
కోలీవుడ్: ఇండస్ట్రీలో చిన్న, పెద్ద చిత్రాలు అనే తేడా ఉండదని, సినీ ఇండస్ట్రీని బతికించేది చిన్న చిత్రాలేనని ప్రముఖ సీనియర్ దర్శకుడు వి.శేఖర్ అన్నారు. ఒక యేడాదిలో పెద్ద చిత్రాలు 20కి మించి విడుదల కావని, కానీ చిన్న చిత్రాలు వందకు పైగా విడుదలవుతాయని గుర్తుచేశారు. అలాగే, పెద్ద చిత్రాలకు ఎక్కువ మంది టెక్నీషియన్లు.. చిన్న చిత్రాలకు తక్కువ మంది పని చేస్తారు.. కానీ ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందన్నారు. శ్రీ థిల్లై ఈసాన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత రాము ముత్తుసెల్వన్ నిర్మించిన చిత్రం ‘మున్నా’. కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు, పాటలు సమకూర్చి దర్శకత్వం వహిస్తూనే సంగై కుమరేశన్ హీరోగా నటించారు. ఈయన సరసన నియా కృష్ణా హీరోయిన్గా నటించగా, రమ్య, రాజు, సింధు, రాజామణి, షణ్ముగం, వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ శుక్రవారం రాత్రి చెన్నై నగరంలో జరిగింది. ఇందులో దర్శకులు వి.శేఖర్, రమేష్ సెల్వన్, ఆర్.వి.ఉదయకుమార్, నటుడు విఘ్నేష్, ఫ్యాప్సీ శివ, మాన్సూర్ అలీఖాన్, స్టంట్ మాస్టర్ జాక్వుర్ తంగంతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు వి.శేఖర్ మాట్లాడుతూ.. ఒక సినిమా విజయానికి మంచి కథతో పాటు దర్శకుడు ఎంతో అవసరమన్నారు. ఒక చిత్రం నిర్మాణ సమయంలో అనేక మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఆ ప్రకారంగా చూస్తే ఒక నిర్మాత తన చిత్రం విడుదలకు ముందే అనేక మందిని పోషిస్తున్నారని చెప్పారు. ఈ చిన్న సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని నిర్మాతకు లాభాల పంట కురిపించాలన్నారు. సినిమాను బతికించేది చిన్న చిత్రాలే అని.. అవి ఎంత ఎక్కువగా చిత్రీకరణ జరుపుకుంటే అంత ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు.
అనంతరం దర్శకుడు ఆర్వీ.ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. నిజాయితీగా ఒక చిత్రాన్ని నిర్మిస్తే అది ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. ఫ్యాఫ్సీ శివ మాట్లాడుతూ, కరోనా కష్టకాలం తర్వాత మళ్ళీ సినిమా పరిశ్రమకు పునరుజ్జీవం వచ్చిందన్నారు. దీనికి మాస్టర్ చిత్రమే కారణమన్నారు. అలాగే, ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని, ఈ చిత్రంలో నటించిన వారందరికీ మంచిపేరు రావాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.