ఎందుకీ చిన్నచూపు? భద్రాద్రి భవితపై ‘ముంపు’ ప్రభావం

ABN , First Publish Date - 2021-02-27T05:02:51+05:30 IST

ఎందుకీ చిన్నచూపు? భద్రాద్రి భవితపై ‘ముంపు’ ప్రభావం

ఎందుకీ చిన్నచూపు?  భద్రాద్రి భవితపై ‘ముంపు’ ప్రభావం
వర్షాకాలంలో గోదావరి వరదల సమయంలో పరిస్థితి ఇలా (ఫైల్‌)

స్థానికుల్లో ‘బ్యాక్‌వాటర్‌’ భయం

గ్రామాలను ఖాళీ చేయాలని కేఆర్‌పురం ఐటీడీఏ అధికారుల ఆదేశాలు

పోలవరం పనుల నేపథ్యంలో ఉత్తర్వులు 

భద్రాచలం, ఫిబ్రవరి 26: ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో ఉన్న 25గ్రామాలకు చెందిన వారిని ఏప్రిల్‌ నెలాఖరుకల్లా ఖాళీ చేయించి ఆర్‌అండ్‌ఆర్‌ కొత్తకాలనీలకు వెళ్లాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కోటరామచంద్రాపురం (కేఆర్‌పురం) ఐటీడీఏ పీవో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మరో వైపు పోలవరం బ్యాక్‌వాటర్‌తో ముంపు ముప్పు పొంచి ఉన్న భద్రాచలం విషయంపై అటు కేంద్రం కానీ, ఇటు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం దృష్టి సారించకపోవడం పట్ల భద్రాద్రివాసులు తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి సామాజిక మాధ్యమాల్లో కేఆర్‌పురం పీవో జారీ చేసిన ఉత్వర్వులు విస్తృతంగా ప్రచారం కావడంతో భద్రాద్రివాసుల్లో ఒక్కసారిగా కలవరం నెలకొంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పనులు శరవేగంగా సాగుతుండగా భద్రాద్రి విషయంపై ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు ఎవరు నోరుమెదపకపోవడం ఎంతవరకు సమంజసమని భద్రాద్రివాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం (గ్రామపంచాయతీ మినహాయించి) పోలవరం ముంపు మండలాల పేరుతో ఏపీ పరిధిలోకి వెళ్లడంతో తన ఉనికినే  భద్రాచలం కోల్పోయింది. ఎటు చూసినా కిలోమీటరులోపే సరిహద్దులు ఉండటంతో చివరకు డంపింగ్‌ యార్డు సైతం లేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ నేపఽథ్యంలో తాజాగా కేఆర్‌పురం ఐటీడీఏ పీవో జారీ చేసిన నోటీసుతో భద్రాద్రివాసుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా ప్రభు త్వాలు ఏ మాత్రం ఈ విషయంపై స్పష్టతనివ్వకపోవడం వారిని ఆవేదనకు గురి చేస్తోంది. ప్రతీ ఏటా వరదల సమయంలో జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో గోదావరి వరదలతో నదీ పరివాహక ప్రాంతంలోని భద్రాచలం ఏజెన్సీవాసులు ముంపునకు గురై తల్లడిల్లుతున్న సందర్భాలు అనేకం. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బ్యాక్‌ వాటర్‌ కారణంగా భద్రా చలంతోపాటు పైన ఉన్న ఇతర ప్రాంతాలకు బ్యాక్‌ వాటర్‌ ముంపు సమస్య పొంచి ఉందని సాగు నీటిరంగ నిపుణులు పేర్కొంటు న్నారు. కరకట్టల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోవడం, పట్టణంలో కరకట్టల నిర్మాణం చేపట్టినా విస్తాకాంప్లెక్సు, అశోకనగర్‌ కొత్తకాలనీ, సుభాష్‌నగర్‌ స్లూయిస్‌ల వద్ద తరచూ లీకులు ఏర్పడుతుండటంతో ఈ కరకట్టలు పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ వచ్చిన సమయంలో ఏ మేరకు రక్షణగా నిలుస్తాయనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న అని స్థానికులు పేర్కొంటున్నారు. ఇంత ఇబ్బందికర పరిస్థితులు పొంచి ఉన్నా కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భద్రాద్రి పుణ్యక్షేత్రం ముంపు విషయంపై ఎలాంటి స్పష్టమైన హామీఇవ్వకపోవడం పట్ల భద్రాద్రివాసులు విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ అంశం సైతం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో భద్రాద్రి ముంపు విషయమై కేసు వేసిన క్రమంలో క్షేత్రస్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ నిపుణులు, అధికారులు సర్వే నిర్వహించి ఇందుకు ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన చర్యలపై నివేదిక అందజేయాలని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. అలాగే పలుమార్లు తెలంగాణకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించినా ఆచరణలో వచ్చేసరికి ఎలాంటి రక్షణాత్మక చర్యలు చేపట్టకపోవడంతో భద్రాద్రి వాసుల్లో ఆందోళన అధికమవుతోంది. ఒక వైపు ఏపీలో గ్రామాలు ఖాళీ చేయమని ఆదేశాలు జారీ అవుతుండగా మరో వైపు భద్రాద్రి భవితపై పాలక ప్రభుత్వాలకు ఎందుకీ చిన్నచూపనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-02-27T05:02:51+05:30 IST