కాకినాడ,మార్చి1(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక ఎన్నికలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో గత నెల 15న ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కలెక్టర్, ఎస్పీ, పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ఆయనకు వివరించారు. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న మునిసిపాల్టీలు, నగర పంచాయతీల వివరాలను వెల్లడించారు. నియమావళి పటిష్టంగా అమలు చేయడానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. స్థానిక పోలీస్ అధికారుల సహకారంతో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎస్‌ఈసీ కలెక్టర్‌కు సూచించారు. కలెక్టరేట్ కోర్టు హాల్ నుంచి వర్చువల్‌లో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికలపై వారి అభిప్రాయాలను వివరించారు. కలెక్టరేట్ నుంచి జేసీలు లక్ష్మీశ, సీహెచ్ కీర్తి, కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్, అమలాపురం సబ్ కలెక్టర్ కౌశిక్, జిల్లా అదనపు ఎస్పీ కరణం కుమార్, మునిసిపల్ ఎన్నికల నోడల్ అధికారి, కాకినాడ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, మెప్మా పీడీ కె.శ్రీరమణి పాల్గొన్నారు.