చెన్నై వర్సెస్ ముంబై: ఐపీఎల్‌లో నేడు ఆసక్తికర పోరు

ABN , First Publish Date - 2022-04-21T22:57:22+05:30 IST

ఐపీఎల్‌లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఆరు మ్యాచ్‌లు ఆడినా ఇప్పటి వరకు ఖాతా తెరవలేకపోయిన

చెన్నై వర్సెస్ ముంబై: ఐపీఎల్‌లో నేడు ఆసక్తికర పోరు

ముంబై: ఐపీఎల్‌లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఆరు మ్యాచ్‌లు ఆడినా ఇప్పటి వరకు ఖాతా తెరవలేకపోయిన ముంబై ఇండియన్స్, ఆరు మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్క విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న ఈ రెండు జట్లు ఇప్పుడు వరుస పరాజయాలతో అల్లాడిపోతున్నాయి. నేటి మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని ముంబై తలపోస్తుంటే, ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని చెన్నై పట్టుదలగా ఉంది.


బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ మైదానంలో చతికలపడుతోంది. నంబర్ వన్ బౌలర్ అయిన జస్ప్రీత్ బమ్రా ప్రత్యర్థులను ఏమాత్రం భయపెట్టలేకపోతున్నారు. ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగింటిలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. మిగతా ఆటగాళ్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు.


చెన్నై జట్టు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇప్పటి వరకు దీపక్ చాహర్‌ స్థానాన్నే భర్తీ చేయలేకపోయింది. క్రిస్ జోర్డాన్ డెత్ ఓవర్లలో రాణించలేకపోతున్నాడు. అయితే, ఇప్పుడు మహీష్ తీక్షణ జట్టులోకి రావడం కొంత ఊరటనిచ్చే అంశం. మొదటి మూడు మ్యాచుల్లో పవర్ ప్లేలో సీఎస్కే ఒక్క వికెట్‌ను మాత్రమే తీయగలిగింది. తీక్షణ వచ్చాక తర్వాతి మూడు మ్యాచుల్లో ఆరు వికెట్లు నేలకూల్చగా, అందులో నాలుగు శ్రీలంక స్పిన్నర్‌కు దక్కాయి. 


ఇక రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కేకి మరో పాజిటివ్ అంశం. అదే సమయంలో ముంబై ఓపెనింగ్ భాగస్వామ్యం విషయంలో కొంత ఆందోళన ఉంది. కెప్టెన్ రోహిత్ నుంచి ఇప్పటి వరకు భారీ ఇన్నింగ్స్ రాలేదు. ఇషాన్ కిషన్ క్రీజులో ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. బిగ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ కూడా ఇంకా బ్యాట్ ఝళిపించలేదు. ఈ నేపథ్యంలో పేలవ ఆటతీరుతో అట్టడుగున నిలిచిన రెండు జట్లు పోరాటానికి సిద్ధం కావడంతో అందరి దృష్టి నేటి మ్యాచ్‌పైనే ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాల్సిందే. 

Updated Date - 2022-04-21T22:57:22+05:30 IST