ఇనగండ్ల సర్పంచ్‌ హత్య

ABN , First Publish Date - 2021-07-25T06:20:13+05:30 IST

మండలంలోని ఇనగండ్ల సర్పంచ్‌ దేవసహాయం (70) హత్యకు గురయ్యారు.

ఇనగండ్ల సర్పంచ్‌ హత్య

సి.బెళగల్‌, జూలై 24: మండలంలోని ఇనగండ్ల సర్పంచ్‌ దేవసహాయం (70) హత్యకు గురయ్యారు. ఒక చర్చి ఫాదర్‌పై దాడి విషయమై ఇరువర్గాల మధ్య గొడవ జరిగి ఈ ఘటనకు దారి తీసింది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. సర్పంచ్‌ ఎన్నికల్లో ఇమ్మానుయేలుపై దేవసహాయం గెలుపొందారు. అయితే వార్డు సభ్యుల్లో ఇమ్మానుయేలు మద్దతుదారులు 8 మంది, దేవ సహాయం మద్దతుదారులు నలుగురు విజయం సాధించారు. ఇదిలా ఉండగా గ్రామంలోని చర్చిలో ఉదయకుమార్‌ అనే వ్యక్తి 13 ఏళ్లుగా ఫాదర్‌గా పనిచేస్తున్నారు. ఇమ్మానుయేలు ఒత్తిడితో ఆయన రాజీనామా చేసి మరోచోట స్థలం కొనుగోలు చేసి ప్రార్థన మందిరం నడుపుకుంటున్నారు. కర్నూలులో నివాసం ఉంటూ ఇక్కడికి వచ్చి వెళ్లేవారు. అయితే శుక్రవారం ఉదయ్‌కుమార్‌ ప్రార్థన ముగించుకుని కర్నూలుకు వెళ్తుండగా ఇమ్మానుయేలు, ఆయన వర్గీయులు గూడూరు వద్ద పొనకల్‌ సమీపంలో దాడి చేశారు. ఉదయ్‌కుమార్‌ చేయి విరగ్గొట్టారు. బాధితుడు గూడూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలని ఎస్‌ఐ చెప్పారు. ఈ విషయమై సర్పంచ్‌ దేవసహాయం శుక్రవారం ఇమ్మానుయేలును ప్రశ్నించారు. దీంతో ఇమ్మానుయేలు వర్గీయులు సర్పంచ్‌ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. దేవసహాయం తీవ్రంగా గాయపడడంతో కుటుంబీకులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేవసహాయం మృతి చెందారు. ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీతో పాటు ఎమ్మిగనూరు డీఎస్పీ శ్రీనివాసనాయక్‌, కర్నూలు డీఎస్పీ మహేష్‌, కోడుమూరు సీఐ శ్రీధర్‌ తదితరులు గ్రామానికి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ శివాంజల్‌ తెలిపారు.

Updated Date - 2021-07-25T06:20:13+05:30 IST