Munugode bypoll: మునుగోడు పోలింగ్ హిస్టరీ ఇది.. ఎవరెవరు ఎన్నిసార్లు గెలిచారో తెలుసా..!

ABN , First Publish Date - 2022-10-04T03:00:37+05:30 IST

మునుగోడు (Munugode) నియోజకవర్గ ఉప పోరుకు నగారా మోగింది. అంతా ఊహించినట్టే నవంబరు (November)లో ఉప ఎన్నిక

Munugode bypoll: మునుగోడు పోలింగ్ హిస్టరీ ఇది.. ఎవరెవరు ఎన్నిసార్లు గెలిచారో తెలుసా..!

నల్లగొండ: మునుగోడు (Munugode) నియోజకవర్గ ఉప పోరుకు నగారా మోగింది. అంతా ఊహించినట్టే నవంబరు (November)లో ఉప ఎన్నిక (bypoll) జరగనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ అధికారికంగా సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సరిగ్గా నెల రోజుల్లో ఉప ఎన్నిక తంతు ముగియనుంది. దసరా పండుగ తర్వాత నోటిఫికేషన్‌ వస్తుందని నేతలంతా భావించగా, అంచనాలకు భిన్నంగా విజయదశమి పండుగకు సరిగ్గా రెండు రోజుల ముందు నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో ప్రధాన పార్టీల నేతలంతా అప్రమత్తమయ్యారు. మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ (TRS) తరుఫున అన్నీ తానై నాయకత్వం వహిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటాపోటీగా మాటల దాడి మొదలుపెట్టారు. 


నియోజకవర్గ భౌగోళిక స్వరూపం ఇదీ... 

మునుగోడు నియోజకవర్గం నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీల పరిధిలో విస్తరించి ఉంది. మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాలు నల్లగొండ జిల్లా పరిధిలోకి వస్తుండగా, చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం మండలాలు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వస్తున్నాయి. నల్లగొండ జిల్లాలోని చండూరు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ మునిసిపాలిటీగా ఉన్నాయి. మునుగోడు పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం కాగా మొత్తం 2,27,265 ఓట్లు ఉన్నాయి. ఇందులో కేవలం 32,407ఓట్లు మాత్రమే చౌటుప్పల్‌, చండూరు మునిసిపాలిటీల పరిధిలో ఉన్నాయి. 


1967లో నియోజకవర్గం ఏర్పాటు 

మునుగోడు నియోజకవర్గం 1967 సంవత్సరంలో ఏర్పడగా, ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు కాంగ్రెస్‌, అయిదుసార్లు సీపీఐ, ఒకసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించారు. 1967 నుంచి 1985 సంవత్సరం వరకు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పాల్వాయి గోవర్థన్‌రెడ్డి విజయం సాధించారు. 1985 నుంచి సీపీఐ అభ్యర్థి ఉజ్జిని నారాయణరావు మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. 1999లో కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి గోవర్థన్‌రెడ్డి విజయం సాధించగా, 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పల్లా వెంకట్‌రెడ్డి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో సీపీఐ నుంచి ఉజ్జిని యాదగిరిరావు పోటీ చేసి విజయం సాధించగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. 2018 సంవత్సరంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. 

Updated Date - 2022-10-04T03:00:37+05:30 IST