గొంతు కోసి కడతేర్చారు..

ABN , First Publish Date - 2021-07-30T06:38:52+05:30 IST

వారిద్దరూ చిన్న నాటి నుంచీ

గొంతు కోసి కడతేర్చారు..
సంతోషి (ఫైల్‌)

ఇంట్లో అందరి ముందే చెల్లెలి గొంతు కోసిన అన్న

ఆస్తి కోసం హత్య

నగరంలోని హోటల్‌ గదిలో మరో హత్య

యువతి గొంతు కోసి చంపేసిన యువకుడు

ఆపై తానూ ఆత్మహత్య

హోటల్‌లో అసలేం జరిగింది..

ఆరా తీస్తున్న పోలీసులు


ఆస్తి కోసం చెల్లెలిని, కారణం తెలియదు కానీ.. మరో ఘటనలో యువతిని గొంతు కోసి దారుణంగా హత మార్చారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ హత్యలు కలకలం రేపాయి. మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో యువతి గొంతును బ్లేడుతో కోసి చంపేసిన యువకుడు.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వీరు స్నేహితులా, ప్రేమికులా? హోటల్‌లో ఎందుకు గొడవ పడ్డారు.. ఈ హత్యకు గల కారణాలు ఏంటనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.


మాదాపూర్‌ హోటల్‌లో ఘోరం

మాదాపూర్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : వారిద్దరూ చిన్న నాటి నుంచీ స్నేహితులు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని ఓ హోటల్‌లో దిగారు. ఏమైందో ఏమో కానీ గురువారం సాయంత్రం వారి మధ్య గొడవ ప్రారంభమైంది. అది తీవ్రస్థాయికి చేరింది. ఆవేశంలో బ్లేడుతో గొంతుకోసి యువతిని చంపేశాడు. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. 

మాదాపూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్‌ జిల్లా బొమ్మరాజ్‌పేటకు చెందిన సంతోషి, మహబాబునగర్‌ జిల్లా కోస్గి మండలానికి చెందిన జి.రాములు చిన్ననాటి నుంచి స్నేహితులు. బుధవారం మధ్యాహ్నం బొమ్మరాజపేట నుంచి మాదాపూర్‌కు వచ్చి లెమన్‌ ట్రీ హోటల్‌లో రూం తీసుకున్నారు. గురువారం సాయంత్రం హోటల్‌ నుంచి తిరిగి వెళ్లాలని అనుకున్నారు. అంతలో సంతోషి, రాములు గొడవ పడుతున్నట్లు గమనించిన హోటల్‌బాయ్‌ ఉంటారా, ఖాళీ చేస్తారా? అని అడగగా కాసేపట్లో చెబుతామన్నారు. సాయంత్రం 4 గంటల అయినా రూం నుంచి ఎలాంటి సమాచారమూ లేకపోవడంలో హోటల్‌ సిబ్బంది తలుపుకొట్టారు. తలుపులు తీయడం లేదు. హోటల్‌ సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా చున్నీతో  ఉరేసుకుని రాములు వేలాడుతూ కనిపించాడు. బాత్‌రూంలో సంతోషి రక్తపు మడుగులో మృతి చెంది ఉంది. హోటల్‌ సిబ్బంది సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్‌ రవీంద్రప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను బ్లేడుతో గొంతుకోసి హత్య చేసి, అనంతరం రాములు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. 

స్నేహితులా.. ప్రేమికులా? 

వికారాబాద్‌ జిల్లా లగచర్ల గ్రామానికి చెందిన సంతోషి (25),  హకీంపేటకు చెందిన రాములు (25) మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి మండలం హకీంపేటలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచీ వారి మధ్య స్నేహం కొనసాగుతోంది. ప్రస్తుతం సంతోషి పోలీసు ఉద్యోగం కోసం ప్రిపేర్‌ అవుతోంది. రెండేళ్ల క్రితం గ్రామంలోని పాఠశాలలో ఆమె విద్యావలంటీర్‌గా పని చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆమెకు తండ్రి లేడు. తల్లి బాలామణి, ముగ్గురు సోదరులు ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆమె స్వగ్రామంలోనే ఉంది. మూడు రోజుల క్రితమే హైదరాబాద్‌కు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఆమె రాములుతో కలిసి హోటల్‌కు ఎందుకు వెళ్లింది, అక్కడేం జరిగిందనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఇంట్లో అందరి ముందే గొంతు కోశాడు

లంగర్‌హౌస్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఆస్తి వ్యవహారాల్లో చెల్లెలు అడ్డు వస్తోందని సొంత అన్న ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. టోలిచౌకీలోని ఆడమ్‌ కాలనీలో నివాసముంటున్న ఫాతిమా (42) వృత్తిరీత్యా న్యాయవాది. భర్త చనిపోవడంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి జుబేదా బేగంతో కలిసి ఉంటోంది. ఆమెతో పాటు తోబుట్టువులు మొత్తం పది మంది ఉన్నారు. రెండు నెలల క్రితమే ఫాతిమా తండ్రి ఫకీర్‌ అలీ మృతి చెందాడు. తల్లిదండ్రుల ఆస్తుల విషయంలో ఫాతిమాకు, ఆమె అన్న మొహమ్మద్‌ ఆరీఫ్‌ అలీకి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. చెల్లెలు కిరాయి డబ్బులు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న ఆరీఫ్‌ అలీ ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో అందరూ చూస్తుండగానే కత్తితో ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంట్లో వారు పెద్దఎత్తున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ఆమె చనిపోయారు. హత్యపై ఫిర్యాదు అందుకున్న గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

నేడు విధుల బహిష్కరణ

గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళా న్యాయవాది ఫాతిమా హత్యకు నిరసనగా నాంపల్లి క్రిమినల్‌ కోర్టు బార్‌ అసోషియేషన్‌ అధ్వర్యంలో శుక్రవారం విధులు బహిష్కరిస్తున్నామని అసోషియేషన్‌ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.


Updated Date - 2021-07-30T06:38:52+05:30 IST