వ్యాపార లావాదేవీల్లో విభేదాలు

ABN , First Publish Date - 2021-02-17T04:57:17+05:30 IST

అచుతాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

వ్యాపార లావాదేవీల్లో విభేదాలు
మృతదేహాన్ని స్వాధీనం చేసుకొనేందుకు వచ్చిన భీమవరం పోలీసులు

భీమవరంలో కిడ్నాప్‌, హత్య.. అచుతాపురంలో మృతదేహం

మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న భీమవరం పోలీసులు

భాగస్వామే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు: మృతుడి భార్య

అశ్వారావుపేట, ఫిబ్రవరి 16: అచుతాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరానికి చెందిన రుషిత ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని (రొయ్యల వ్యాపారి) రెడ్డి కోదండరామారావుదిగా(37) పోలీసులు గుర్తించారు. రామారావును భీమవరంలోనే హత్య చేసి ఈ ప్రాంతంలో మృతదేహాన్ని తెచ్చి పడేశారని గుర్తించారు. భీమవరం పోలీసులు, మృతుడి భార్య తె లిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

రామారావు విశాఖపట్టణంలో రొయ్యల ఎగుమతి వ్యాపారం చేస్తుంటాడు. రామారావుకు రొయ్యల ఎగుమతికి అవసరమయ్యే ముడి సరుకును సరఫరా చేసే పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం, దొండపూడికి చెందిన వీరాస్వామితో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతోనే వీరాస్వామికి రామారావు వ్యాపారంలో భాగస్వామ్యం కల్పించాడు. వీరితో పాడు మరో ఇద్దరు వ్యాపార భాగస్వామ్యులు ఉన్నారు. వీరాస్వామి, రామారావు మధ్య వ్యాపార లావాదేవీల విషయంలో విభేదాలు రావడంతో మూడేళ్ల నుంచి వీరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల క్రితమే వీరాస్వామి నుంచి తనకు ప్రాణభయం ఉన్నట్టు రామారావు భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోదండరామారావుకు, వీరాస్వామికి మధ్య రూ.2.50 కోట్లు లావాదేవీల విషయంలో గొడవలు మరింత తీవ్రమయ్యాయి. డబ్బు విషయంలో కోదండరామారావు వీరాస్వామిని గట్టిగా నిలదీశాడు. దీంతో వీరాస్వామి కేసులు ఉపసంహరించుకోవాలని బెదిరించాడు. నాలుగు రోజుల క్రితం రెడ్డి రామారావును అతని ఇంటి నుంచే వీరాస్వామి కారులో తీసుకెళ్లాడు. దీంతో కోదండరామారావు భార్య భీమవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు దర్యాప్తు జరుపుతున్నారు. ఈక్రమంలోనే కోదండరామారావును హత్య చేసి అచుతాపురంలో పడేశారు. అశ్వారావుపేట పోలీసులు మృతదేహాన్ని కనుక్కొని ఆ సమాచారాన్ని భీమవరం పోలీసులకు చేరవేశారు. వారు స్థానిక పోలీసుల సహకారంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా కోదండరామారావును కిడ్నాప్‌ చేసిన కొన్ని  గంటల్లోనే హత్య చేసి అచుతాపురంలో పడేశారని భీమవరం పోలీసులు తెలిపారు. కాగా ఘటనపై కేసు నమోదు చేశామని వివరించారు. కాగా కోదండరామారావు కిడ్నాప్‌, హత్య ఉదంతం అచుతాపురంలో సంచలనం కలిగించింది.

Updated Date - 2021-02-17T04:57:17+05:30 IST