Cryptocurrency Investment Scam: డబ్బు విత్‌డ్రా చేస్తానంటే అడ్డుపడుతున్నాడు.. ఆ తర్వాత జరిగిందిదీ..

ABN , First Publish Date - 2022-05-29T23:32:46+05:30 IST

డబ్బు సంపాదించాలనే జనాల ఆశ మోసగాళ్లకు ఆసరా అవుతోందని నిరూపించే మరో ఘటన వెలుగుచూసింది.

Cryptocurrency Investment Scam: డబ్బు విత్‌డ్రా చేస్తానంటే అడ్డుపడుతున్నాడు.. ఆ తర్వాత జరిగిందిదీ..

నవీ ముంబై : డబ్బు సంపాదించాలనే జనాల ఆశలు మోసగాళ్లకు ఆసరా అవుతున్నాయని నిరూపించే మరో ఘటన వెలుగుచూసింది. ముంబైకి చెందిన ఓ వ్యక్తి క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ స్కాంలో పెద్ద మొత్తంలో నష్టపోయాడు. ఓ మోసగాడు చెప్పిన మాటలు నమ్మి ఏకంగా రూ.1.57 కోట్ల మేర మోసపోయాడు. క్రిప్టోకరెన్సీ మైనింగ్ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశచూపారని ముంబైలోని మలబార్ హిల్ ఏరియాకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ ఫేక్ వెబ్‌సైట్‌ ద్వారా తనను ట్రాప్ చేశారని వివరించాడు. ఈ మేరకు మలబార్ హిల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ మోసానికి సంబంధించిన వివరాలు..


నిందిత వ్యక్తి గతేడాది అక్టోబర్‌లో బాధితుడికి ఫోన్ చేసి క్రిప్టో కరెన్సీ మైనింగ్ గురించి మోసపూరిత మాటలు చెప్పాడు. ఆ తర్వాత తరచూ ఫోన్ చేస్తూ క్రిప్టోకరెన్సీ మైనింగ్‌లో లాభాలు బీభత్సంగా ఉంటాయని నమ్మబలికాడు. క్రిప్టో కరెన్సీ మైనింగ్ హార్డ్‌వేర్‌లో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో లాభాలు అందుకోవచ్చని చెప్పాడు. డబ్బు సంపాదనకు తన వద్ద ఎన్నో మార్గాలు ఉన్నాయని, ‘యూఎస్‌డీ మైనర్’ వెబ్‌సైట్ ద్వారా పెట్టుబడులు పెడితే ఎక్కువ సంపాదించొచ్చని నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన బాధితుడు 2.83 ఆస్ట్రేలియన్ డాలర్లు(రూ.1.53 కోట్లకుపైగా) పెట్టుబడి పెట్టాడు. అయితే పెట్టుబడి పెట్టిన కొంతకాలం తర్వాత నగదు ఉపసంహరణకు ప్రయత్నించగా నిందిత వ్యక్తి అడ్డుపడుతుండేవాడు. ఎక్కువకాలం వేచివుంటే ఎక్కుల లాభాలు వస్తాయని డబ్బులు డ్రా చేయకుండా నిలువరించేవాడు. అలా ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా అడ్డుపడుతూనే ఉండడంతో బాధితుడికి  అనుమానం వచ్చింది. ఈ నెల మొదట్లో తన డబ్బు తనకు కావాలంటూ ఒత్తిడి చేయడంతో నిందిత వ్యక్తి ఫోన్ స్విచాఫ్  చేసుకున్నాడు. నిందిత వ్యక్తికి సంబంధించిన సమాచారం కూడా ఏమీ లభించకపోవడంతో బాధితుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అతడు సూచించిన వెబ్‌సైట్ కూడా ఫేక్ అని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా సర్వీస్ ప్రొవైడర్, బ్యాంక్‌లకు పోలీసులు లేఖ రాశారు. ఫేక్ వెబ్‌సైట్‌తోపాటు డబ్బు జమయిన ఖాతాకు సంబంధించిన వివరాలు అందివ్వాలని కోరినట్టు తెలిపారు.

Updated Date - 2022-05-29T23:32:46+05:30 IST