిగించింది’ అది హృదయపరంగా ఉంటుందని ముకుందరామారావు అంటారు. పాశ్చాత్యకథలో అద్భుతమైన వచనం ఉంటుంది. జిమ్మిక్కులుండవు. భాషాపటాటోపం ఉండదు. ఇజ్రాయేల్‌, కొరియా, చైనా, పోలెండ్‌ కవిత్వం కూడా మన కవిత్వాన్ని పోలి ఉంటుందని ఆయన చెబుతారు. ఆయన వెళ్ళిన మొదటి విదేశం స్పెయిన్. తాను ఊహించిన దానికి భిన్నంగా అక్కడ కూడా ప్రకృతి ఒకలాగే ఉంది. అదే ఆకాశం, అదే నీరు, అదే గాలి. కేవలం మనుషులు వారి ఆచార వ్యవహారాలు జీవన విధానమే వేరు వేరుగా అనిపించిందంటారు.


బెంగాలీ, ఒరియా, మైథిలి, అస్సామీ వంటి భాషల కవిత్వచరిత్రలో ‘చర్యాపదాలు’ను ప్రథమకావ్యంగా పేర్కొంటారు. ‘చర్యాపదాలు’ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంతర్లీనంగా చెప్పింది వేరు. మనకు అర్థమయ్యేది వేరు. రాత్రి, పగలు కాని సంధ్యాసమయం వంటి భాషలో వాళ్ళు రాశారు. జీవితం కంటే మహాయాన బౌద్ధుల ఆచార వ్యవహారాలు అందులో ఉంటాయి. అదీ మహాయాన బౌద్ధులకే అర్థమయ్యేలా ఉంటాయని ముకుందరామారావు అంటారు. ఆరవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకూ వచ్చిన భక్తికవిత్వాన్ని ‘అదే కాంతి’ పేరిట తెలుగు చేస్తున్నారు. భారతీయ భాషలలోని వైవిధ్య కవిత్వ సంపదను తెలుగువారికి అందించిన ముకుందరామారావుకు తాపీ ధర్మారావు పురస్కారం ప్రదానం చేయడం సాహిత్యాభిమానులు అందరూ ఆనందించే విషయం. ఈ పురస్కార ప్రదానసభ సెప్టెంబర్ 18 ఉదయం పదిన్నర గంటలకు హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కాలేజీలో జరగనున్నది. ఆచార్య జయధీర్ తిరుమలరావు అధ్యక్షతన జరిగే ఈ సభలో ఉస్మానియా వర్శిటీ ఉప కులపతి ఆచార్య డి. రవీందర్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.


-బి.వి.అప్పారావు

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.