‘గూడు’పుఠాణి

ABN , First Publish Date - 2022-08-17T05:56:04+05:30 IST

బెజవాడలో అత్యంత ప్రధానమైన బందరు రోడ్డు వెంబడి రూ.500 కోట్ల విలువైన స్థలాన్ని ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

‘గూడు’పుఠాణి

రూ.500 కోట్ల జడ్పీ ఆస్తి ధారాదత్తానికి యత్నం

  పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థకు కట్టబెట్టే యోచన

 కమర్షియల్‌ మల్టీప్లెక్స్‌కు ప్రతిపాదనలు 

  అధికార పార్టీ పెద్దల జోక్యంపై అనుమానాలు 

 గుట్టుగా ఉంచుతున్న జడ్పీ అధికారులు

బెజవాడలో అత్యంత ప్రధానమైన బందరు రోడ్డు వెంబడి రూ.500 కోట్ల విలువైన స్థలాన్ని ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. జడ్పీకి చెందిన ఈ స్థలాన్ని ప్రైవేట్‌ అండ్‌ పబ్లిక్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) కింద ఓ బడా సంస్థకు కట్టబెట్టేందుకు గూడుపుఠాణీ నడుస్తోంది. పీపీపీ విధానంలో మల్టీప్లెక్స్‌ భవనం ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థ ఏమిటి? ఎక్కడిది? అధికార పార్టీకి చెందిన వారిదా? ఏ షేరింగ్‌ విధానంలో కట్టబెట్టాలనుకుం టున్నారు? అనే విషయాలు ప్రస్తుతం సస్పెన్‌ ్సగా ఉన్నాయి. ఆఘమేఘాల మీద  బందరు రోడ్డుపై మల్టీప్లెక్స్‌ భవనం ఏర్పాటు ప్రతిపాదనలపై ‘జడ్పీ’ ఆసక్తి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారుతోంది.  

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎన్టీఆర్‌ జిల్లాకు ఇంకా జడ్పీ విభజన జరగలేదు. విభజన జరిగితే జడ్పీకి కార్యాలయం అవసరం. విజయవాడలో చిన్న క్యాంపు కార్యాలయం మాత్రమే ఉంది. కొత్త జిల్లాలో జడ్పీ అవసరాలకు ఇది ఏమాత్రం సరిపోదు. కొత్త కార్యాలయం అవసరమే. అలా అని వాణిజ్య సముదాయాన్ని నిర్మించడాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. రూ.500 కోట్లు ఖరీదు చేసే స్థలాన్ని పీపీపీ విధానంలో ఇవ్వాలని భావించటమే తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 

 జడ్పీ హాలు కోసమని ప్రచారం

జడ్పీ పక్కనే లైలా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు పర్యాటక శాఖ గతంలో పీపీపీ విధానంలో భూమి కట్టబెట్టింది. దీని పక్కనే ఉన్న ఐదు ఎకరాల తమ స్థలాన్ని కూడా పీపీపీకి ఇవ్వాలని జడ్పీ అధికారులు భావిస్తున్నారు. మల్టీప్లెక్స్‌ ఆలోచనలు జడ్పీకి ఉన్నప్పటికీ ఏ పద్ధతిలో అనే విషయంపై పంచాయతీరాజ్‌ శాఖకు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వ లేదు. ఎన్టీఆర్‌ జిల్లాకు సంబంధించి జడ్పీ కార్యాలయం కోసం అన్న ట్టుగా జడ్పీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. జడ్పీ హాల్‌ కోసం ఇటీ వల ప్రతిపాదించినట్టుగా, ఆమోదించినట్టుగా ప్రచారం చేస్తున్నాయి.  

  గతంలో ఏం జరిగిందంటే..

 జడ్పీ హాల్‌ అవసరం ఎన్టీఆర్‌ జిల్లాకు లేదు. ఎందుకంటే జడ్పీ హాల్‌ను ఇప్పటికే గెస్ట్‌హౌస్‌ వెనుక ప్రాంతంలో నిర్మించారు. దీనిని కూడా ఓ ప్రైవేటు సంస్థ నిర్మించింది. పర్యాటక శాఖ అధికారులు తమ స్థలాన్ని మల్టీప్లెక్స్‌ కోసం లైలా గ్రూప్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. లైలా గ్రూప్‌కు ఈశాన్యం తక్కువగా ఉందన్న ఉద్దేశంతో 50 గజాల జడ్పీ స్థలాన్ని అప్పట్లో తీసుకున్నారు. దీనికి ప్రతిగా ఆ సంస్థ రూ.1.50 కోట్ల వ్యయంతో ప్రస్తుతం కూల్చివేసిన గెస్ట్‌హౌస్‌ వెనుక భాగంలో జడ్పీ హాల్‌ను నిర్మించింది. దీనికి మరిన్ని హంగులు కల్పిస్తే జడ్పీ హాల్‌ అవసరాలు పూర్తిగా తీరతాయి. 

  రెవెన్యూ స్థలాన్నీ కలుపుకునే యోచన

 జడ్పీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తన అధీనంలో ఉన్న భూములతో పాటు, పక్కనే రెవెన్యూ అధీనంలో ఉన్న జేసీ ఆఫీసును కూడా తరలించాలనే ప్రతిపాదన ఉంది. జేసీ క్యాంపు ఆఫీసు, నివాస ప్రాంతం కూడా జడ్పీకి చెందినదే. కానీ 50 ఏళ్ల కిందటే రెవెన్యూ ఆధీనంలో ఉంటూ వస్తోంది. ఆ స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుని మల్టీప్లెక్స్‌ ఆలోచన చేయటం గమనార్హం.  

  జీ ప్లస్‌ 8 మల్టీప్లెక్స్‌కు నిర్ణయం   

జడ్పీ గుంభనంగా ఉంచినా.. జీ ప్లస్‌ 8 విధానంలో మల్టీప్లెక్స్‌ను నిర్మించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత పెద్ద మల్టీప్లెక్స్‌ నిర్మించటానికి జడ్పీ దగ్గర  నిధులు లేవు.  దీంతో పీపీపీ విధానంలో దీనిని నిర్మించాలన్న ఆలోచనకు వచ్చింది. ఒప్పందం ప్రకారం ప్రైవేటు సంస్థకు వాణిజ్య అవసరాలకు కొన్ని ఫ్లోర్స్‌ కేటాయిస్తారు. మిగిలిన ఫ్లోర్లు జడ్పీ అధీనంలోకి వస్తాయి. వాటిని కార్యాలయాలకు వినియోగిస్తారా? విక్రయిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఈ మల్టీప్లెక్స్‌కు సంబంధించి ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నతస్థాయిలో చక్రం తిప్పుతుండటంతో అనేక అనుమానాలు నెలకొంటున్నాయి. అధికార పార్టీ పెద్దలకు చెందిన సంస్థకు కట్టబెట్టేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.  


Updated Date - 2022-08-17T05:56:04+05:30 IST