Munugode By-Election: మునుగోడుబాటలో నేతలు

ABN , First Publish Date - 2022-09-11T00:41:43+05:30 IST

మునుగోడు ఉపఎన్నిక (Munugode By-Election)లో కాంగ్రెస్‌ తన అభ్యర్థిని ఖరారు చేయడం, చవితి వేడుకలు ముగియడంతో

Munugode By-Election: మునుగోడుబాటలో నేతలు

నల్లగొండ: మునుగోడు ఉపఎన్నిక (Munugode By-Election)లో కాంగ్రెస్‌ తన అభ్యర్థిని ఖరారు చేయడం, చవితి వేడుకలు ముగియడంతో ప్రధాన పార్టీల నేతలు మునుగోడు బాటపడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) బీజేపీలో చేరి నెలరోజులు అవుతున్నా, ఆ పార్టీ నేతలతో సమన్వయం లేకుండాపోయింది. బీజేపీలో తనకున్న ముగ్గురు, నలుగురు బిగ్‌ షాట్స్‌తోనే ఆయన ఇంతకాలం ప్రచారం చేస్తున్నారు. పార్టీ నేతలు రాజగోపాల్‌రెడ్డితో ఫోన్‌లోనే సంప్రదింపులు చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయికి చేరుకోలేదు. ఈ అగాధాన్ని పూడ్చాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) నిర్ణయించి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సంగ్రామ యాత్ర రాష్ట్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీ ప్రదీప్‌కుమార్‌ను శుక్రవారం మునుగోడుకు పంపారు. ఈ ఇరువురితోపాటు చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీ వివేక్‌, తాజా మాజీ ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జీ సంజయ్‌బన్సల్‌ ఆదివారం మునుగోడుకు రానున్నారు. బన్సల్‌ పర్యటన ఏర్పాట్లతోపాటు, కమిటీల ఏర్పాటు పాత, కొత్త నేతల మధ్య సమన్వయానికి సంబంధించి మర్రిగూడలో కీలకనేతల భేటీలో చర్చ సాగినట్టు తెలిసింది.


మునుగోడు నియోజకవర్గానికి చెందిన కీలక నేతలతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా కోర్‌కమిటీ నేతలతో ఆదివారం మునుగోడు మండలకేంద్రంలో సమావేశం నిర్వహించనున్నారు. ఉపఎన్నికకు కార్యకర్తలు, నేతలను సన్నద్ధం చేయడమే బన్సల్‌ పర్యటన ఉద్దేశం. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సమావేశం జరగనుంది. భోజన విరామం అనంతరం నియోజకవర్గంలోని ఆరు మండలాలకు, ప్రతీ మండలానికి తొమ్మిది మందితో పాత, కొత్త నేతలతో కలిపి కమిటీలు ఖరారు చేయనున్నారు. బన్సల్‌ పర్యటన తదుపరి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌తో జరగనున్న సమావేశంలో నియోకవర్గంలో బూత్‌ కమిటీలు, శక్తికేంద్రాలు, రాష్ట్రంలోని కీలకనేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది.

Updated Date - 2022-09-11T00:41:43+05:30 IST