ప్రాణం తీసిన షేర్‌చాట్‌ పరిచయం

ABN , First Publish Date - 2021-11-26T06:19:35+05:30 IST

షేర్‌చాట్‌ పరిచయం భర్త, ఇద్దరు పిల్లలతో సజావుగా సాగిపోతున్న ఓ వివాహిత ప్రాణాన్ని తీసింది. ఈ నెల 19న గుజ్జనగుండ్లలో జరిగిన వివాహిత నూతి కోటేశ్వరి హత్య కేసులో మిస్టరీ వీడింది.

ప్రాణం తీసిన షేర్‌చాట్‌ పరిచయం
వివరాలు వెల్లడిస్తున్న అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌, వెనుక నిందితుడు అఖిల్‌

వివాహిత హత్య కేసులో నిందితుడి అరెస్టు 

గుంటూరు, నవంబరు 25: షేర్‌చాట్‌ పరిచయం భర్త, ఇద్దరు పిల్లలతో సజావుగా సాగిపోతున్న ఓ వివాహిత ప్రాణాన్ని తీసింది. ఈ నెల 19న గుజ్జనగుండ్లలో జరిగిన వివాహిత నూతి కోటేశ్వరి హత్య కేసులో మిస్టరీ వీడింది.   తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరెంపల్లి భూర్గంపాడు మండలం అంజనాపురానికి చెందిన గుగులోతు అఖిల్‌ అలియాస్‌నాయక్‌ను అరెస్టు చేశారు. గురువారం పోలీసు కార్యాలయంలో అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ నిందితుడ్ని  మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామానికి చెందిన నూతి కోటేశ్వరి,  నాగేశ్వరరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బతుకుదెరువు కోసం వీరు మూడేళ్ల క్రితం గుంటూరు వచ్చారు. కోటేశ్వరికి మూడు నెలల క్రితం షేర్‌చాట్‌ ద్వారా అఖిల్‌నాయక్‌ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో వారి సాన్నిహిత్యం శారీరక సంబంధానికి దారితీసింది.   తాత్కాలికంగా డబ్బు సర్దుబాటు చేయమని కోటేశ్వరి కోరగా ఒకసారి రూ.30వేలు, మరోసారి రూ.44 వేలు కుటుంబసభ్యులకు తెలియకుండా అఖిల్‌ తెచ్చి ఇచ్చాడు. ఇంట్లో నగదు తగ్గడంతో కుటుంబసభ్యులు అఖిల్‌పై ఒత్తిడి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో నిందితుడు మృతురాలు కోటేశ్వరికి ఫోన్‌ చేసి తన డబ్బు తనకివ్వాలని కోరాడు. దీంతో గుంటూరు వస్తే డబ్బు ఇస్తానని చెప్పడంతో ఈ 19న కోటేశ్వరి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత బ్రాడీపేటలోని బంగారు షాపుకు వెళ్లి ఆభరణాలు కొనుగోలుకు సిద్ధమైన కోటేశ్వరి రూ.50 వేలు అవసరం కాగా ఆ మొత్తం ఇవ్వాలని అఖిల్‌ను కోరింది. గతంలో ఇచ్చిన నగదు కోసం వస్తే మళ్లీ నగదు అడుగుతావేమిటని అఖిల్‌ను నిలదీశాడు. దీంతో ఇద్దరూ  ఇంటికి చేరుకున్నారు. నగదు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన అఖిల్‌ కిందపడేసి ఆమెను కొట్టడంతో మృతి చెందింది. అనంతరం కోటేశ్వరి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని అఖిల్‌ నేరుగా తన ఇంటికి చేరుకున్నాడు.  పాల్వంచలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో బంగారం తాకట్టుపెట్టి అప్పులు తీర్చి ఆ తరువాత నేరుగా హైదరాబాద్‌ వెళ్లాడు. అయితే కేసు దర్యాప్తులో సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితుడు అఖిల్‌ను అరెస్టుచేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసులో  ప్రతిభ చూపిన సీఐ రాజశేఖరరెడ్డి, ఎస్‌ఐ రహమాన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ కోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు ఉమామహేష్‌, ఎం.అశోక్‌,బి హనుమంతరావు, విశ్వేశ్వరరావులకు రివార్డులు ప్రకటించారు. షేర్‌చాట్‌ ద్వారా పరిచయమైన మహిళలు, యువతులను అఖిల్‌ మాయమాటతో మోసం చేసినట్లు అర్బన్‌ ఎస్పీ తెలిపారు.  

Updated Date - 2021-11-26T06:19:35+05:30 IST