టార్గెట్‌.. కట్టడి!

ABN , First Publish Date - 2021-03-09T05:12:04+05:30 IST

జిల్లాలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో వెంకటగిరి, ఆత్మకూరులు కాస్త వేడిగా కనిపిస్తున్నాయి.

టార్గెట్‌.. కట్టడి!

ఆత్మకూరు, వెంకటగిరిలోనూ విజయం సాధించాలి

వ్యూహాలు రచిస్తున్న అధికార పార్టీ నేతలు

ప్రత్యర్థులపై పోలీస్‌ నిఘా

ముగిసిన ప్రచారం.. ఇక తెరవెనుక రాజకీయం

ఓటుకు నోటు షరామామూలే!


 మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రక్రియలో భాగంగా పంపకాలకు తెరలేచింది. వెంకటగిరి, ఆత్మకూరు మున్సిపాలిటీలాను ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో నాయకులు తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. ఓటుకు రూ.2వేలు ఇస్తుండగా, బాగా పోటీ ఉన్న చోట రూ.5వేల వరకు కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పట్టణ ఓటు రేటు గరిష్ఠంగా ఎంత పలుకుతుందో, కరెన్సీ నోటుతోపాటు ఇంకే విధమైన తాయిలాలు పంచనున్నారో మంగళవారానికి స్పష్టత రానుంది. ఎన్నికల ప్రచారంలో కీలక ఘడియలను అధికార పార్టీ తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పోలీసుల ద్వారా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 


నెల్లూరు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో వెంకటగిరి, ఆత్మకూరులు కాస్త వేడిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ గెలుపు కోసం అధికార, ప్రతిపక్షాలు బలంగా తలపడుతున్నాయి. వెంకటగిరిలో అభ్యర్థులు చేజారిపోకుండా, వారిపై అధికార పార్టీ ఒత్తిడి పడకుండా అడ్డుకునే క్రమంలో మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ క్యాంప్‌ రాజకీయం నడిపారు. టీడీపీ అభ్యర్థులను చెన్నైకి తరలించడం ద్వారా ఏకగ్రీవాల సంఖ్యను తగ్గించగలిగారు. నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీల్లో ఈ పని చేయని కారణంగా టీడీపీ దారుణంగా నష్టపోయింది. నాయుడుపేట లో రెండు వార్డులు మినహా మొత్తం వైసీపీకి (23 వార్డులు) ఏకగ్రీవం కాగా, సూళ్లూరుపేటలో చైర్మన్‌ పదవికి అవసరమైన 14 వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. టీడీపీకి పట్టుకలిగిన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి నియోజకవర్గ టీడీపీ నాయకులే కారణమని ఆ పార్టీ అధిష్ఠానం భావించడం, ఆ క్రమంలో ఒకరిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి, మరొకరికి చివరి అవకాశం అంటూ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది. అయితే పక్కనే ఉన్న వెంకటగిరిలో మాత్రం టీడీపీ బలంగా పోటీ ఇస్తోంది. మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల పోరాటపఠిమకు పార్టీ జిల్లా నాయకులు సైతం అండగా నిలిచారు. రాష్ట్ర నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు పాశిం సునీల్‌, పరసారత్నంలు ఇక్కడ టీడీపీ తరఫున ప్రచారం చేశారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఒక్కరే వైసీపీ సారథ్యం వహిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల పార్టీ పరశీలకునిగా మెట్టుకూరు ధనంజయరెడ్డి ఆనం వెంట ఉన్నారు. వెంకటగిరిలో ఎన్నికలు జరుగుతున్న 22 వార్డుల్లో మెజారిటీ వాటిలో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు బలంగా పోటీ పడుతున్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో అధికార పార్టీ తరపున స్థానిక నాయకులే సారథ్య బాధ్యతను వహిస్తున్నారు. డాక్టర్‌ ఆదిశేషయ్య, డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌,  చల్లా రవికుమార్‌రెడ్డి, అల్లారెడ్డి ఆనందరెడ్డిలు వైసీపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను పర్యవేక్షించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డిలు ఆత్మకూరులో ప్రచారం చేశారు. బీజేపీ తరఫున జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్‌, కుడుముల సుధాకర్‌రెడ్డి, కరకంబాటి సుధాకర్‌, కాలం బుజ్జిరెడ్డి, సీపీఎం తరపున జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌ తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైసీపీ నాయకత్వ బాధ్యతలు చూస్తున్నారు. టీడీపీ తరఫున నెలవల సుబ్రహ్మణ్యం, వేనాటి సతీ్‌షరెడ్డిలు ప్రచారం చేశారు. 


ఓటు నేటి ధర రూ. 2వేలు

వెంకటగిరి, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో ప్రస్తుతానికి ఓటు రేటు కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ. 2 వేలు పలుకుతోంది. వెంకటగిరిలో ప్రత్యేకించి కొన్ని వార్డుల్లో ఓటు రేటు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వార్డుల్లో గెలవాలని అభ్యర్థులు, అక్కడ వారిని ఓడించాలని అదే పార్టీకి చెందిన మరో వార్డుకు చెందిన అభ్యర్థులు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ వార్డులో ఓటు రేటు భారీగా పెరిగనుందని స్థానికులు అంటున్నారు. ఆత్మకూరులో కూడా ఓటు రేటు కనిష్ఠంగా రూ.500 గరిష్ఠంగా రూ. 2వేల వరకు పలుకుతోందని అంటున్నారు. అయితే ఇక్కడ గెలుపునకు అవసరమైన ఓట్ల కొనుగోలుపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు.  అవసరమైతే ఓటుకు రూ.5వేలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరెన్సీ నోటుతో పాటు ఇంటింటికి మద్యం పంపిణీ షరామామూలే. ఇక మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి చీరలు, ముక్కుపుడకలు పంచాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 


ప్రతిపక్షాలపై ప్రత్యేక నిఘా

ఓటుకు నోటు పంపిణీ విషయంలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను కట్టడి చేయడానికి అధికార పార్టీ నాయకులు పథకం రచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష అభ్యర్థులపై పోలీస్‌ నిఘా ఏర్పాటు చేసినట్టు సమాచారం. వీఐపీలకు గన్‌మెన్లు ఏర్పాటు చేసినట్లు ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులకు ఒక్కో పోలీ్‌సను కేటాయించారని, షిఫ్టుల వారీగా ప్రతిపక్ష నాయకుల కదలికలపై నిఘా ఉంచారని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు డబ్బులు పంచకుండా అడ్డుకోవడం, తాము పంచుకోవడానికి అడ్డంకులు లేకుండా భద్రత కల్పించడం పోలీసుల విధిగా అధికార పార్టీ నాయకులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని చెబుతున్నారు. 

Updated Date - 2021-03-09T05:12:04+05:30 IST