ఆర్యన్‌ ఖాన్‌కు బెయిలు తిరస్కరించిన ముంబై కోర్టు

ABN , First Publish Date - 2021-10-08T23:20:14+05:30 IST

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు

ఆర్యన్‌ ఖాన్‌కు బెయిలు తిరస్కరించిన ముంబై కోర్టు

ముంబై : బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బెయిలు మంజూరు చేసేందుకు మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం సాయంత్రం తిరస్కరించింది. ఆయన బెయిలు దరఖాస్తుకు విచారణార్హత లేదని తెలిపింది. ఈ కేసులో ఇతర నిందితులు అర్బాజ్, మున్మున్‌లకు కూడా బెయిలును తిరస్కరించింది. 


ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలను సోమవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్టు చేశారు. వీరికి బెయిలు ఇచ్చేందుకు ముంబై మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. బెయిలు కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. 


ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేస్తే తమ దర్యాప్తునకు ఆటంకాలు ఏర్పడతాయని ఎన్‌సీబీ వాదించింది. ఆర్యన్ ఖాన్ సాక్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని, సాక్షులను ప్రభావితం చేయవచ్చునని తెలిపింది. 


నిందితులంతా పలుకుబడిగలవారని, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అడిషినల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదించారు. తక్కువ మోతాదులో ఒక వ్యక్తి పట్టుబడితే, ఆ పరిస్థితి వేరని చెప్పారు. బెయిలు మంజూరు వంటి రక్షణను ఈ దశలో కల్పించడం వల్ల దర్యాప్తునకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. 


ముంబై నగర తీరంలో ఓ క్రూయిజ్ షిప్‌లో పార్టీ జరుగుతుండగా ఆదివారం రాత్రి ఎన్‌సీబీ అధికారులు దాడి చేశారు. ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్స్‌నుబట్టి ఆయనకు ఇంటర్నేషనల్ డ్రగ్ కార్టెల్స్‌తో సంబంధాలు ఉన్నట్లు వెల్లడవుతోందని ఎన్‌సీబీ వాదిస్తోంది. 


Updated Date - 2021-10-08T23:20:14+05:30 IST