Munugode By-election: మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్‌ఎస్‌ అంతర్గత సమావేశం

ABN , First Publish Date - 2022-08-27T02:28:21+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక (Munugode By-election)లో ఓటింగ్‌ను ప్రభావితం చేసే సమస్యల పరిష్కారంపై అధికార పార్టీ దృష్టి సారించింది.

Munugode By-election: మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్‌ఎస్‌ అంతర్గత సమావేశం

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక (Munugode By-election)లో ఓటింగ్‌ను ప్రభావితం చేసే సమస్యల పరిష్కారంపై అధికార పార్టీ దృష్టి సారించింది. నల్లగొండ జిల్లా పరిధిలోని మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం చండూరులో టీఆర్‌ఎస్‌ (TRS) పార్టీ అంతర్గత సమావేశాన్ని నిర్వహించింది. మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (Kusukuntla Prabhakar Reddy)తో కలిసి నిర్వహించిన సమావేశానికి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ మినహా అందరూ హాజరయ్యారు. సమావేశానికి టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కోటిరెడ్డి కూడా పాల్గొన్నారు. 


ఈ సమావేశంలో మునుగోడు ఎన్నికల్లో ఓటింగ్‌ను ప్రభావితం చేసే పలు అంశాలపై చర్చించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో సమస్యల పరిష్కారానికి ఏవిధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపై దృష్టిసారించడంతో పాటు మంత్రి జగదీ్‌షరెడ్డి ఆర్‌అండ్‌బీ రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అప్పటికప్పుడు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రామాల్లో పర్యటించిన సమయంలో ప్రజలు ఏఏ సమస్యలు వారి దృష్టికి తీసుకువచ్చారు? అవి పరిష్కార యోగ్యంగా ఉన్నాయా? అని పరిశీలించడంతో పాటు నియోజకవర్గంలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా సమావేశంలో చర్చ సాగినట్లు తెలుస్తోంది. ఇటీవల మునుగోడులో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు అనుకున్న విధంగా భారీ జనసమీకరణ జరగడం, ఆ సభ విజయవంతం కావడంతో అందుకు వారం రోజుల ముందు నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రామాలను పంచుకుని కష్టపడిన విషయాన్ని కూడా చర్చించినట్లు తెలిసింది. 

Updated Date - 2022-08-27T02:28:21+05:30 IST