ముగిసిన మొర మొదలైంది... ఎర

ABN , First Publish Date - 2021-03-09T06:35:05+05:30 IST

ప్రచారం ముగియడంతో పార్టీలు ప్రలోభాల వలపై దృష్టిసారించాయి. సోమవారం రాత్రి నుంచి ఎక్కడికక్కడ నగదు పంపిణీ ప్రారంభించాయి.

ముగిసిన మొర   మొదలైంది... ఎర

మున్సిపల్‌ ఎన్నికల ప్రచార పర్వం ఎట్టకేలకు ముగిసింది. సోమవారంసాయంత్రం అయిదు గంటలతో ఎక్కడికక్కడ మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో పార్టీలు ప్రచారం పరిసమాప్తం చేశాయి. గడిచిన కొన్ని రోజులుగా ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు వార్డుల్లో హోరాహోరీగా ప్రచారం కొనసాగించారు. మంత్రుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వరకు తమ అభ్యర్థుల తరపున ప్రచార బరిలో దిగి విజయం కోసం ఊరూరా తిరిగారు. ఎట్టకేలకు గడువు ముగియడంతో సోమవారం సాయంత్రంతో ఎక్కడికక్కడ మైకులు బంద్‌ అయ్యాయి. అటు పోలింగ్‌ జరగనున్న బుధవారానికి ఇంకా ఒకరోజే గడువు ఉండడంతో అధికార వైసీపీ సోమవారం రాత్రి నుంచే ప్రలోభాలకు తెరతీసింది. ఓటరు స్లిప్పుల పంపిణీ పేరుతో వార్డుల్లో నగదు పంపకాలు ప్రారంభించింది. పోటీ తీవ్రత  బట్టి వార్డుల్లో రూ.2 వేల నుంచి రూ.వెయ్యి వరకు పంపిణీ చేస్తోంది. 

ముగిసిన పుర ఎన్నికల ప్రచార పోరు

సోమవారం సాయంత్రం అయిదు గంటలతో పరిసమాప్తమైన ప్రచారం

 అప్పుడే మున్సిపాల్టీల్లో ప్రలోభాలకు  తెర లేపిన అధికార వైసీపీ

ఓటరు స్లిప్పుల అందజేత పేరుతో  వార్డుల్లో ఇంటింటికీ నగదు పంపిణీ 

ఓటుకు వెయ్యి చొప్పున అందజేత.. మండపేట,   పెద్దాపురం, పిఠాపురంలో తెగుతున్న నోట్ల కట్టలు

మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాల్టీల్లో భారీ మెజార్టీల వ్యూహంతో భారీ పంపకాలు

 అటు రేపే పోలింగ్‌.. ఓటరు తీర్పు ఎటో..

