పతీ.. పత్నీ ఔర్ పాస్‌పోర్ట్: ప్రియురాలితో కలిసి మాల్దీవులకు.. ఆపై కటకటాల్లోకి!

ABN , First Publish Date - 2022-07-09T21:06:00+05:30 IST

కంపెనీ పనిమీద విదేశాలకు వెళ్తున్నాను. నేనొచ్చే వరకు ఇల్లు జాగ్రత్త.. టచ్‌లోనే ఉంటాను, భయపడకు.. అంటూ

పతీ.. పత్నీ ఔర్ పాస్‌పోర్ట్: ప్రియురాలితో కలిసి మాల్దీవులకు.. ఆపై కటకటాల్లోకి!

ముంబై: కంపెనీ పనిమీద విదేశాలకు వెళ్తున్నాను. నేనొచ్చే వరకు ఇల్లు జాగ్రత్త.. టచ్‌లోనే ఉంటాను, భయపడకు.. అంటూ భార్యకు ఎన్నో జాగ్రత్తలు చెప్పిన ఓ ఇంజినీర్ ప్రియురాలితో కలిసి ఎంచక్కా మాల్దీవ్స్ చెక్కేశాడు. రహస్యం బయటపడకుండా ఉండాలన్న ఉద్దేశంతో పాస్‌పోర్టులోని పేజీలను చింపేశాడు. అంతా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశాననుకుని మాల్దీవుల్లో ఫ్లైటెక్కి ముంబైలో ల్యాండయ్యాడు. ఇప్పుడు తీరిగ్గా జైలులో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. 


ముంబై (Mumbai)కి చెందిన 32 ఏళ్ల ఇంజినీర్(Engineer) ఓ బహుళజాతి సంస్థలో పనిచేస్తున్నాడు. కంపెనీ పనిపై విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు చెప్పి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి మాల్దీవుల్లో (Maldives) వాలిపోయాడు. విదేశాలకు వెళ్లిన భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో భార్య మనసులో అనుమానం మొగ్గతొడిగింది. వాట్సాప్ (Whatsapp) కాల్స్ చేసినా అదే పరిస్థితి. భార్య ఫోన్ చేయడం, అతడు కట్ చేయడం.. ఇదే తంతు. ఆ తర్వాత మాల్దీవుల్లో విమానమెక్కిన అతడు పాస్‌పోర్టులోని వీసా  స్టాంప్‌డ్ పేజీలను చింపేశాడు. భార్యకు దొరకడం ఇక అసంభవమని గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నాడు. 


అయితే, ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి. గురువారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండైన ఇంజినీర్ పాస్‌పోర్టులోని 3-6, 31-34 పేజీలు కనిపించకపోవడంతో ఇమ్మిగ్రేషన్ (Immigration) అధికారులు అనుమానించారు. అడిగిన ప్రశ్నలకు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో వారు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అతడిపై మోసం, ఫోర్జరీ కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

అనంతరం అతడిని విచారించగా చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు. ప్రియురాలితో కలిసి మాల్దీవులకు వెళ్లానని చెప్పిన అతడు.. ఆ విషయం తన భార్యకు తెలియకుండా ఉండేందుకు పాస్‌పోర్టులో పేజీలను తానే చింపేశానని అంగీకరించాడు. పాస్‌పోర్టులోని పేజీలు చింపడం నేరమన్న సంగతి అతడికి తెలియదని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-07-09T21:06:00+05:30 IST