munugode by poll: ఉప ఎన్నికల నిర్వహణ ఖర్చు ప్రజలు భరించాలా?

ABN , First Publish Date - 2022-08-23T00:48:22+05:30 IST

హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఆ పార్టీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు

munugode by poll: ఉప ఎన్నికల నిర్వహణ ఖర్చు ప్రజలు భరించాలా?

హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఆ పార్టీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు స్వయంగా ఓ బహిరంగసభలో పాల్గొని ప్రచారాన్ని ఉధృతం చేశారు. మరుసటి రోజే కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 


సాధారణంగా ఆయా అభ్యర్థులు మరణించినప్పుడు ఉప ఎన్నికలు సహజమే. కానీ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వ్యక్తిగత, రాజకీయ కారణాలతో రాజీనామా చేసి పార్టీ మారి ఉప ఎన్నికలకు వెళ్తుండటం కొంత కాలంగా గమనిస్తున్నాం. గతంలో ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలు రాజకీయ కారణాలు చెప్పి మరీ ఉప ఎన్నికలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత ఏడాది ఈటల రాజేందర్ వ్యక్తిగత, రాజకీయ కారణాలతో టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. 20 వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గెలుపోటముల పరిస్థితి ఎలా ఉన్నా వ్యక్తిగత, రాజకీయ కారణాలతో ఉప ఎన్నికలకు వెళ్తున్న అభ్యర్ధులు ఎన్నికల నిర్వహణ ఖర్చు భారం మాత్రం ప్రజలపై పడేస్తున్నారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఖర్చు కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. ఇదే పార్లమెంట్ నియోజకవర్గానికైతే ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుంది. కోట్ల రూపాయల ఎన్నికల నిర్వహణ ఖర్చును ప్రజలపై పడేయడాన్ని పలువురు మేధావులు, ప్రజాస్వామ్య ప్రియులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలపై ఈ రకమైన భారాన్ని వేయడాన్ని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ తప్పుబడుతున్నారు.    


వ్యక్తిగత, రాజకీయ కారణాలతో రాజీనామాలు చేసే అభ్యర్థులు ఉప ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చును వారే స్వయంగా భరించాడం కానీ లేదంటే వారిని బలపరిచే పార్టీ భరించాలని మేధావులు సూచిస్తున్నారు. అభ్యర్ధులు మరణించినప్పుడు జరిగే ఉప ఎన్నికల నిర్వహణకు ఖర్చును ఎలాగూ ప్రజలే భరిస్తున్నారని, వ్యక్తిగత, రాజకీయ కారణాలతో రాజీనామాలతో వచ్చే ఉప ఎన్నికల నిర్వహణ ఖర్చును కూడా ప్రజలే భరించాలనడం అన్యాయమని మేధావులంటున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషించాలని, చట్టంలో సంస్కరణలు తీసుకురావాలని ప్రజాస్వామ్యప్రియులు సూచిస్తున్నారు. 


సాధారణంగా చట్టంలో మార్పులనేవి పార్లమెంట్ ద్వారా జరగాల్సిందే. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో రాజీనామాలు చేసే అభ్యర్థులు ఉప ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చును వారే స్వయంగా భరించడం లేదా వారిని బలపరుస్తున్న పార్టీలు భరించడం అనే విషయంలో సంస్కరణలు తీసుకురావాలంటే ఎన్నికల సంఘం కేంద్రానికి నివేదించాలి. అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ప్రజాస్వామ్యప్రియులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రప్రభుత్వానికి నివేదించడంతో పాటు సంస్కరణలపై ఆయా రాజకీయ పార్టీల నేతలతో చర్చలు కూడా జరపాలి. అన్ని రాజకీయ పార్టీల నేతలపై ఒత్తిడి తీసుకువచ్చి సంస్కరణలు చేపట్టాలని, ఎన్నికల సంఘానికి తాము మద్దతుగా ఉంటామని మేధావులంటున్నారు. సంస్కరణలు తీసుకురానంత కాలం ఇలాంటి ఉప ఎన్నికల ఖర్చు భారం ప్రజలపైనే పడుతుందని, ప్రజాధనం వృధా అవుతుందని సూచిస్తున్నారు. 


ప్రజాధనాన్ని ఎవరూ కొల్లగొట్టకుండా ఖజానాకు కాపలాదారుగా ఉంటామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎన్నికల సంస్కరణల విషయంలో చొరవ చూపి ప్రజాధనం లూటీకాకుండా కాపాడటంలో తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి. 

                                             - ఆరెపాటి వెంకట నారాయణ రావు. 





Updated Date - 2022-08-23T00:48:22+05:30 IST