వివాహిత హత్య

ABN , First Publish Date - 2021-01-16T06:25:48+05:30 IST

శెట్టూరు మండలం మంగంపల్లి గ్రామానికి చెందిన షేక్‌చాందిని (22) గురువారం హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వివాహిత హత్య

కళ్యాణదుర్గం, జనవరి 15 : శెట్టూరు మండలం మంగంపల్లి గ్రామానికి చెందిన షేక్‌చాందిని (22)  గురువారం హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. షేక్‌చాందినికి కర్ణాటకలోని పరుశురాపురం సమీపంలోని కండెనహళ్లి గ్రామానికి చెందిన దాదాఫీర్‌తో 2015లో వివాహమైంది. దాదాపీర్‌ వరకట్నం కోసం ఆమెను వేధించేవారు. దీంతో ఏడాది అనంతరం కాన్పు నిమిత్తం పుట్టింటికి వచ్చిన చాందిని తిరిగి మెట్టినింటికి వెళ్లలేదు. భర్త కూడా ఆమెను కాపురానికి పిలుపుకునేందుకు ఆసక్తి చూపలేదు. వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ 2019లో శెట్టూరు పోలీస్‌ స్టేషన్‌లో షేక్‌చాందిని ఫిర్యాదు చేసింది. ఆమెకు తండ్రి లేకపోవడంతో తల్లి ఫాతిమ, అమ్మమ్మ హిమామ్‌బీ, సోదరుడు కరీమ్‌, తను మూడేళ్ల కుమారుడితో కలిసి ఉండేది. కళ్యాణదుర్గం పట్టణంలోని ఓ గార్మెంట్‌లో దిన కూలీగా పని చేసేది. ఈనెల 12న సాయంత్రం నాలుగు గంటలకు ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన ఆమె ఇంటికి రాలేదు. ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. తన అక్క మృతదేహం అటవీ ప్రాంతంలో పడి ఉన్నట్లు మిత్రుల ద్వారా తెలుసుకున్న కరీమ్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐలు శివశంకర్‌నాయక్‌, రామరావు, రూరల్‌ ఎస్‌ఐ సుధాకర్‌ అటవీ ప్రాంతంలో గాలించి చాందిని మృతదేహాన్ని గుర్తించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ రమ్య పరిశీలించారు. చాందిని భర్త దాదాపీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెల్సింది. అయితే అతనికి ఈ హత్యతో  సంబంధం లేనట్లు వారి ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.


సరిహద్దు తేలక..:  బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం రూరల్‌, పట్టణ పరిసరాల సమీపంలోని అటవీ ప్రాంతంలో చాందిని హత్యకు గురైంది. ఆ స్థలం ఏ స్టేషన్‌ పరిధిలో వస్తుందో గుర్తించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో చాందిని మృతదేహం పోస్టుమార్టం వాయిదావేశారు. శుక్రవారం కళ్యాణదుర్గం ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ నాగరాజు రెవెన్యూ సిబ్బందితో వెళ్లి.. ఆ స్థలం రూరల్‌ పరిధిలోకే వస్తుందని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు ఆ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.  



Updated Date - 2021-01-16T06:25:48+05:30 IST