Advertisement

ములుగు-భద్రాద్రి అడవుల్లో.. రెండు పులుల సంచారం

Oct 27 2020 @ 04:49AM

టైగర్‌జోన్‌గా ఏటూరునాగారం 

29న మూడు రాష్ట్రాల అధికారుల సమావేశం 


గుండాల, అక్టోబరు 26: ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు పెద్దపులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖాధికారులు గుర్తించారు. వారం రోజుల కిందట గుండాల మండలంలోని సాయనపల్లి, ములుగు జిల్లాలోని బోల్లేపల్లి అడవుల్లో పులి సంచరించినట్లు ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ములుగు జిల్లాలో సైతం మరో పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న ములుగు జిల్లా అటవీశాఖాధికారులు 24 ట్రాకింగ్‌ కెమెరాలను అడవుల్లో ఏర్పాటు చేశారు. పులుల సంచారంపై 24 గంటలు నిఘాపెట్టారు. గుండాల మండలంలోని సాయనపల్లి, దామరతోగు అడవుల్లో మూడు కెమెరాలను ఏర్పాలు చేసినట్లు అటవీశాఖాశాధికారి మురళి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కవ్వాల్‌, అమ్రబాద్‌ ప్రస్తుతం టైగర్‌జోన్‌లుగా ఉండగా, ప్రస్తుతం ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచరిస్తున్న పులిని ఎం-1గా నామకరణం చేశారు. మరో పులి కోసం అడవుల్లో కెమెరాలను ఏర్పాటు చేసిన అటవీశాఖాధికారులు, గిరిజన గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలోని అభయారణ్యాన్ని టైగర్‌జోన్‌గా ప్రకటించడానికి అధికారులు ముమ్మరయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


ఏటూరునాగారం అభయారణ్యంతో పాటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యం, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి, మహరాష్ట్రలోని తడోబా అభయారణ్యాలను కలుపుతూ ఏటూరునాగారాన్ని టైగర్‌జోన్‌గా ప్రకటించనున్నారు. నవంబరు 1న ములుగు జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రంలో మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ములుగు డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌ శెట్టి ప్రకటించారు. ఏటూరునాగారం టైగర్‌జోన్‌ ఏర్పాటుతో భద్రాద్రి కొత్తగూడెం-ములుగు జిల్లాలోని అభయారణ్యాలు కేంద్ర పరిధిలోకి వెళ్లనున్నాయి. గుండాల మండలానికి మూడు దిక్కులుగా ఉన్న ములుగు జిల్లాలోని అనేక గ్రామాలు మండలానికి సరిహద్దుగా ఉన్నాయి. ఏటూరునాగారాన్ని టైగర్‌జోన్‌గా ప్రకటించడానికి అటవీశాఖాధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తుండగా, గిరిజన గ్రామాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖాధికారులు గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పులుల సంచారంపై అటవీశాఖాధికారులు నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం, ఏటూరునాగారాన్ని టైగర్‌జోన్‌గా ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది.


భయాందోళనలో ప్రజలు 

ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు అడవుల్లో పులులు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న మన్యం ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అడవులకు పశువులను, మేకలను మేతకు  తోలడానికి జంకుతున్నారు. పోడు భూముల్లో మొక్కజొన్న, పత్తి సాగు చేసిన రైతులు ఒంటరిగా వెళ్లడానికి ఆందోళన చెందుతున్నారు. పులులు సంచరిస్తున్నట్లు అటవీశాధికారులు కెమెరాలు ఏర్పాటు చేయడం, ప్రతీరోజు కెమెరాలను తనిఖీలు చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గుండాల-పస్రా, గుండాల-రంగాపురం గ్రామాల మధ్య  ద్విచక్ర  వాహనాలపై ప్రయాణించడానికి వాహనదారులు జంకుతున్నారు.

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.