సీఎంపై మురళీయాదవ్‌ వ్యాఖ్యలు సరికాదు

ABN , First Publish Date - 2022-08-10T05:49:40+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండి సీఎం కేసీఆర్‌పై, ప్రగతిభవన్‌పై నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, అలా వ్యాఖ్యలు చేయాల్సింది కాదని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు

సీఎంపై మురళీయాదవ్‌ వ్యాఖ్యలు సరికాదు
నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న మదన్‌రెడ్డి

అంతర్గత సమావేశంలో మాట్లాడాల్సింది

నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి


నర్సాపూర్‌, ఆగస్టు 9: టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండి సీఎం కేసీఆర్‌పై, ప్రగతిభవన్‌పై నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, అలా వ్యాఖ్యలు చేయాల్సింది కాదని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సారెడ్డి విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌ విషయమై స్పందించారు.  ఏదైనా సమస్య ఉంటే అంతర్గత సమావేశాల్లో, లేదంటే తమ దృష్టికి కానీ లేక మంత్రి హరీశ్‌రావు దృష్టికి తేవాల్సిందని చెప్పారు. బహిరంగంగా విలేకరుల సమావేశంలో ఆరోపణలు చేయడమే కాకుండా సీఎంపై వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఇక వెనుకబడిన వర్గాలకు, ఉద్యమకారులకు పదవుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతున్న ఆరోపణలపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమీకరణలో భాగంగా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుండొచ్చని, వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. నర్సాపూర్‌లో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పదవి ఓసీ మహిళకు వచ్చినా బీసీ మహిళకు ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయంగా ఏం జరిగినా తాను మాత్రం నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని మదన్‌రెడ్డి అన్నారు. రాజకీయంగా జరగాల్సిన పరిణామాలు జరుగుతూనే ఉంటాయని వాటిపై అంతగా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ అనుసూయఅశోక్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజు యాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ నయిమోద్దిన్‌, ఏఎంసి వైస్‌చైర్మన్‌ హబీబ్‌ఖాన్‌, పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌, జడ్పీకోఆప్షన్‌ మన్సూర్‌,  సీనియర్‌ నాయకులు అశోక్‌గౌడ్‌, శివకుమార్‌, గొర్రె వెంకట్‌రెడ్డి, జగదీష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T05:49:40+05:30 IST