ప్రేమోన్మాదం

ABN , First Publish Date - 2020-12-03T06:28:31+05:30 IST

నగరంలో ప్రేమోన్మాదుల దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రేమ పేరుతో యువతుల వెంటపడుతున్న పోకిరీలు...తమ ప్రేమను అంగీకరించకపోతే విచక్షణ కోల్పోతున్నారు.

ప్రేమోన్మాదం
కేజీహెచ్‌లో బాధితురాలు ప్రియాంక, కేజీహెచ్‌లో శ్రీకాంత్‌

నగరంలో మరో దారుణం

యువతి గొంతు కోసిన కిరాతకుడు

నెల రోజుల వ్యవధిలో రెండో ఘటన

ప్రేమ పేరుతో పోకిరీల వేధింపులు

కాదంటే  విచక్షణరహితంగా దాడులు

కడతేర్చేందుకు కూడా సిద్ధపడుతున్న వైనం

వరుస ఘటనలతో సర్వత్రా ఆందోళన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో ప్రేమోన్మాదుల దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రేమ పేరుతో యువతుల వెంటపడుతున్న పోకిరీలు...తమ ప్రేమను అంగీకరించకపోతే విచక్షణ కోల్పోతున్నారు. తాము ఇష్టపడిన వ్యక్తులు...వేరొకరితో మాట్లాడినా తట్టుకోలేకపోతున్నారు. ఉన్మాదుల్లా మారిపోయి గొంతు కోస్తున్నారు. నెల రోజుల కిందట గాజువాక సుందరయ్య కాలనీలో వరలక్ష్మి హత్య ఘటనను మరువక ముందే బుధవారం వన్‌టౌన్‌లోని థామ్సన్‌ వీధికి చెందిన యువతిని మరొక ఉన్మాది గొంతు కోయడం నగరంలో కలకలం రేపింది. 


సినిమాలతోపాటు అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నగరంలో యువత నడవడికపై ప్రభావం చూపుతోంది. ఫ్యాషన్‌ కోసం ప్రేమ పేరుతో యువతులు, బాలికల వెంట పడుతున్నారు. ప్రేమను కాదంటే తట్టుకోలేక ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. దాడులు, హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా తరచుగా ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటుండడం నగరవాసులను ఆందోళనకు గురిచే స్తోంది. గాజువాక సుందరయ్య కాలనీకి చెందిన పదిహేడేళ్ల బాలిక వరలక్ష్మిని ఆమె సోదరుడి క్లాస్‌మేట్‌ అయిన అఖిల్‌ ప్రేమ పేరుతో వెంటపడి వేధించేవాడు. ఆమె తన ప్రేమను అంగీకరించకపోవడంతో వేరొకరితో సన్నిహితంగా వుంటోందనే అనుమానం పెంచుకున్నాడు. మాట్లాడాలని చెప్పి అక్టోబరు 31న సమీపంలోని గుట్టపైకి పిలిచి గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. అంతకుముందు కూడా నగరంలో ఇదే తరహా దాడులు జరగడంతో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు నగర పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్మాదులకు అడ్డుకట్ట వేయడంతోపాటు నేరప్రవృత్తి అలవడకుండా వుండేందుకు బాల్యం నుంచి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించారు. అందుకోసం ‘నేటి యువతే...రేపటి పౌరులు’ పేరుతో షార్ట్‌ ఫిల్మ్‌ రూపొందించి, సోషల్‌ మీడియా ద్వారా విద్యార్థులు, యువతకు అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలలు, కాలేజీలకు పోలీసులు వెళ్లి ప్రేమ పేరుతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ చైతన్యం కల్పిస్తున్నారు. అయినప్పటికీ కొంతమందిలో మార్పు కనిపించడం లేదు. తాజాగా బుధవారం ఉదయం వన్‌టౌన్‌ ప్రాంతంలో మరో ప్రేమోన్మాది ఒక యువతిపై కత్తితో దాడి చేసి మెడను కోశాడు. ఈ ఘటనలో యువతి కుటుంబసభ్యులు సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకోగలింది. ఇలా..తరచూ ఎక్కడో ఒక చోట ప్రేమోన్మాదుల దాడులు జరుగుతుండడంతో బాలికలు, యువతులతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


వెంటపడుతున్నా, వేధిస్తున్నా సమాచారం ఇవ్వండి

- ఐశ్వర్య రస్తోగి, డీసీపీ-1

తరచూ ప్రేమోన్మాదుల దాడులు జరుగుతుండడం తీవ్ర విచారకకం. వీటికి అడ్డుకట్టపడాలంటే యువతీయువకులతోపాటు తల్లిదండ్రులు సకాలంలో పోలీసుల సేవలను ఉపయోగించుకోవాలి. ఎవరైనా ప్రేమ పేరుతో  తమ పిల్లల వెంటపడుతున్నా, వేధిస్తున్నా సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ లేదా డయల్‌ 100 లేదా 112కి సమాచారం ఇవ్వాలి. ఎవరైతే వేధిస్తున్నారో...వారిని పిలిచి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ప్రేమ పేరుతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పడంతోపాటు, వేధించినా, వెంటపడినా ఎదురయ్యే కేసులు, శిక్షలను వారికి అర్థమయ్యేలా వివరిస్తారు. తద్వారా తమ తప్పు సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. తమ పిల్లలను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళితేనే చిన్నతనంగా భావించేవాళ్లు...నేరం చేస్తే జైలుకెళ్లాల్సి వుంటుందని, సమాజంలో తలదించుకోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రేమ పేరుతో జరిగే నేరాల నియంత్రణకు పోలీస్‌ శాఖ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - 2020-12-03T06:28:31+05:30 IST