నడిరోడ్డుపై హత్య

ABN , First Publish Date - 2022-08-18T06:01:20+05:30 IST

అప్పటివరకూ ఇద్దరూ కలిసి బార్‌లో మద్యం సేవించారు. అక్కడ వివాదం తలెత్తడంతో కొట్లాడుకుంటూ బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఒకరు...కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో మరొకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎంవీపీ కాలనీ ఆదర్శనగర్‌లోని అనుపమ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద బుధవారం పట్టపగలు నడిరోడ్డుపై ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నడిరోడ్డుపై హత్య
హత్యకు గురైన బొడ్డు అనీల్‌ కుమార్‌ మృతదేహం

మృతుడిపై కాకినాడలో రౌడీషీట్‌?

పోలీసుల అదుపులో నిందితుడు...

అప్పటివరకూ ఇద్దరూ కలిసి బార్‌లో మద్యపానం

అంతలోనే వాగ్వాదం...బార్‌ బయటకు వచ్చి ఘర్షణ

కత్తితో 25 పోట్లు పొడవడంతో అక్కడికక్కడే మృతి

వ్యక్తిగత గొడవలే కారణమంటున్న పోలీసులు



విశాఖపట్నం/ఎంవీపీ కాలనీ, ఆగస్టు 17:

అప్పటివరకూ ఇద్దరూ కలిసి బార్‌లో మద్యం సేవించారు. అక్కడ వివాదం తలెత్తడంతో కొట్లాడుకుంటూ బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఒకరు...కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో మరొకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎంవీపీ కాలనీ ఆదర్శనగర్‌లోని అనుపమ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద బుధవారం పట్టపగలు నడిరోడ్డుపై ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

ఆదర్శనగర్‌కు చెందిన బొడ్డు అనిల్‌కుమార్‌ (38)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల కిందటి వరకూ కాకినాడలో ఉండేవాడు. ఆ తరువాత నగరానికి వచ్చి అప్పుఘర్‌ ప్రాంతంలో నివాసం వుంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదర్శనగర్‌లో పుట్టి పెరిగిన అనిల్‌కుమార్‌...ఆ ప్రాంతానికి చెందిన వాసుపల్లి శ్యామ్‌ప్రకాష్‌, హమీద్‌, పొట్టి ఎర్రయ్య మరికొందరితో స్నేహంగా ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నలుగురూ కలిసి అనుపమ బార్‌కు వెళ్లారు. నాలుగు గంటల వరకూ మద్యం సేవించారు. ఆ సమయంలో హమీద్‌ బయటకు వెళ్లిపోగా...అనిల్‌కుమార్‌, శ్యామ్‌ప్రకాష్‌ మధ్య ఏదో విషయమై వాగ్వాదం జరిగింది. ఇద్దరూ అక్కడే కొట్టుకోవడంతో బార్‌ సిబ్బంది వారించి బయటకు వెళ్లిపోవాలని సూచించారు. ఇద్దరు గొడవపడుతూనే బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో శ్యామ్‌ప్రకాష్‌ తన వద్ద వున్న బటన్‌ నైఫ్‌ను బయటకు తీసి అనిల్‌కుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. శరీరంపై సుమారు 25 వరకూ కత్తి గాయాలవ్వడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం శ్యామ్‌ప్రకాష్‌ అక్కడి నుంచి పరారైపోగా స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానకి చేరుకున్నారు. క్లూస్‌టీమ్‌ ఆధారాలు సేకరించిన తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.


పాత గొడవలే కారణం

అనిల్‌కుమార్‌, శ్యామ్‌ప్రకాష్‌ మధ్య రెండేళ్లుగా గొడవలు వున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కొన్నాళ్ల కిందట క్రికెట్‌ ఆడుతుండగా ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో అనిల్‌కుమార్‌ ముఖంపై ప్రకాష్‌ కారం కొట్టగా, అతను తప్పించుకుని పారిపోయినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. అదే సమయంలో అనిల్‌కుమార్‌పైకి క్రికెట్‌ బ్యాట్‌తో కూడా దాడికి యత్నించినట్టు పోలీసులు వివరించారు. ఈ క్రమంలో బుధవారం హత్య కూడా జరిగి వుంటుందని ఏసీపీ మూర్తి అనుమానం వ్యక్తంచేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించామని నిందితుడు ఒకడేనా, మరికొందరు ఉన్నారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. 


కాగా బార్‌లో సీసీ కెమెరాలు వున్నప్పటికీ హార్డ్‌ డిస్క్‌ లేకపోవడంతో ఫుటేజీ రికార్డు కాలేదు. బార్‌ పరిసరాల్లోని దుకాణాల వద్ద వున్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఘటనా స్థలంలో వున్న ఒక యువతి...ఇద్దరి కొట్లాటను తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసిందని, ఆమె సెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. కాగా అనిల్‌కుమార్‌పై కాకినాడలో ఒక హత్య కేసు వుందని, రౌడీషీట్‌ కూడా వుండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు శ్యామ్‌ప్రకాష్‌పై రౌడీషీట్‌ ఉందా? లేదా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రకాష్‌ తండ్రి క్రాంతిపై ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ వున్నట్టు చెబుతున్నారు. తన భర్తను ఒకరు హత్య చేయలేదని, పది మంది కొంతకాలంగా ప్లాన్‌ చేసి చంపేశారని, వారందరిపైనా కఠినచర్యలు తీసుకోవాలని అనిల్‌కుమార్‌ భార్య రాజేశ్వరి పోలీసులను డిమాండ్‌ చేశారు. హత్యకు సంబంధించి శ్యామ్‌ప్రకాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.


Updated Date - 2022-08-18T06:01:20+05:30 IST