పేరుకేనా ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌’!

ABN , First Publish Date - 2021-04-23T11:03:25+05:30 IST

‘కరోనాపై సమరంలో మీదే కీలకపాత్ర, మీరే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌’ అంటూ ఉబ్బేయడమే తప్ప, ప్రాణాలకు తెగించి తాము అందిస్తున్న సేవలను గుర్తించడం లేదని రాష్ట్రంలోని పురపాలక శాఖ ఉద్యోగులు

పేరుకేనా ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌’!

ప్రాణాలు కోల్పోయినా ఎక్స్‌గ్రేషియా అందట్లేదు

కొవిడ్‌ సెంటర్లలో ఖర్చులకూ కొర్రీలు

మున్సిపల్‌ ఉద్యోగులకు ‘కరోనా’ వెతలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘కరోనాపై సమరంలో మీదే కీలకపాత్ర, మీరే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌’ అంటూ ఉబ్బేయడమే తప్ప, ప్రాణాలకు తెగించి తాము అందిస్తున్న సేవలను గుర్తించడం లేదని రాష్ట్రంలోని పురపాలక శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. సుమారు 14 నెలలుగా  తామందరం ఎవరి స్థాయిలో వారు సేవలందిండం వల్లనే కరోనా క్లిష్ట సమయంలో పట్టణ ప్రజలు ఈమాత్రమైనా భరోసాగా ఉండగలుగుతున్నారని చెబుతున్నారు. అయితే ఆ క్రమంలో తాము ఎదుర్కొంటున్న కష్టనష్టాలను, ఆఖరికి ప్రాణాపాయాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కేవలం వ్యాక్సినేషనే తప్ప ప్రత్యేక అలవెన్సులు ఇవ్వనప్పటికీ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలొడ్డి కోవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని, కొవిడ్‌ సెంటర్లలోనూ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణా లు కోల్పోగా, మున్సిపల్‌ ఉద్యోగుల్లో ఎందరికో కరోనా సోకిందని చెబుతున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంగానీ, పురపాలక శాఖ ఉన్నతాధికారులుగానీ ప్రకటనలతోనే కాలం వెళ్లబుచ్చుతూ, తమ సంక్షేమాన్ని, భద్రతను పూర్తిగా విస్మరిస్తున్నారని విమర్శిస్తున్నారు. 


జాడ లేని ప్రత్యేక అలవెన్స్‌లు..

కరోనా కట్టడిలో అలుపెరగకుండా సేవలందిస్తున్న మున్సిపల్‌ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికుల భద్రత, క్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటామని, అవసరమైన సకల రక్షణ పరికరాలు సమకూర్చడంతోపాటు ప్రత్యేక భృతి ఇస్తామని, విధినిర్వహణలో భాగంగా ఎవరన్నా ప్రాణాలు కోల్పోతే ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు వివిధ సందర్భాల్లో ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. అయినా.. అత్యావశ్యకమైన రక్షణ సామగ్రిని సైతం అరకొరగా అందజేయడమే కాకుండా,  విధినిర్వహణలో అశువులుబాసిన పారిశుధ్య కార్మికులకు ఇంతవరకూ ఎక్స్‌గ్రేషియా ఇచ్చిన దాఖలాల్లేవు! బహిరంగ ప్రదేశాలు, కొవిడ్‌ కేంద్రాల్లో సేవలందించే క్షేత్రస్థాయి సిబ్బందికిగానీ, వారిని పర్యవేక్షించే మున్సిపల్‌ ఉద్యోగులకుగానీ ప్రత్యేక అలవెన్సులు ఇవ్వడం లేదు. 


కొవిడ్‌ బాధితుల చికిత్సకు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల నిర్వహణ కూడా పురపాలక ఉద్యోగులకు చుక్కలు చూపుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల అజమాయిషీలో నడుస్తున్న ఈ సెంటర్లకు అవసరమైన సదుపాయాలన్నింటినీ ఈ శాఖే కల్పిస్తోంది. ముందు మీరు ఏర్పాటు చేయండి.. తర్వాత బిల్లులిస్తామంటున్న ఆయా శాఖలు.. అలా సమకూర్చిన సామగ్రికి ఆ తర్వాత మున్సిపల్‌ ఉద్యోగులు బిల్లులు సమర్పిస్తే కొర్రీలపై కొర్రీలు వేస్తూ తిప్పుకుంటున్నాయి, తప్పితే నిధులను మాత్రం ఇవ్వడం లేదు. దీనిపై గట్టిగా ప్రశ్నిద్దామనుకున్నా,  జిల్లా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఎక్కడ ఆగ్రహిస్తారోనన్న భయంతో మున్సిపల్‌ ఉద్యోగులు నోరు మెదపలేకపోతున్నారు.  ఆయా బిల్లులు సత్వరమే మంజూరయ్యేలా చూడాలన్న వీరి అభ్యర్థనను ఎవరూ పట్టించుకోవడం లేదు. 

Updated Date - 2021-04-23T11:03:25+05:30 IST