Munugodu by poll: మునుగోడులో టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఎం

ABN , First Publish Date - 2022-09-01T18:17:51+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ (TRS) పార్టీకి సీపీఎం (CPM) మద్దతు ప్రకటించింది

Munugodu by poll: మునుగోడులో టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఎం

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ (TRS) పార్టీకి సీపీఎం (CPM) మద్దతు ప్రకటించింది. గురువారం ఉదయం  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni veerabhadram) మీడియాతో మాట్లాడుతూ... మునుగోడు (Munugodu by poll)లో తమకే సపోర్ట్ చేయాలని అన్ని పార్టీలు కోరాయని తెలిపారు. అయితే బీజేపీ (BJP)ని ఓడగొట్టడానికి టీఆర్ఎస్‌కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నామన్నారు. అభివృద్ది కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్ (Rajagopal reddy) చెప్పడం కేవలం సాకు మాత్రమే అని విమర్శించారు. రాజగోపాల్ ఎందుకు రాజీనామా చేశాడో అమిత్ షా (Amith shah) క్లియర్‌గా చెప్పారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా ఉండబోతోందని... దీన్ని బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా మార్చబోతున్నారని తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్ (Congress) పార్టీకి బలమున్నా మూడో స్థానానికి పోతుందని అన్నారు.


రేవంత్ (TPCC Chief revanth reddy) చాలా కష్టపడుతున్నారని..  ఆయన అధ్యక్షుడు అయ్యాక పార్టీ స్పీడ్ అయిందని చెప్పుకొచ్చారు. దేశంలో... రాష్ట్రంలో తమ ప్రధాన శత్రువు బీజేపీ అని తెలిపారు. కేసీఆర్ (Telangana CM) అప్రజాస్వామిక పద్ధతుల వల్ల కొందరు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని... అది చాల ప్రమాదమన్నారు. మునుగోడులో తమకు పట్టున్నా బీజేపీని ఓడగొట్టే శక్తి లేదని అన్నారు. మునుగోడు విషయంలో సీపీఏం లైన్‌‌కు, సీపీఐ (CPI) లైన్‌కు కొంత తేడా ఉందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్‌కు తమ మద్దతు మునుగోడు వరకే అని తేల్చిచెప్పారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి తమ మద్దతు ప్రస్తుతానికి కేవలం మునుగోడు వరకే అని వెల్లడించారు. లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను కలిసిపోదామన్న కేసీఆర్ (KCR) ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. ఎన్నికల తర్వాత కూటమి కట్టడం ప్రాక్టికల్‌గా సాధ్యమవుతుంది తప్పా ఇప్పుడే కూటమి కట్టడం సరైంది కాదని సూచించారు. మునుగోడులో మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని... సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్‌ (TRS Chief)తో చర్చిస్తామని చెప్పారు. కృష్ణయ్య హత్య విషయానికి మునుగోడులో టీఆర్ఎస్ మడ్డతుకు సంబంధం లేదన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పాలని తమ్మినేని వీరభద్రం అన్నారు. 


కేసీఆర్ మమ్మల్ని వాడుకోవట్లేదు.. మేమే కేసీఆర్‌ను వాడుకుంటున్నాం..

‘‘మునుగోడు ఉప ఎన్నిక ల్లో మద్దతు కోసం కేసీఆర్ మమ్మల్ని వాడుకోవడం లేదు. మేమే కేసీఆర్‌ ను వాడుకుంటున్నాం’’ అని తమ్మినేని అన్నారు. మునుగోడులో బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంటే వాళ్ళకే మద్దతిచ్చేవాళ్ళమని తెలిపారు. బీజేపీని ఓడించడానికే టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘‘రేపు కూడా కేసీఆర్ మమ్మల్ని తోక పార్టీ అని విమర్శించవచ్చు... కేసీఆర్ మమ్మల్ని ప్రేమిస్తున్నాడని అనుకోవడం లేదు’’ అని అన్నారు. బీజేపీతో కేసీఆర్ ఒకరోజు మిత్రునిగా, ఒకరోజు శత్రువుగా ఉంటారన్నారు.  బీజేపీతో శాశ్వత శతృత్వం తమదే అని తెలిపారు. ‘‘మా మద్దతు కేవలం మునుగోడు వరకే’’ అని తమ్మినేని వీరభద్రం (CPM Leader) స్పష్టం చేశారు. 

Updated Date - 2022-09-01T18:17:51+05:30 IST