Hyderabad: వీడిన హత్య కేసు మిస్టరీ..భార్యసహా ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2021-10-27T18:24:14+05:30 IST

నగర శివార్లలోని ఈనాంగూడ వద్ద గత శుక్రవారం అర్ధరాత్రి జరిగిన హత్య (విజయవాడ హైవే మర్డర్‌) కేసును హయత్‌నగర్‌ పోలీసులు ఛేదించారు. మృతుడి భార్య, ఆమె ప్రియుడు...

Hyderabad: వీడిన హత్య కేసు మిస్టరీ..భార్యసహా ముగ్గురి అరెస్టు

హైదరాబాద్/కొత్తపేట: నగర శివార్లలోని ఈనాంగూడ వద్ద గత శుక్రవారం అర్ధరాత్రి జరిగిన హత్య (విజయవాడ హైవే మర్డర్‌) కేసును హయత్‌నగర్‌ పోలీసులు ఛేదించారు. మృతుడి భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర షోలాపూర్‌కు చెందిన వ్యక్తికి(35), కర్ణాటక గుల్బర్గా ఫిరోజ్‌బాగ్‌కు చెందిన ఓ మహిళకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు సైదాబాద్‌ జహంగీర్‌నగర్‌లో నివసిస్తున్నారు. భర్త ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, భార్య ఇంద్రప్రస్థ కాలనీలో కూరగాయలు విక్రయిస్తుండేది. 


గుల్బర్గాకు చెందిన హమీద్‌పటేల్‌, ఆటోడ్రైవర్‌ భార్య గతంలో ప్రేమించుకున్నారు. హమీద్‌ సైదాబాద్‌ సపోటాబాగ్‌లో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హమీద్‌ పటేల్‌, ఆ దంపతులకు దూరపు బంధువు కావడంతో తరచూ వారి ఇంటికి వెళ్లేవాడు. భార్యపై అనుమానంతో భర్త ఆమెను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో భర్తను హత్య చేయాలని ఆమె, హమీద్‌పటేల్‌, సయ్యద్‌ నయాబ్‌ పథకం వేశారు. ఆమె భర్తతో గత శుక్రవారం మద్యం తాగించి.. అతడు మత్తులోకి జారుకున్నాక హమీద్‌పటేల్‌ ఇనుపరాడ్‌తో తలపై కొట్టాడు. సయ్యద్‌ నయాబ్‌ కత్తితో గొంతుకోయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. హయత్‌నగర్‌- కుంట్లూరు రోడ్డులో మృతదేహాన్ని పారేద్దామని భావించారు. పోలీస్‌ వాహనం వస్తున్నట్లు గుర్తించి వెనక్కి వచ్చారు. విజయవాడ జాతీయ రహదారిలో మృతదేహాన్ని పారేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించామని డీసీపీ తెలిపారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణం కావచ్చన్నారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, ఐటీ టీం ఇన్‌చార్జి శ్రీధర్‌రెడ్డి, హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌, డీఐ నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T18:24:14+05:30 IST