ముమ్మాటికీ ఉల్లంఘనే

ABN , First Publish Date - 2021-10-17T06:31:44+05:30 IST

కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల మధ్య గల కొండల నుంచి గ్రావెల్‌, మట్టి తరలింపునకు ఎటువంటి అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు తేల్చారు.

ముమ్మాటికీ ఉల్లంఘనే

విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల నుంచి గ్రావెల్‌ తరలింపునకు అనుమతులు లేవన్న రెవెన్యూ

కలెక్టర్‌కు అనకాపల్లి ఆర్డీవో ప్రాథమిక నివేదిక

ఆ ప్రాంతంలో గెడ్డలు, వాగులపై సమగ్ర సర్వే అవసరం

పనులు నిలిపివేతకు ఆదేశాలు 

గనుల శాఖ అధికారుల మెడకు ఉచ్చు


విశాఖపట్నం/అనకాపల్లి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):

కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల మధ్య గల కొండల నుంచి గ్రావెల్‌, మట్టి తరలింపునకు ఎటువంటి అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు తేల్చారు. కేవలం దరఖాస్తు చేసుకున్నారు తప్ప తాము అనుమతులు జారీచేయలేదని స్పష్టంచేశారు. నిబంధనల ప్రకారం రెవెన్యూ నుంచి ఎన్‌వోసీ జారీ అయిన తరువాతే గనుల శాఖ అనుమతులు ఇచ్చి పర్మిట్లు ఇవ్వాలని, అటువంటి ప్రక్రియ ఇక్కడ జరగలేదని నిర్ధారించారు. 

విస్సన్నపేట, జమాదులపాలెం మధ్య జరుగుతున్న ‘భూయజ్ఞం’పై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించడంతో స్పందించిన కలెక్టర్‌ మల్లికార్జున, విచారణ జరపాల్సిందిగా అనకాపల్లి ఆర్డీవో సీతారామరావును ఆదేశించిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం ఆర్డీవో ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్‌కు ప్రాఽథమిక నివేదిక ఇచ్చారు. అందులో పలు విషయాలను ఆర్డీవో ప్రస్తావించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ ప్రాంతంలో గల కొండలు తవ్వి గ్రావెల్‌, మట్టి, రాయి తరలింపునకు కొందరు దరఖాస్తు చేశారని, అయితే రెవెన్యూపరంగా అనుమతులు ఇవ్వలేదని నివేదికలో పేర్కొన్నారు. నిబంధనల మేరకు రెవెన్యూ అధికారులు ఎన్‌వోసీ జారీచేసిన తరువాతే గనుల శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే అటువంటి ప్రక్రియ ఏదీ జరగలేదని నివేదికలో పేర్కొన్నారు. ఇక, ఈ ప్రాంతంలో 49.64 ఎకరాలకు విస్తరించిన రంగబోలు గెడ్డ...భూములు చదునుచేసే ప్రాంతానికి దూరంగా వుందని ప్రాథమిక నివేదికలో పొందుపరిచారు. అయితే ఇప్పటివరకు చదును చేసిన ప్రాంతంలో వాగులు, గెడ్డలు ఉన్నాయా?...అనేది పరిశీలించాల్సి వున్నదని పేర్కొన్నారు. రెండు గ్రామాల మధ్య కొండలు, వాగులు, గెడ్డలు, జిరాయితీ ఇలా మొత్తం భూములు సమగ్ర సర్వే చేయడానికి కొంత సమయం పడుతుందని ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. కాగా విస్సన్నపేటలో భూములు చదునుచేసే పనులను నిలిపివేయాలని అక్కడ పనిచేసే సిబ్బందిని ఆర్డీవో ఆదేశించారు. దీంతో పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కాగా కలెక్టర్‌ ఆదేశాలతో విచారణ చేపట్టిన ఆర్డీవోపైనా, ఇంకా కశింకోట తహసీల్దార్‌పై అధికార పార్టీ నేతలు ఒత్తిడి ప్రారంభించారనే ప్రచారం సాగుతుంది. భూములు చదునుచేసే ప్రాంతంలో  పలు అక్రమాలు జరిగాయని అధికారులు గుర్తించిన విషయాన్ని తెలుసుకున్న అధికార పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. విచారణ వ్యవహారంలో తీవ్రత తగ్గించేలా చూడాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలిసింది. 

గనుల శాఖ అధికారుల మెడకు ఉచ్చు

విస్సన్నపేట, జమాదులపాలెం మధ్య కొండలు తవ్వి నెల రోజుల నుంచి పరవాడ ఫార్మాసిటీలో గల ఒక కంపెనీకి తరలిస్తున్నారు. గ్రావెల్‌, మట్టి తరలించాలంటే గనుల శాఖ అనుమతి ఉండాలి. అయితే ఈ వ్యవహారంలో గనుల శాఖ అనకాపల్లి ఏడీ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంపై సంబంధిత ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. అక్రమార్కులు విస్సన్నపేటలో రెండు కొండలు తవ్వేసి  వేల క్యూబిక్‌ మీటర్లు గ్రావెల్‌, రాయి తరలించిన నేపథ్యంలో కొందరు సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం వుందని తెలిసింది. 

Updated Date - 2021-10-17T06:31:44+05:30 IST