‘తానా’ జాయింట్ సెక్ర‌ట‌రీగా ముర‌ళి తాళ్లూరి

ABN , First Publish Date - 2021-06-02T19:12:27+05:30 IST

ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం(తానా) జాయింట్ సెక్ర‌ట‌రీగా ముర‌ళి తాళ్లూరి ఎన్నిక‌య్యారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో 11,277 ఓట్లు సాధించి విజ‌యం ద‌క్కించుకున్నారు.

‘తానా’ జాయింట్ సెక్ర‌ట‌రీగా ముర‌ళి తాళ్లూరి

టెక్సాస్‌: ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం(తానా) జాయింట్ సెక్ర‌ట‌రీగా ముర‌ళి తాళ్లూరి ఎన్నిక‌య్యారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో 11,277 ఓట్లు సాధించి విజ‌యం ద‌క్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన తాళ్లూరి.. ‘తానా’ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించడం ప‌ట్ల తెలంగాణ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాకు చెందిన తాళ్లూరి 1993 వరకు కారేపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చ‌దువుకున్నారు. ఖమ్మంలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఎంసీఏ పూర్తి చేసిన తర్వాత అమెరికా వెళ్లారు. అమెరికాలో టెక్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ కంపెనీ స్థాపించి, పలువురు భారతీయ తెలుగు విద్యార్థులకు ఉపాధిని క‌ల్పించారు. ఇక‌ గ‌డిచిన 20 సంవత్సరాలుగా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో స్థిరపడ్డారు. 


‘తానా’లో 2013 నుంచి 2020 వరకు వివిధ హోదాల్లో పనిచేసి మంచి గుర్తింపు పొందారు. గ‌త ఏడాది క‌రోనా స‌మ‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పేద‌ల‌కు, వ‌ల‌స కార్మికుల‌కు సేవ‌లు అందించారు. అదే స‌మ‌యంలో అమెరికాలోని తెలుగు వారికి కూడా సేవ‌లు అందించారు. త‌ద్వారా ‘తానా’లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందారు. తాజాగా తానా ఎన్నిక‌ల్లో సంయుక్త కార్యదర్శిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నిక‌ల్లో ప్రత్యర్థిపై 11,277 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ సంద‌ర్భంగా తాళ్లూరి మాట్లాడుతూ, త‌న‌పై ఉన్న విశ్వాసంతో గెలిపించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను నిబ‌ద్ధ‌త‌తో పూర్తి చేస్తాన‌ని, ‘తానా’ అభివృద్ధికి శాయశ‌క్తులా కృషి చేస్తాన‌ని అన్నారు. కాగా, ఖ‌మ్మం జిల్లాకు చెందిన ముర‌ళి తాళ్లూరి విజ‌యం ప‌ట్ల ఆయ‌న స‌హాధ్యాయులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.     


Updated Date - 2021-06-02T19:12:27+05:30 IST