విద్యాశాఖ పరిధిలోకి మున్సిపల్‌ స్కూళ్లు

ABN , First Publish Date - 2022-06-25T19:29:11+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ పాఠశాలల పరిపాలనా బాధ్యతలను విద్యాశాఖకు అప్పగిస్తూ మున్సిపల్‌ పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది..

విద్యాశాఖ పరిధిలోకి మున్సిపల్‌ స్కూళ్లు

జీవో జారీ.. పనితీరు మెరుగుకోసమేనన్న సర్కారు.. 

ఎవరిని సంప్రదించారంటున్న సంఘాలు


అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ పాఠశాలల పరిపాలనా బాధ్యతలను విద్యాశాఖకు అప్పగిస్తూ మున్సిపల్‌ పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌ పాఠశాలల్లో పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న 2,114 మున్సిపల్‌ పాఠశాలలు ఇక నుంచి విద్యాశాఖ పరిధిలోకి రానున్నాయి. ఈ పాఠశాలల్లో 345 ఉన్నత, 149 ప్రాథమికోన్నత, 1,620 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ పాఠశాలలతో సమానంగా మునిసిపల్‌ పాఠశాలల్లో సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థ లేదు. శాశ్వత ప్రాతిపదికన మున్సిపల్‌ పాఠశాలల్లో అకడమిక్‌ కార్యకలాపాలను పర్యవేక్షించే ప్రత్యేక అధికారుల కొరత కూడా ఉంది. దీంతో మున్సిపల్‌ పాఠశాలల్లో విద్యా పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. జడ్పీ, ఎంపీపీ పాఠశాలల విషయంలో పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల పరిపాలన నియంత్రణను పాఠశాల విద్యాశాఖకు బదిలీ చేసింది. ఇప్పుడు మునిసిపల్‌ స్కూళ్ల వ్యవహారాన్ని విద్యాశాఖకు అప్పగించారు. 


సిబ్బంది కొరత తీరేనా?

సిబ్బంది పరంగా చూస్తే మునిసిపల్‌ స్కూళ్లలో 302 హెడ్మాస్టర్లు, 236 ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెడ్మాస్టర్లు, 5,379 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీగ్రేడ్‌ టీచర్లు 8031 కలిపి మొత్తం 12,006 మంది పనిచేస్తున్నారు. 1,942 పోస్టులు ఖాళీలున్నాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు ఒక యూనిట్‌గా తీసుకుని ఆర్‌డీఎంఏ అపాయింటింగ్‌ అథారిటీ ఇచ్చారు. అదేవిధంగా ఆయా జిల్లాల్లోని కార్పొరేషన్లు అన్నింటినీ ఒక యూనిట్‌గా తీసుకుని అపాయింటింగ్‌ అథారిటీ ఆర్‌డీఎంఏకు ఇచ్చారు. జీవీఎంసీ స్థాయిలో స్టాండింగ్‌ కమిటీని నియమించారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఎడ్యుకేషనల్‌ సబార్డినేట్‌ సర్వీ్‌సరూల్స్‌ను రూపొందించారు. మున్సిపల్‌ టీచర్లందరూ ఇతర మేనేజ్‌మెంట్ల మాదిరిగానే 010 హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ కింద జీతాలు తీసుకుంటున్నారు. 11 మున్సిపల్‌ కార్పొరేషన్లలో మున్సిపల్‌ పాఠశాలల పర్యవేక్షణ కోసం ఎడ్యుకేషన్‌ పోస్టులు మంజూరయ్యాయి. తాత్కాలిక ప్రాతిపదికన పట్టణ స్థానిక సంస్థల్లో సీనియర్‌ హెడ్మాస్టర్లతో ఈ పోస్టులు భర్తీ చేశారు. అయితే, పర్యవేక్షణకు పోస్టులు మంజూరు చేయనందున తాత్కాలిక ప్రాతిపదికన మున్సిపాలిటీల్లో విద్యా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సీనియర్‌ ఉపాధ్యాయులను నియమించారు.


టీచర్లకు ప్రయోజనం

పాఠశాల విద్యాశాఖ జడ్పీ కోసం ప్రత్యేక సేవా నిబంధనలను అమలు చేస్తోంది. మున్సిపల్‌ పాఠశాలలను విద్యాశాఖ పర్యవేక్షణ కిందకు తీసుకురావడం ద్వారా జడ్పీ, ఎంపీపీ, ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు అందిస్తున్న ప్రయోజనాలన్నీ మున్సిపల్‌ ఉపాధ్యాయులకు కూడా వర్తింపచేస్తారు. ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే మున్సిపల్‌ ఉపాధ్యాయులకు ఇది ఎంతో ప్రయోజనకరమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం మున్సిపల్‌ ఉపాధ్యాయుల పర్యవేక్షణ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు బదులుగా పాఠశాల విద్యాశాఖ నియంత్రణలో ఉంటుంది. మున్సిపల్‌ పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అప్పటివరకు పట్టణ స్థానికసంస్థల్లో ప్రస్తుత బోధనేతర సిబ్బందిని కొనసాగించాలని, మున్సిపల్‌ పాఠశాలల కంటింజెంట్‌ సిబ్బంది(స్వీపర్లు మొదలైన వారు)ని పాఠశాల విద్యాశాఖ స్వాధీనం చేసుకుంటుందని పేర్కొన్నారు. మున్సిపల్‌ పాఠశాలల యాజమాన్యం మున్సిపల్‌ కౌన్సిల్‌లో కొనసాగుతుంది. 


వ్యతిరేకిస్తున్నాం: టీచర్ల సంఘం

మున్సిపల్‌ పాఠశాలల పర్యవేక్షణ పట్టణ స్థానికసంస్థల పర్యవేక్షణలోనే ఉండాలని, ఒక్క టీచర్‌ను కూడా సంప్రదించకుండా ప్రభుత్వం ఈ పాఠశాలలను విద్యాశాఖకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నామని మున్సిపల్‌ టీచర్ల అసోషియేషన్‌ అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. పురపాలక పాఠశాలలను జడ్పీ స్కూళ్లలో కలపాలనే కుట్ర దాగి ఉందన్నారు.  ఎంఈవోలకు కాకుండా స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్మాస్టర్లకు డీడీవో అధికారాలివ్వాలని కోరారు. పురపాలక విద్యా సంచాలకుల కార్యాలయం ఏర్పాటు చేసి, దాన్ని విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-06-25T19:29:11+05:30 IST