మున్సిపాలిటీలు..200 ఖాళీలు

ABN , First Publish Date - 2020-08-08T10:22:47+05:30 IST

మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం శ్రద్ధ చూపడం లేదు

మున్సిపాలిటీలు..200 ఖాళీలు

బల్దియాల్లో సిబ్బంది కొరత

సంగారెడ్డి మున్సిపాలిటీలో 60 పోస్టులు ఖాళీ

బొల్లారంలో అందరూ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే 

పోస్టుల ఖాళీలతో ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి


సంగారెడ్ది టౌన్‌, ఆగస్టు 7 : మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం శ్రద్ధ చూపడం లేదు. పురపాలికల్లో ఏళ్ల తరబడి పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఉన్న కొద్ది మంది సిబ్బందిపై పని ఒత్తిడి తీవ్రంగా ఉంటున్నది. రెండేళ్ల క్రితం మున్సిపాలిటీల్లో శివారు గ్రామాలు విలీనం కావడంతో సరిపడా సిబ్బంది లేక పౌరసేవలు సక్రమంగా అందడం లేదు. త్వరలో ఖాళీలను భర్తీ చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఏడాది క్రితం ప్రకటించినప్పటికీ ఆ దిశగా ముందుకు సాగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


ఇంకెప్పుడు భర్తీ చేస్తారు ?

జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో 465 రెగ్యులర్‌ పోస్టులకుగాను 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి గ్రేడ్‌ వన్‌ మున్సిపాలిటీలో ఏడు నెలల వ్యవధిలోనే ముగ్గురు కమిషనర్లు బదిలీ అయ్యారు. ప్రస్తుతం సంగారెడ్డి, నారాయణఖేడ్‌ పురపాలికల్లో ఇన్‌చార్జి కమిషనర్లతోనే నెట్టుకొస్తున్నారు.  సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోల్‌-జోగిపేట, అమీన్‌పూర్‌, తెల్లాపూర్‌, ఐడీఎ బొల్లారం మున్సిపాలిటీల్లో 465 పోస్టులకుగాను 200 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సంగారెడ్డి గ్రేడ్‌వన్‌లో 121 రెగ్యులర్‌ పోస్టులకుగాను 61 మంది మాత్రమే పని చేస్తుండగా 60 ఖాళీలున్నాయి. అక్కడా రెగ్యులర్‌ కమిషనర్‌ లేకపోవడంతో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షిషా ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో 49 మంది పబ్లిక్‌ హెల్త్‌ ఉద్యోగాలకు 25 మంది మాత్రమే ఉన్నారు. 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధాన శాఖలైన టౌన్‌ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, పారిశుధ్య విభాగాల్లో చాలా ఖాళీలున్నాయి. ఈ మున్సిపాలిటీలో నలుగురు టీపీబీవోలకు ఇద్దరు మాత్రమే ఉన్నారు.


ఇద్దరు టీపీఎ్‌సలకు ఒక్కరు కూడా లేకపోవడంతో ఒక టీపీవో, ఇద్దరు టీపీబీవోలతోనే నెట్టుకొస్తున్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో ముగ్గురు ఏఈలకు గాను ఒక్కరే ఉండడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. ఇక్కడ ముఖ్యంగా రెండు వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు, మూడు సీనియర్‌ అసిస్టెంట్‌, ఒక జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టుతో పాటు 60 ఖాళీలున్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఖాళీలను భర్తీ చేయాలని పాలకవర్గ సభ్యులు పలుసార్లు డీఎంఏకు ప్రతిపాదనలు పంపినా ఫలితం దక్కడం లేదు. సదాశివపేటలో 75 పోస్టులకు 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ 32 పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్లకుగాను 18 మంది ఉండగా, 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు రెండు శానిటరీ జవాన్‌, ఒక్కొక్కటి చొప్పున టీపీబీవో, సీనియర్‌ అకౌంట్‌ అధికారి, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జహీరాబాద్‌లో 45 రెగ్యులర్‌ పోస్టులకు 30 ఖాళీగా ఉన్నాయి.


ఇక్కడ 15 మంది సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. అందోల్‌-జోగిపేట బల్దియాలో 60 రెగ్యులర్‌ పోస్టులకుగాను కేవలం నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 66 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడ 56 రెగ్యులర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెల్లాపూర్‌ మున్సిపాలిటీలో 126 పోస్టులకు 116 మంది విధులు నిర్వహిస్తుండగా 10 ఖాళీలున్నాయి. అమీన్‌పూర్‌లో 13 రెగ్యులర్‌ పోస్టులకు 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, టీపీవో, టీపీబీవో, టీపీఎస్‌, హెల్త్‌ వర్కర్లతో పాటు నాలుగు బిల్‌ కలెక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నారాయణఖేడ్‌ బల్దియాలో కమిషనర్‌, మేనేజర్‌ పోస్టులతో పాటు పది రెగ్యులర్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ ఇన్‌చార్జి కమిషనర్‌గా శ్రీనివాస్‌ కొనసాగుతుండగా 70 మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ఐడీఏ బొల్లారంలో మేనేజర్‌ పోస్టుతో పాటు 15 రెగ్యులర్‌ పోస్టులకు ఒక్కరు కూడా రెగ్యులర్‌ ఉద్యోగి లేరు. కమిషనర్‌ ఒక్కరే రెగ్యులర్‌ కాగా మిగతా 80 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే. ఇప్పటికైనా మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించి, పారదర్శకంగా పౌరసేవలు అందించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2020-08-08T10:22:47+05:30 IST