పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి

ABN , First Publish Date - 2021-07-27T06:29:45+05:30 IST

పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలని బీసీ సంక్షేమశాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సూచించారు.

పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి

రామచంద్రపురం, జులై 26: పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలని బీసీ సంక్షేమశాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సూచించారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం సోమవారం మున్సిపల్‌ కౌన్సిల్‌హాల్‌లో చైర్‌పర్సన్‌ గాధంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. మున్సిపల్‌ ఎక్స్‌అఫిషియో మెంబర్‌గా మంత్రి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్యం, డ్రైన్లపై ప్రతి కౌన్సిల్‌ సభ్యులు దృష్టి సారించాలని, ప్రధాన రోడ్లలో డ్రైన్లకు మ్యాన్‌హోల్స్‌ నిర్మించాలని, మురుగునీరు పారుదల సక్రమంగా జరిగేటట్టు చూడాలని కోరారు. గుబ్బలవారిపేటకు ఆనుకుని ఉన్న మేకల కబేళాలో మేకల ఆరోగ్య పరిస్థితిని పశువైద్యాధికారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌తోనూ తనిఖీ చేయించి స్టాంప్‌ వేసిన తరువాతే మాంసం దుకాణాలకు తరలించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక శివాలయం వీధిలో 0.25సెంట్ల భూమిని రైతు బజారుకు కేటాయిస్తూ కౌన్సిల్‌ తీర్మానించింది. రైతు బజారు అభివృద్ధికి రూ.80లక్షల నిధులు మార్కెటింగ్‌ శాఖ నుంచి మంజూరైనట్టు మంత్రి తెలిపారు. త్వరలో ప్రతి ఇంటికీ 3 చెత్త బుట్టలను సరఫరా చేస్తారని, తడి, పొడి  చెత్తలుగా విభజించి వాటిలో వేయాలని చైర్‌పర్సన్‌ తెలిపారు. రూ.2కోట్ల అభివృద్ధి  పనుల కోసం రాష్ట్ర పురపాలక సంఘ సంచాలకుని అనుమతి కోరుతూ లేఖ రాసేందుకు కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. 

Updated Date - 2021-07-27T06:29:45+05:30 IST