
కాపాడిన ముంబై పోలీసులు
ముంబై(మహారాష్ట్ర): ముంబై నగరంలోని పంత్నగర్ సమీపంలోని డ్రైనేజీ కాల్వలో ఆగంతకులు వదిలివెళ్లిన శిశువును ముంబై నిర్భయ పోలీసులు కాపాడిన ఘటన సంచలనం రేపింది. గుర్తుతెలియని వారు నవజాత శిశువును గుడ్డలో చుట్టి డ్రైనేజీ కాల్వలో వదిలివెళ్లారు. డ్రైనేజీకాల్వలో పసికందును చూసిన పిల్లులు మ్యావ్ మ్యావ్ అంటూ అరుస్తూ అల్లకల్లోలం సృష్టించి స్థానికులను అప్రమత్తం చేశాయి. దీంతో స్థానికులు పంత్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముంబై నగరంలోని క్రైమ్ హాట్స్పాట్లలో గస్తీ నిర్వహిస్తున్న ముంబై పోలీసుల నిర్భయ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుంది.
డ్రైనేజీ కాల్వలో నుంచి శిశువును కాపాడి రాజవాడి ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో శిశువు కోలుకుంటోంది. పిల్లులు అప్రమత్తం చేయడంతో డ్రైనేజీ కాల్వలో నుంచి శిశువును కాపాడామని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. పాప తల్లిదండ్రులు ఎవరనేది వివరాలు తెలియలేదు. పిల్లులు అప్రమత్తం చేయడంతోనే కాల్వలో శిశువు ఉన్నట్లు స్థానికులు గుర్తించారని పోలీసులు చెప్పారు. పాపను ఎవరు వదిలారు అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.