ముగిసిన పుర పోరు

ABN , First Publish Date - 2021-11-16T06:49:57+05:30 IST

జిల్లాలో పుర పోరు ముగిసింది. ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి.

ముగిసిన పుర పోరు
కొండపల్లి 17వ వార్డులో బారులు తీరిన మహిళా ఓటర్లు

ఓట్ల లెక్కింపు, ఫలితాలు రేపు

గెలుపుపై ఇరుపక్షాల ధీమా 

పంచాయతీ ఫలితాలు పునరావృత మవుతాయనే ఆశలో టీడీపీ 

ధన బలంపైనే వైసీపీ నమ్మకం 

పోలింగ్‌ సరళిని పరిశీలించిన కలెక్టర్‌ నివాస్‌ 

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి 

జగ్గయ్యపేటలో 78.45 

కొండపల్లిలో 66.79 


జిల్లాలో పుర పోరు ముగిసింది. ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఎన్నికలు జరిగిన రెండు మునిసిపాలిటీలూ అత్యంత సమస్యాత్మకమే అయినా, జిల్లా యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అధికారంతో పాటు ధన బలాన్ని ప్రయోగించిన వైసీపీ విజయం తమదేనన్న ధీమాతో ఉండగా, పంచాయతీలు తెచ్చిపెట్టిన విజయంతో జోష్‌ మీద ఉన్న టీడీపీ ఈ రెండు మునిసిపాలిటీల్లోనూ సత్తా చాటుతామంటోంది. బుధవారం అత్యంత బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ/జగ్గయ్యపేట/ కొండపల్లి) : జిల్లాలో జగ్గయ్యపేట, కొండపల్లి మునిసిపాలిటీల ఎన్నికలు సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి. ఓటర్లు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగ్గయ్యపేటలో 62 పోలింగ్‌ కేంద్రాల్లోనూ, కొండపల్లిలో 56 పోలింగ్‌ కేంద్రాల్లోనూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు మునిసిపాలిటీల ఎన్నికలు అధికార, విపక్షాల మధ్య నువ్వా, నేనా అన్నట్టు జరిగాయి. వృద్ధులు సైతం అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొండపల్లి మునిసిపాలిటీలోని 29 వార్డుల్లో 57,543 మంది ఓటర్లకుగానూ 38,435 మంది (66.79ు), జగ్గయ్యపేట మునిసిపాలిటీలోని 31 వార్డుల్లో 42,715 మంది ఓటర్లకుగానూ 33,508 మంది (78.45ు) ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


జిల్లా యంత్రాంగం ఉరుకులు పరుగులు  

జగ్గయ్యపేట, కొండపల్లి తీవ్ర సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాలు కావటంతో జిల్లా అధికారులు, పోలీసులు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్‌, ఎన్నికల అధికారి నివాస్‌ కొండపల్లిలో ఎన్నికల తీరును పరిశీలించారు. జగ్గయ్యపేటలోని పలు పోలింగ్‌ కేంద్రాలను విజయవాడ సబ్‌ కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌ చంద్‌ సందర్శించారు. ఆయా కేంద్రాల్లో పోలింగ్‌ సరళిని ఆయన పరిశీలించారు. వివాదాలకు అవకాశం లేకుండా వ్యవహరించాలని ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. 


ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్‌

జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న జగ్గయ్యపేట, కొండపల్లి మునిసిపాలిటీల ఎన్నికల సరళిని కలెక్టర్‌ నివాస్‌ ఉదయం నుంచి పరిశీలించారు. కొండపల్లి మునిసిపాలిటీలో పోలింగ్‌ సరళిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, అనంతరం వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా క్యాంప్‌ కార్యాలయం నుంచి పోలింగ్‌ తీరు తెన్నులను తెలుసుకున్నారు. వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల్లో సమస్యలను గుర్తించి, తక్షణం వాటిని సరిదిద్దేందుకు ఆదేశాలు ఇచ్చారు.



Updated Date - 2021-11-16T06:49:57+05:30 IST