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ప్రచారం ముగియడంతో పార్టీలు ప్రలోభాల వలపై దృష్టిసారించాయి. సోమవారం రాత్రి నుంచి ఎక్కడికక్కడ నగదు పంపిణీ ప్రారంభించాయి. పోలింగ్‌ బుధవారం కావడంతో మిగిలిన ఉన్న తక్కువ సమయం నేపథ్యంలో ఓటర్లను తమవైపునకు ఆకర్షించేలా ఎరలు వేస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ అడ్డగోలుగా బరితెగించడం మొదలుపెట్టింది. ప్రచారంలో ప్రయోగించిన సంక్షేమ పథకాల ప్రచారం పెద్దగా ఫలి తం ఇచ్చే అవకాశం కనిపించకపోవడంతో కొంత బెంగగా ఉంది. దీంతో ఆఖరి ఆస్త్రంగా నగదు పంపిణీని నమ్ముకుంది. అందులోభాగంగా ఆయా మున్సిపాల్టీలో టీడీపీ నుంచి ఎదురవుతున్న పోటీ తీవ్రత ఆధారంగా నగదు పంపిణీ మొదలు పెట్టింది. తుని మున్సిపాల్టీలో 15 వార్డులు ఏకగ్రీవం చేసుకున్నప్పటికీ మొత్తం అన్ని వార్డులు క్లీన్‌స్వీప్‌ చేయాలనే లక్ష్యంతో మిగిలిన వార్డుల్లో ఆయా టీడీపీ అభ్యర్థి బలం ఆధారంగా నగదు విసురుతోంది. కొన్నిచోట్ల ఓటర్లకు రూ.2 వేలు, మరికొన్నిచోట్ల రూ.వెయ్యి చొప్పున ఓటర్‌ స్లిప్పుల పంపిణీ రూపంలో అందిస్తోంది. పిఠాపురం, గొల్లప్రోలులో కలిపి ఒకే ఒక ఏకగీవ్రం నమోదైంది. దీంతో దాదాపు అన్ని వార్డుల్లోను టీడీపీ నుంచి పోటీ ఎక్కువగా ఉంది. దీంతో ఓటర్లకు వెయ్యి చొప్పున నగదు, అక్కడక్కడా చీరలు పంపిణీ చేస్తోంది. ఎన్ని ఎత్తులు వేసినా పెద్దాపురం, సామర్లకోట మున్సిపాల్టీల్లో కలిపి కేవలం రెండే రెండు ఏకగ్రీవాలు వైసీపీ ఖాతాలో పడగా, ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ ఎక్కువగా ఉంది. పైగా ఇక్కడ వైసీపీకి ఎమ్మెల్యే లేకపోవడంతో అధికారపార్టీ కీలక         నేతలు ప్రత్యేకంగా దృష్టిసారించారు. సోమవారం రాత్రి పాక్షికంగా నగదు పంపిణీ చేపట్టగా, మంగళవారం రాత్రి మాత్రం ఈ రెండుచోట్ల కోట్లలో పారించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ రెండుచోట్ల కలిపి రూ.6 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్టు సమాచారం. పెద్దాపురంలో కొన్ని వార్డుల్లో రూ.2,500 వరకు కూడా ఎర వేస్తున్నారు. రామచంద్రపురం మున్సిపాల్టీ పరిధిలో అక్కడ పదవిలో ఉన్న కీలక నేత ఏకపక్ష విజయం కోసం భారీగా నగదు పంపిణీ స్కెచ్‌ అమలు చేస్తున్నారు. నగదు, మద్యం విచ్చలవిడిగా వెదజల్లుతున్నారు. సోమవారం రాత్రి వార్డుల్లో ఎంపిక చేసిన ప్రాంతాలకు నగదు తరలింపు పూర్తయింది. అమలాపురంలో అక్కడ అధికారంలో ఉన్న కీలక నేత మున్సిపాల్టీ చేజారిపోకుండా, భారీ మెజార్టీ సాధించి అధినేత వద్ద మార్కులు కొట్టేయ డం కోసం అన్ని రకాల అస్త్రాలు సోమవారం రాత్రి నుంచి వాడడం మొదలుపెట్టారు. ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీల్లో స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు మున్సిపాల్టీలకు ధీటుగా పంపకాలకు సిద్ధం అయ్యారు. మంగళవారం రాత్రి నుంచి ఓటుకు రూ.500 నుంచి రూ.1500 వరకు పంచడానికి వార్డులకు నగదు తరలించారు. మండపేటలో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఇక్కడ టీడీపీకి ఎమ్మెల్యే ఉండడం, వైసీపీకి పక్క నియోజకవర్గం నుంచి నాయకత్వాన్ని కేటాయించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. పొరుగునేత తన పట్టు నిరూపించుకునేందుకు వీలుగా భారీగా వెదజల్లి అధినేత వద్ద మార్కులు కొట్టేయడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.9 కోట్ల వరకు వెచ్చించనున్నట్టు సమా చారం. మంగళవారం మధ్యాహ్నం ఇక్కడ వైసీపీ నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసింది. 

ఓటుకు రూ.5 వేలట!

అమలాపురం (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల ప్రచారపర్వం ముగియడంతో అభ్యర్థులు ఓట్ల కొనుగో లుకు కసరత్తు చేస్తున్నారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పంపిణీచేసి ఓటర్లను ప్రలోభ పెడు తున్నారు. అమలాపురం పురపాలక సంఘంలోని 15వ వార్డులో మాజీ ఎమ్మెల్యే, శెట్టిబలిజ నాయకుడు కుడు పూడి చిట్టబ్బాయి కోడలైన సత్యశైలజ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉండడంతో ఆమె ఓటమి లక్ష్యంగా వైసీపీలోని చైర్మన్‌ పీఠంపై కన్నేసిన ప్రత్యర్థి వర్గం నాయకులు ఈ వార్డులో మరో అభ్యర్థినిని ఆమెకు ధీటుగా పోటీకి నిలి పి ఆమెకు మద్దతుగా ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వెచ్చించడంతోపాటు ఇతర ప్రాంతాల్లో స్థిర పడ్డ వారికి సకల సౌకర్యాలతో ఓటు వేసేందుకు రప్పి స్తున్నారంటే ఇక్కడ సత్యశైలజపై ప్రత్యర్థి వర్గం చేస్తున్న ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయన్నది ఆసక్తికరంగా మా రింది. అదేవిధంగా మరో మూడు వార్డుల్లో రూ.2వేల నుంచి రూ.3వేల వరకు వెచ్చిస్తున్నారు. మరో వార్డులో ఒక వైసీపీ అభ్యర్థి రూ.5 వేలు పంపిణీ ప్రారంభించారు. టీడీపీ అభ్యర్థులు కొన్ని వార్డుల్లో రూ.వెయ్యి నుం చి రూ.2 వేల వరకు, ఇక జనసేన అభ్యర్థులు కూడా రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వెచ్చిస్తున్నారు.

రేపే పోలింగ్‌..

ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలకు బుధవారం పోలింగ్‌ జరగనుంది. ఉదయం ఏడు నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు జరిగే పోలింగ్‌కు అధికారులు పక్కా ఏర్పాట్లు పూర్తిచేశారు. 268 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఏకగ్రీవాలు 35 అవడంతో 233 వార్డులకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 3,52,136 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 437 పోలింగ్‌ స్టేష న్లు సిద్ధం చేస్తున్నారు. ఇందులో 154 సున్నిత ప్రాంతాలు కాగా, 132 అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాలున్నాయి.మొత్తం 702 బ్యాలెట్‌ బాక్సులు వినియోగిస్తున్నారు.




Updated Date - 2021-03-09T06:35:05+05:30 IST