మున్సిపల్‌ కార్మికులు సమ్మెకు సిద్ధం

ABN , First Publish Date - 2022-01-23T04:54:59+05:30 IST

Municipal workers prepare for strike

మున్సిపల్‌ కార్మికులు సమ్మెకు సిద్ధం
మున్సిపల్‌ కమిషనర్‌కు సమ్మె నోటీసులు అందజేస్తున్న దృశ్యం

 ఫిబ్రవరి 14 నుంచి సమ్మె చేయనున్నట్లు కార్మికుల వెల్లడి  ఆ మేరకు కమిషనర్‌కు నోటీసు అందజేత

బద్వేలు, జనవరి 22 : మున్సిపల్‌  కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి సమ్మె బాటపడుతున్నారు. ఫిబ్రవరి 14 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డికి శనివారం మున్సిపల్‌ కార్మికులు  నోటీసులు ఇచ్చారు.  కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 07ను  రద్దు చేయాలని జీవో 1615ను అమలు చేయాలని  మున్సిపల్‌ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.నాగేంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఆమేరకు శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్‌  సిబ్బందికి  వేతనాలు పెంచుతూ జారీ చేసిన జీవో తక్షణమే రద్దుచేయాలని మున్సిపల్‌ రంగంలో పనిచేస్తున్న 42వేల మంది కార్మికులకు 11వ పీఆర్‌సీని జీవో 1615 ప్రకారం వేతనాలు, కరువు భత్యం, మధ్యంతర భృతి అమలు చేయాలని  డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్స్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని సమానపనికి సమాన వేతనం అమలు చేస్తామని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్మికులకు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. గతంలో ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు జీతాలు పెరిగితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం 25 శాతం కనీస వేతనం రూ.12వేల నుంచి 15వేల వరకు పెంచుతూ జీవో 07ను జారీ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు.  గతంలో  ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన విధంగా 27 శాతం మద్యంతర భృతి, కరువు భత్యం, ఇంటి అద్దెలు తదితరాలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రప్రభుత్వ వేతన సిఫార్సులు కాకుండా పాతపద్ధతిలోనే పీఆర్‌సి అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు శ్రీనివాసులు, హరి, శివకుమార్‌, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T04:54:59+05:30 IST