అదృశ్యమైన భార్య కోసం వేధిస్తున్నాడనే హత్య

ABN , First Publish Date - 2022-06-28T05:57:02+05:30 IST

అదృశ్యమైన భార్య కోసం వేధిస్తున్నాడనే హత్య

అదృశ్యమైన భార్య కోసం వేధిస్తున్నాడనే హత్య
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శేఖర్‌గౌడ్‌, సీఐ రాజేందర్‌రెడ్డి

  • గ్రీన్‌సిటీ హత్య కేసును ఛేదించిన పోలీసులు

తాండూరు రూరల్‌, జూన్‌ 27: తాండూరు పట్టణ గ్రీన్‌సిటీలో జరిగిన వ్యక్తి హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ సోమవారం వెల్లడించారు. ఈ నెల 24న తాండూరు పట్టణం గ్రీన్‌సిటీ కాలనీలో 40ఏళ్ల వయస్సున్న వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం హతుడు ఏపీలోని వైజాక్‌ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్‌(40)గా గుర్తించారు. అతడు పాత తాండూరులో ఉంటూ కారు పెయింటర్‌గా పనిచేసేవాడు. అతడి భార్య తాండూరులోనే ఆశా వర్కర్‌గా పనిచేసేది. లక్ష్మణ్‌ కుటుంబానికి పాత తాండూరుకే చెందిన అబ్దుల్‌ కలీం పరిచయమయ్యాడు. ఈ క్రమంలో కలీంకు లక్ష్మణ్‌ భార్యతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ విషయం లక్ష్మణ్‌కు తెలిసి భార్యను మందలించాడు. దీంతో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదృశ్యమైన తన భార్య ఎక్కడుందో చెప్పాలని కలీంపై లక్ష్మణ్‌ ఒత్తిడి తెచ్చాడు. లక్ష్మణ్‌ భార్య అప్పటికే వేరే వ్యక్తితో వెళ్లిపోయినట్లు కలీంకు తెలిసింది. ఈ విషయాన్ని అతడు లక్ష్మణ్‌కు చెప్పలేదు. కలీమే తన భార్యను అపహరించాడని లక్ష్మణ్‌ అనుమానించాడు. లక్ష్మణ్‌తో ఎప్పటికైనా ప్రమాదమని అబ్దుల్‌ కలీం.. లక్ష్మణ్‌ హత్యకు పథకం వేశాడు. కలీం గురువారం లక్ష్మణ్‌ను తన స్నేహితుడు మహ్మద్‌ గులాంతో కలిసి బైక్‌పై రాత్రి గ్రీన్‌సిటీ సమీపంలోకి తీసుకెళ్లారు. ముగ్గురు కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న లక్ష్మణ్‌ను కలీం కత్తితో పొడిచి, కత్తిని పొదల్లో పడేసి పారిపోయారు.


  • క్యారీబ్యాగ్‌ ఆధారంగా హంతకుడి గుర్తింపు

హత్యా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్‌ మృతుడి వివరాలను తెలుసుకున్నారు. సంఘటనా స్థలం లో లభించిన క్యారీ బ్యాగ్‌ ఆధారంగా విచారణ చేశారు. అబ్దుల్‌ కలీమే ఆ క్యారీ బ్యాగ్‌ కొన్నట్టు నిర్ధారించి అతడిని విచారించారు. కలీం నేరాన్ని అంగీకరించాడని డీఎస్పీ వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కలీంను సోమవారం కోర్టులో హాజరుపరిచి, అతడిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

Updated Date - 2022-06-28T05:57:02+05:30 IST