బైక్‌ వివాదం.. యువకుడి హతం

ABN , First Publish Date - 2022-05-19T05:08:15+05:30 IST

మోటారు బైక్‌ తాకట్టు వివాదం ఓ యువకుడ్ని బలి తీసుకుంది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ యువకుడు బుధవారం మృతి చెందగా అతడి బంధువులు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు.

బైక్‌ వివాదం.. యువకుడి హతం
అఖిల్‌ మృత దేహం

దాడిలో తీవ్రగాయాలు.. చికిత్స పొందుతూ మృతి 

నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువుల రాస్తారోకో 

నరసరావుపేట లీగల్‌, మే 18: మోటారు బైక్‌ తాకట్టు వివాదం ఓ యువకుడ్ని బలి తీసుకుంది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ యువకుడు బుధవారం మృతి చెందగా అతడి బంధువులు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. పట్టణానికి చెందిన ఓర్చు గోపి అనే యువకుడి వద్ద వీరాంజనేయులు మోటారు బైక్‌ తాకట్టు పెట్టి రూ.13 వేలు నగదు తీసుకున్నాడు. ఆ తర్వాత వడ్డీతో కలిసి రూ.16 వేలు చెల్లించి బైక్‌ తీసుకున్నాడు. అయితే బైక్‌  స్టాండ్‌ వంకర పోయి ఉండటంతో వీరాంజనేయులు మిత్రులైన వావిచర్ల అఖిల్‌(21)కు చెప్పాడు. దీంతో వావిచర్ల అఖిల్‌ గోపి మిత్రుడైన నజీర్‌ను బైక్‌ విషయం గురించి ప్రశ్నించి దురుసుగా ప్రవర్తించాడు. దీనిని మనస్సులో పెట్టుకున్న నజీర్‌ ఈ నెల 14 తెల్లవారుజామున  శివారపు అఖిల్‌, పవన్‌ మరో ఎనిమిది మందితో కలిసి పెదచెరువులోని 5వ లైన్‌లో ఉంటున్న వావిచర్ల అఖిల్‌ ఇంటికి వెళ్లి నిద్రలేపి దాడికి ప్రయత్నించాడు. దీంతో అఖిల్‌ పెదచెరువులోని 3వ లైన్‌లోకి పరుగుతీశాడు. అయినా వదలకుండా వాహనాలపై వెంబడించిన వారు రాడ్లు, కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఈ దృశ్యం ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో కూడా రికార్డు అయ్యింది. తీవ్రంగా గాయపడిన వావిచర్ల అఖిల్‌ అప్పటి నుంచి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీంతో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ మృతదేహంతో పల్నాడు బస్టాండ్‌లో ధర్నాకు దిగారు. దీంతో ఆర్డీవో శేషిరెడ్డి, డీఎస్పీ విజయభాస్కరరావు ధర్నా చేస్తున్న వారితో మాట్లాడారు. నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి శవపరీక్ష నిమిత్తం తరలించారు. కాగా ఈ సంఘటనకి కారకుడైన ఓర్చు గోపి ధర్నా సమయంలో చిలకలూరిపేట ఆర్టీసీ బస్సు అద్దాలు పగల గొట్టాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులు తనిఖీ చేయగా అతడి వద్ద గంజాయి లభించినట్టు సమాచారం. గోపితో పాటు మరో ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన మొత్తానికి గంజాయి తాగడమే ప్రధాన కారణంగా సమాచారం. 

నిందితులకు శిక్షలు పడేలా చర్యలు 

రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు బస్వరావు అఖిల్‌ ఇంటికి వెళ్ళి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అఖిల్‌ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పది మంది విచక్షణా రహితంగా దాడి చేసి కులం పేరుతో దూషిస్తూ కొట్టారన్నారు. చట్ట ప్రకారం మృతుడి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. రమ్య కేసులో నిందితులకు శిక్ష పడినట్లే  అఖిల్‌ మృతికి కారణమైన వారికి కూడా పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయవాదులువ్వరూ నిందితులకు సహాయం చేయకుండా ఉండాలని కోరారు. భవిష్యత్‌లో ఎస్సీలపై చేయి చేసుకుంటే భయపడే విధంగా శిక్షలు పడతాయని తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో శేషిరెడ్డి, డీఎస్పీ విజయభాస్కరరావు, రెవెన్యూ అధికారి రమణానాయక్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-05-19T05:08:15+05:30 IST