బుమ్రాకు మద్దతు కరువైంది.. ముంబై ఓటమికి కారణాలు చెప్పిన ఇర్ఫాన్ పఠాన్

ABN , First Publish Date - 2022-04-11T01:57:25+05:30 IST

ఐదుసార్లు ఐపీఎల్ విజేత అయిన ముంబై ఈసారి చతికిలపడింది. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడిన రోహిత్ సేన

బుమ్రాకు మద్దతు కరువైంది.. ముంబై ఓటమికి కారణాలు చెప్పిన ఇర్ఫాన్ పఠాన్

ముంబై: ఐదుసార్లు ఐపీఎల్ విజేత అయిన ముంబై ఇండియన్స్ ఈసారి చతికిలపడింది. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో అడుగున ఉంది. వరుస ఓటములు వేధిస్తుండడంతో రోహిత్ సేనకు ఏమైందన్న ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి.


ముంబై వరుస ఓటములకు కారణాలేంటన్న దానిపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తాజాగా మాట్లాడుతూ.. తిరిగి పుంజుకోగల శక్తి ముంబైకి ఉందన్నాడు. గతంలోనూ ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయన్నాడు. 2014, 2015 సీజన్‌ను ఈ సందర్భంగా పఠాన్ గుర్తు చేశాడు. ఇప్పుడు కూడా ఆ జట్టు అలాంటి పరిస్థితుల్లోనే ఉందన్నాడు. అయితే, నాటి జట్టుకు, నేటి జట్టుకు మధ్య కొంత తేడా ఉందన్నాడు. 


ముంబై బౌలింగ్‌తో పోలిస్తే బ్యాటింగ్ బాగానే ఉందన్నాడు. యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ పరుగులు సాధిస్తున్నారని, టాపార్డర్‌లో ఇషాన్ కిషన్ చెలరేగుతున్నాడని పఠాన్ చెప్పుకొచ్చాడు. అయితే, వచ్చిన చిక్కంతా బౌలింగ్‌లోనే ఉందన్నాడు. మరీ ముఖ్యంగా పేస్ ఎటాక్ చాలా వీక్‌గా ఉందన్నాడు.


బుమ్రాకు సరైన మద్దతు దొరక్కపోడం కెప్టెన్‌కు పెద్ద తలనొప్పిగా మారిందన్నాడు. కీరన్ పొలార్డ్ బ్యాట్ నుంచి కూడా పరుగులు రావాల్సి ఉందన్నాడు. సాధారణంగా మహారాష్ట్ర పిచ్‌లు పేసర్లకు అనుకూలిస్తాయన్నాడు. కాబట్టి సీమర్లు కనుక తమ బాధ్యత చక్కగా నిర్వర్తిస్తే ముంబైకి ఎదురుండదని అన్నాడు.  

Updated Date - 2022-04-11T01:57:25+05:30 IST