ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డరిచ్చిన వృద్ధురాలికి ఊహించని షాక్..! జీవితమంతా కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా..

ABN , First Publish Date - 2022-01-16T02:24:35+05:30 IST

ఆన్‌లైన్‌లో పిజ్జా, డ్రైఫ్రూట్స్ ఆర్డరిచ్చిన ఓ వృద్ధురాలికి ఊహించని షాక్ తగిలింది. తాను జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న సొమ్ము యావత్తు ఆమె పోగొట్టుకున్నారు.

ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డరిచ్చిన వృద్ధురాలికి ఊహించని షాక్..! జీవితమంతా కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా..

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో పిజ్జా, డ్రైఫ్రూట్స్ ఆర్డరిచ్చిన ఓ వృద్ధురాలికి ఊహించని షాక్ తగిలింది. జీవితమంతా కష్టపడి కూడబెట్టిన సొమ్ము యావత్తు పోగొట్టుకోవడంతో ఆమె ఏం చేయాలోపాలుపోని స్థితిలో కూరుకుపోయారు. ముంబైలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. ఆమె శనివారం పోలీసులను సంప్రదించడంతో జరిగిన దారుణం గురించి వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమె గతేడాది జూలైలో పిజ్జా కోసం ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చారు. ఆ తరువాత ఫోన్ ద్వారా చెల్లింపులు జరిపారు. ఈ క్రమంలో ఆమె ఏకంగా రూ. 9999 నష్టపోయారు. ఆ తరువాత అక్టోబర్ 29న డ్రైఫ్రూట్స్ కోసం మళ్లీ ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి రూ. 1496ను పోగొట్టుకున్నారు. దీంతో.. పోయిన సొమ్మును రాబట్టుకునే విధానాల కోసం ఆమె గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఈ క్రమంలో కనబడ్డ ఓ నెంబర్‌కు ఫోన్ చేశారు.


దీంతో.. ఆమె నిందితులకు చిక్కారు. వారు చెప్పినట్టే తన ఫోన్లోకి వృద్ధురాలు మరో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంతో..ఆమె బ్యాంకు, ఇతర వ్యక్తిగత వివరాలన్నీ సైబర్ నేరగాళ్లకు చిక్కాయి. ఫలితంగా వారు ఆమె అకౌంట్‌లోని రూ. 11.78 లక్షలను నవంబర్ 1 నుంచి డిసెంబర్ 21 మధ్య విడతల వారీగా తస్కరించారు. తాను కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా నేరగాళ్లు దోచుకుపోయారని ఆ తరువాత గుర్తించిన ఆమె శనివారం నాడు పోలీసులను ఆశ్రయించారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-01-16T02:24:35+05:30 IST